యువ కిరణాలపై ఆంక్షల మబ్బులు | Rajiv Yuva Kiranalu government's campaign | Sakshi
Sakshi News home page

యువ కిరణాలపై ఆంక్షల మబ్బులు

Published Mon, Dec 9 2013 4:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Rajiv Yuva Kiranalu government's campaign

 సీతంపేట, న్యూస్‌లైన్: రాజీవ్ యువకిరణాలతో ఉపాధి వెలుగులు పంచుతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ కిరణాలను మసకబార్చే చర్యలకు ఒడిగడుతోంది. ఈ పథకం కింద ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఒక్కొక్కటిగా మూసి వేస్తోంది. ఇందులో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఆరు కేంద్రాలకు నెల రోజుల కిందటే మంగళం పాడారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఐకేపీ ద్వారా నిర్విహ స్తున్న హిరమండలంలోని బీపీవో (బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్),పాతపట్నంలోని అకౌంటింగ్ ప్యాకేజీ కేంద్రాన్ని, సరుబుజ్జిలి, పలాసల్లోని కంప్యూటర్ అసిస్టెంట్ శిక్షణ  కేంద్రాలను, సోంపేటలోని అకౌంట్స్ శిక్షణ  కేంద్రాన్ని,పాలకొండలోని డాటాప్రో కంప్యూటర్ కేంద్రాన్ని ఎత్తివేశారు. గత రెండే ళ్లుగా పని చేస్తున్న ఈ కేంద్రాలను మూసివేయడంతో శిక్షణ కార్యక్రమాలు మూలన పడ్డాయి. ప్రస్తుతం సీతంపేటలోని పీఎంఆర్‌సీలో ఈజీఎంఎం, సూయింగ్ మెషిన్, హడ్డుబంగిలోని తాపీ శిక్షణ, అడ్డాకులగూడలోని నాక్, ఎచ్చెర్లలోని హోమ్‌కేర్ నర్సింగ్ కేంద్రాల్లోనే శిక్షణ ఇస్తున్నారు. వీటిలో 200 మందికి మించి నిరుద్యోగులు లేరు.
 
 ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే
 మరోవైపు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయా సంస్థలు చూపిస్తున్న ఉపాధి అవకాశాలు అరకొరగానే ఉంటున్నాయి. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ప్రకారం ఈజీఎంఎంలో భాగస్వాములైన స్కైలార్క్, శ్రీటెక్నో వంటి ప్రైవేటు సంస్థలు సబ్‌ప్లాన్ మండల కేంద్రాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి వంద మందిలో కనీసం 75 మందికైనా ఉద్యోగవకాశాలు కల్పించాల్సిన బాధ్యత శిక్షణ ఇచ్చే సంస్థలదే. అయితే ఈ విషయంలో సదరు సంస్థలు ఆసక్తి చూపించడం లేదు. ఆయా సంస్థలపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తెచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, అలా చేయకుండా శిక్షణ  కేంద్రాల ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. గతంలో ఒక సంస్థకు రాష్ట్రంలో ఎన్ని శిక్షణ కేంద్రాలైనా నెలకొల్పే వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం ఒక సంస్థ రాష్ట్రంలో ఐదు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆంక్షల కారణంగానే సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఆరు కేంద్రాలను ఎత్తి వేసిన ట్లు తెలిసింది.
 
 తగ్గిన నిరుద్యోగుల సంఖ్య
 ప్రతి  ఏటా  కనీసం వెయ్యి మంది  వరకు వివిధ కేంద్రాల్లో మార్కెటింగ్,  తాపీ పని, కంప్యూటర్ అసిస్టెంట్, నర్సింగ్, అకౌంటింగ్ ప్యాకేజీ, బీపీవో, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ పొందేవారు. ఇప్పుడు వారి సంఖ్య 200 లోపే ఉండటం గమనార్హం. కాగా ఉపాధి అవకాశాల పేరుతో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని చైన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపూర్ వంటి ప్రాంతాలకు పంపిస్తున్నా అక్కడి యాజమాన్యాలు జీతాలు సరిగా చెల్లించకపోవడం, శ్రమకు తగ్గ వేతనం లభించకపోవడం వంటి  కారణాలతో వెనుదిరుగుతున్నారు. దీంతో గ్రామీణ నిరుద్యోగులు శిక్షణ పొందడానికే అయిష్టత చూపుతున్నారు. అధికారులు జాబ్‌మేళాలు పెడుతున్నప్పటకీ ఫలితం లేకపోతోంది. 
 
 శిక్షణలకు ఢోకాలేదు: శ్రీనివాసరావు, జాబ్స్ జేడీఎం
 నిరుద్యోగుల శిక్షణ కార్యక్రమాలకు ఎటువంటి ఢోకాలేదు. సీఈవో రివ్యూ చేసిన తర్వాతే ఐటీడీఏ పరిధిలో ఉన్న కేంద్రాలను ఎత్తివేశాం. వీటి స్థానంలో కొత్త కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement