‘కిరణాల’ పేరిట దగా ! | Fake firms establishes with Health care treatment at Village | Sakshi
Sakshi News home page

‘కిరణాల’ పేరిట దగా !

Published Thu, Oct 17 2013 4:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

‘కిరణాల’ పేరిట దగా !

‘కిరణాల’ పేరిట దగా !

నిరుద్యోగులను నిండా ముంచుతున్న బోగస్ సంస్థలు
 అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు.. ఆనక భారీగా డిపాజిట్ల వసూలు

 
 సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ పేర పుట్టుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలవి... యువకులకు ఉద్యోగాల ఆశ ఎరచూపి డబ్బులు దండుకోవటం వాటి పన్నాగం. ఇలాంటి సంస్థల గుట్టు రట్టు చేసి నిర్వాహకులను కటకటాల వెనక్కు నెట్టాల్సిన అధికారులు, వాటితో జతకట్టారు. రాజీవ్ యువకిరణాల కింద నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేస్తామని అధికారులు బొంకేసరికి అభ్యర్థులు ఎగబడ్డారు. ఇంకేముంది.. ఆ సంస్థల నిర్వాహకులు కోరినంత ముట్టజెప్పారు. ధనదాహం తీరాక.. ఓ మంచి ముహూర్తం చూసుకుని అవి బోర్డు తిప్పేశాయి. ఇదేం దారుణమంటూ అభ్యర్థులు నిలదీస్తే ‘మాకు సంబంధం లేదు, డబ్బులెవరికిచ్చారో వారిని అడుక్కోండి’ అంటూ అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.         
 
 ఇలా వందలాది మంది యువజనులు దగా పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రిక ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట జరుగుతున్న నిలువు దోపిడీ ఇది! ఉద్యోగాల పేరు చెప్పి అమాయక యువత నుంచి డబ్బు దండుకొని ఉడాయించే దగాకోరులకు ఈ పథకం అండగా మారింది. వీరికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. విచిత్రమేమిటంటే... ఉద్యోగాలు కల్పించినట్టుగా రాజీవ్ యువకిరణాలు వెబ్‌సైట్‌లో అధికారులు చేర్చిన జాబితాలలో ఇలా దగాపడ్డ యువకుల పేర్లు ఉండడం! సీఎం మెప్పు కోసం అధిక ఉద్యోగాలు కల్పించామని చెప్పుకోవడానికి అధికారుల నిర్వాకాలు ఇవి.
 
 నిండాముంచిన స్వచ్ఛంద సంస్థ
 కర్నూలు జిల్లాలో రూరల్ హెల్త్ ఇండియా సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చే ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఆశలు రేపింది. రకరకాల ఉద్యోగాల్లో ఉపాధి చూపనున్నట్లు యువతకు ఎర వేసింది. వేల సంఖ్యలో యువకులు దరఖాస్తు చేసుకోగా.. డీఆర్‌డీఓ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు, శిక్షణ కార్యక్రమాల తంతు జరిపారు. ఎంపికైన వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల చొప్పున వసూలు చేశారు. భంగపడిన ఉద్యోగార్థుల గగ్గోలుతో ఈ అక్రమం వెలుగు చూసింది. కొద్దిరోజులకే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది.
 
  మోసపోయిన బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారుల సమక్షంలో ఎంపికలు జరగడంతో ఇవి ప్రభుత్వ పక్షాన జరిగే నియామకాలుగానే భావించి అడిగినంత డబ్బు ఇచ్చామని అభ్యర్థులు వాపోతున్నారు. మోసపోయిన విషయం గ్రహించి డీఆర్‌డీఓ అధికారులను నిలదీస్తే... డబ్బు వసూలుతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారని బాధితులు వాపోయారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ ‘రాజీవ్ యువకిరణాల’ బాధిత అభ్యర్థులు రోడ్డెక్కారు. దీంతో అధికారులు రాజీవ్ యువకిరణాలు వెబ్‌సైట్ నుంచి ఆయా అభ్యర్థుల పేర్లను తొలగించి చేతులు దులి పేసుకున్నారు. దీంతో యువకులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
 
 బోర్డు తిప్పేసిన ‘ఆరోగ్యదాత’
 శ్రీకాకుళం జిల్లాలో ‘ఆరోగ్యదాత’ అనే సంస్థ పేరిట ఇలాంటి మోసమే చేసింది. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ సంస్థ కూడా బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేర అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్య తీసుకునే వారే కరువయ్యారు. దీంతో ఇలాంటిదే ఓ సంస్థ విశాఖపట్టణంలో తాజాగా దుకాణం తెరిచింది. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేసే ఉద్యోగాలిస్తామంటూ అభ్యర్థులకు గాలం వేస్తోంది. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇలాంటి బోగస్ సంస్థలు అధికారుల అండతో నిరుద్యోగులకు శఠగోపం పెట్టే పనుల్లో నిమగ్నమయ్యాయని వినికిడి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే సంగతి దేవుడెరుగు.. ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట నిరుద్యోగులను నిండా ముంచుతున్న వారికి చెక్ పెట్టలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్న ఈ పథకంలో చీకటి కోణంపై ప్రభుత్వం దృష్టిసారించకపోవటం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement