కిరణాలు మాయం
- రాజీవ్ యువకిరణాలపై నీలినీడలు
- ఉద్యోగాలొచ్చింది 36 శాతం మందికే
- అదీ రోజు కూలీ కంటే తక్కువ జీతాలు
- కొత్త ఉద్యోగాలు కలే!
‘‘లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు..కార్పొరేట్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ కార్యక్రమాలు.. కోట్లు వెచ్చించి శిక్షణ భాగస్వాములతో ట్రైనింగ్‌లు..’ ఇవీ ‘రాజీవ్ యువ కిరణాలు’ పథకం ప్రవేశపెట్టిన నాటి ఉద్దేశ్యాలు. అయితే ఈ కిరణాలు పెద్దగా ఎవరికీ వెలుగునిచ్చింది లేదు. భవిష్యత్తులోనూ ఈ పథకంపై నీలినీడలే గోచరిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతేమిటో తెలియకపోవడంతో అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు...’’
విశాఖ రూరల్ : ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం ప్రస్తుతం అమలవుతున్న యువకిరణాలు పథకం అమలు తీరుతెన్నులు పట్టించుకోవడం లేదు. దీంతో నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రతి ఇంట్లోను ఒకరికి ఉద్యోగం కల్పిస్తామంటూ ఊదరగొట్టి.. నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన ప్రభుత్వం చివరకు ఉసూరుమనిపించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాల పేరుతో ప్రైవేటు సంస్థలను పెంచి పోషించి.. కోట్లు ముట్టజెప్పి.. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో లక్ష్యానికి కనీసం చేరుకోలేక చతికిలపడింది. లక్ష్యంలో కేవలం 36 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించి చేతులు దులుపుకొంది.
లక్ష్యాలు ఘనం...
నిరుద్యోగ యువతకు వారి అర్హత, ఆసక్తి మేరకు ఆయా రంగాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం 2011లో ఆగస్టు 20న రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యాలను నిర్ధేశిస్తూ వస్తోంది. దీని ప్రకారం జిల్లాలో 2013, ఏప్రిల్ నుంచి 2014, మార్చి 31వ తేదీ వరకు 26,417 మందికి ఉద్యోగాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం- దీన్ని డీఆర్‌డీఏ పర్యవేక్షిస్తుంటుంది), మెప్మా, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ శాఖల ద్వారా వీరికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా 9,636 మందికి మాత్రమే ఉద్యోగాలు చూపించారు. ఇంకా 16,781 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
రోజు కూలి కన్నా తక్కువ జీతం
జిల్లాలో నిర్ధేశిత లక్ష్యంలో 36 శాతం మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించాయి. ఇందులో 25 శాతం మంది వరకు అసంఘటిత రంగ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం కూడా అందక అవస్థలు పడుతున్నారు. దీంతో దాదాపుగా 15 శాతం మంది ఉద్యోగాలను మానేసినట్టు అధికారులే చెబుతున్నారు. ఈ పథకం ద్వారా చెప్పుకోదగ్గ ఉద్యోగాలు వచ్చిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
కొత్త ఉద్యోగాలు కలే!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల కల్పనపై కనీసం దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలంలో 60 ఏళ్లకు పెంచడంతో ఇప్పట్లో ప్రభుత్వ కొలువులు దక్కే అవకాశం లేదని నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు చూపించాల్సిన ప్రభుత్వం కనీసం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన తరువాత గాలికొదిలేసిందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.