
'ప్రతిపక్షాలతో కలిసి పోరాడతాం'
తిరుపతి: రైతులంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు చులకన అని శాసనమండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అందుకే రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. సినిమా షూటింగ్ల కోసం ఉపయోగించే రెయిన్ గన్స్ను పొలాలకు ఉపయోగిస్తే ఏం లాభం అని ధ్వజమెత్తారు.
వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పంట పొలాల గురించి తెలిసిన వ్యక్తిని మంత్రిగా నియమించాలని సూచించారు. ఆక్వా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ప్రతిపక్షాలతో కలిసి పోరాడతామని హెచ్చరించారు.