అనూహ్య పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో తనదైన ముద్రను కనబర్చలేకపోయారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అనూహ్య పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో తనదైన ముద్రను కనబర్చలేకపోయారు. మూడేళ్లు పూర్తి చేసుకున్నారనే మాటే తప్పిస్తే.. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రజలకు చేరువ కాలేకపోయింది. కొత్త పథకాలకు రూపకల్పన చేయడంతో పని అయిపోయినట్లుగా భావించడం.. లబ్ధిదారుల్లో అధికార పార్టీ అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారనే అపవాదు.. పారదర్శకత లోపించడం ఇతరత్రా కారణాలతో మెరుగైన పాలనను అందించలేకపోయారనేది విశ్లేషకులు అభిప్రాయం.
ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి పదిసార్లు జిల్లాలో పర్యటించినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయారు. అమ్మహస్తం.. బంగారుతల్లి.. రాజీవ్ యువకిరణాలు.. ఇందిర జలప్రభ.. అమృతహస్తం.. రైతులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు.. తదితర పథకాలను సీఎం ఆర్భాటంగా ప్రవేశపెట్టినా ప్రచారానికే పరిమితమయ్యాయి. అమలు అస్తవ్యస్తంగా మారడంతో వినియోగదారులు, లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. 2011 సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజులు పర్యటించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు 36 హామీలు గుప్పించారు. ఇందులో ఐదారు మినహా మిగిలినవేవీ పరిష్కారానికి నోచుకున్న దాఖలాల్లేవు. శ్రీశైలం ముంపు బాధితుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా మిగిలిన వారికి ఆరు నెలల్లో ఉద్యోగాలిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేకపోయింది. కొన్ని హామీలకు పరిష్కారం లభించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇందిరమ్మ బాటలో వివిధ వర్గాల ప్రజలు సీఎంకు పలు సమస్యలపై వినతులు అందజేశారు. దాదాపు 360 దరఖాస్తులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపడంతో చేతులు దులిపేసుకున్నారు.
వీటిలో ఒక్క సమస్యా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితులు ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక నీటి పారుదల రంగం కూడా అస్తవ్యస్తంగా మారింది. హంద్రీనీవా ప్రాజెక్టును రెండేళ్ల క్రితం ఆడంబరంగా ప్రారంభించినా జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందకపోవడం గమనార్హం. హంద్రీనీవా పరిధిలోని చెరువుల్లో నీటిని నింపి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నా చెవికెక్కించుకునే నాథుడే కరువయ్యాడు.