అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘శిక్షణతో కూడిన ఉపాధి అంటే ఎంతో ఆశతో వెళ్లాం.. అక్కడ శిక్షణ ఏమాత్రం సరిగా లేదు. వారు చూపించిన ఉద్యోగం ఒక్క రోజు కూడా చేయలేక పోయాం. దీంతో ఉద్యోగం మానేసి సొంతూళ్లకు వచ్చాం. అయితే మా సర్టిఫికెట్లు ఇవ్వకుండా శిక్షణ సంస్థల నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారు’ అంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సోమవారం జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన కవిత, భాను, అనూషా, అంజలి, హరిత, సులోచన, త్రివేణి, నాగజ్యోతి, నారప్పరెడ్డి, నాగప్ప, తదితరులు డీఆర్‌డీఏ కార్యాలయంలో పీడీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఏడాది క్రితం నగరంలోని స్పందన ట్రైనింగ్ సెంటర్‌లో రాజీవ్ యువకిరణాలు పథకం కింద కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశామని, అనంతరం హైదరాబాద్‌లో పెళ్లి సంబంధాలు చూపే ఓ సంస్థలో ఉద్యోగం చూపించారని చెప్పారు. కానీ నెలకు 50 సంబంధాలు కుదిర్చితే తప్ప జీతం ఇవ్వబోమని ఆ సంస్థ నిర్వాహకులు చెప్పారని, జీతం కూడా చాలక పోవడంతో తిరిగొచ్చేశామని వాపోయారు.
తాము కోర్సు పూర్తి చేసినట్లుగా స్పందన ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వక పోగా, తమ 10వ తరగతి ఒరిజనల్ సర్టిఫికెట్ కూడా వారే తీసుకుని వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, గతంలో ఉద్యోగాల కోసం తమను తీసుకెళ్లినపుడు కూడా ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశారని వారు ఫిర్యాదు చేశారు. సర్టిఫికెట్లు వారి దగ్గర ఉండడంతో వేరే ఉద్యోగాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవే దన వ్యక్తం చేశారు. దీంతో పీడీ నీలకంఠారెడ్డి స్పందిస్తూ.. రాజీవ్ యువ కిరణాలు సిబ్బందిని వెంట పంపి సదరు కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుల నుంచి బాధిత విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇప్పించారు. నిరుద్యోగ అభ్యర్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాలోని కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
అరకొర శిక్షణ .. పనికి రాని ఉపాధి
Published Tue, Jun 3 2014 3:12 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement