‘బాబు’ మాట నీటిమూట
Published Thu, Jan 30 2014 2:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ‘రెంటికీచెడ్డ రేవడి’ సామెతను తలపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం సాగుతున్న సిగపట్లు చాలవన్నట్టు రాజ్యసభ ఎన్నికలు జిల్లా పార్టీలో అసంతృప్తికి మరింత ఆజ్యం పోశాయి. జిల్లాలో పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేస్తామని అధినేత చంద్రబాబునాయుడు ఆ వర్గానికి గత కొంతకాలంగా చెపుతున్నారు. ఆ మాటతో పెద్దలసభకు వెళ్లవచ్చని ఆశపడ్డ జిల్లాలోని ఆ సామాజికవర్గ సీనియర్ నాయకులకు చివరికి నిరాశే మిగిలింది.
రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సెంటిమెంట్‌కు కేంద్రబిందువైన పెద్ద జిల్లాలోని పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలిచిన తమను పక్కనబెట్టడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమకంటే జూనియర్ అయినప్పటికీ కేవలం ధనబలమే గీటురాయిగా పశ్చిమగోదావరి నుంచి తోట సీతారామలక్ష్మికి రాజ్యసభ సీటు కట్టబెట్టడాన్ని ఎత్తి చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, బీసీ సామాజికవర్గం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యంలలో ఏ ఒక్కరూ రాజ్యసభకు అర్హులు కారా అని జిల్లా తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని ఇవ్వకుండా ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారని కాపు సామాజికవర్గ నేతలు బాబుపై మండిపడుతున్నారు.
పెద్దజిల్లాపై ఇంత చిన్నచూపా..
పార్టీకి మొదటి నుంచీ చేసిన సేవంతా కేవలం ఆర్థిక స్తోమత లేనంత మాత్రాన లెక్కలోకి తీసుకోకుండా గాలిలో పెద్ద జిల్లాను చిన్నచూపు చూడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 2009 ఎన్నికల్లో తుని నుంచి మరో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడదామనుకుని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హవా ముందు నిలవలేక ఓటమిని చవి చూసిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకి కూడా రాజ్యసభ గత ద్వైవార్షిక ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా పక్కనబెట్టేశారు. ఇప్పటి మాదిరేఅప్పుడు కూడా చంద్రబాబు పార్టీ పట్ల నిబద్ధత కన్నాఆర్థిక అంశానికే ప్రాధాన్యం ఇవ్వడంతో యనమల చిరకాల వాంఛ నెరవేరలేదు. చివరకు ఎమ్మెల్సీతో సరిపెట్టుకోక తప్పలేదు. కాగా.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేసే నాయకత్వం కింద గత్యంతరం లేకే పని చేయాల్సి వస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని కోనసీమకు చెందిన ఒక టీడీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సీటుకు మొండిచెయ్యి చూపి, వచ్చే ఎన్నికల్లో పెద్దపీట వేస్తానంటే నమ్మే పరిస్థితి లేదని కాపు సామాజికవర్గ సీనియర్ నేతలు చంద్రబాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు.
విశ్వాసం లేకే వెనుకడుగు..
టీడీపీలోకి వస్తామని నిన్నమొన్నటి వరకు ఊగిన కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు ఇప్పుడు వెనుకడుగు వేయడానికి కారణం బాబు మాట నిలబెట్టుకుంటారన్న భరోసా లేకపోవడమేనని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. మరోవైపు జిల్లాలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చేసిన ప్రచారంతో ఒరిగింది లేకపోగా ఇంతవరకు వెంట ఉన్న బీసీలను సైతం పార్టీకి దూరమయ్యేలా చేసిందని సీనియర్లు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో బీసీల్లో బలమైన శెట్టిబలిజలకు కొత్తపేట, కాకినాడ రూరల్, రామచంద్రపురం టిక్కెట్లు ఇవ్వగా ఇతర బీసీలకు రాజమండ్రి రూరల్, తుని కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు కనీసం ఒక్క స్థానమైనా దక్కుతుందనే హామీ ఎక్కడా కనిపించడం లేదని ఆ వర్గ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు వైఖరితో రెండు బలమైన సామాజికవర్గాలకు పార్టీకి దూరమై పోయాయని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు.
Advertisement