వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలి
గాంధీనగర్ : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రభుత్వాన్ని మోసగించి పేద దళితులకు కేటాయించే స్థలాన్ని అక్రమంగా పొందారని దళిత, క్రైస్తవ సంఘాల రాష్ట్ర నాయకుడు కామా దేవరాజు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళ వారం విలేకరులతో మాట్లాడారు. వర్ల రామయ్య 1983లో విజయవాడలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారన్నారు. ఆ సమయంలో పేద దళితుడినని చెప్పుకుని విద్యాధరపురం ఒకటో వార్డులో ఎన్‌టీపీఎస్ నం. 387/23పి, ఎల్‌పీ నం.14/83, ప్లాట్ నం. 20 నందు 253 చదరపు గజాలు స్థలాన్ని అక్రమంగా పొందారన్నారు. తాను సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారులను వివరాలు కోరగా, పేద దళితులకు కేటాయించే ఇంటి స్థలాన్ని 1983లో ఆయన పేరుతో పొందినట్లు అధికారులు ధ్రువీకరించి ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారం ఏ దళితుడికైనా కేవలం 90 చదరపు గజాల లోపు ఇళ్ల స్థలం కేటాయిస్తారన్నారు.
రామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దళితుడినని చెప్పుకుని ఇంటి స్థలం పొందడమే కాకుండా పక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మిం చారన్నారు. తన కుమారుడి పేర ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆల యంలో వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు ఈనెల 13న దానిపై విచారణ చేపట్టాలని భవానీపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న భవానీపురం పోలీసులు వర్ల రామయ్యపై ఎఫ్‌ఐఆర్ నం.
202/2015తో సెక్షన్ 405, 420 కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులపై వత్తిడి తెచ్చి కేసును తారుమారు చేయించే అవకాశం ఉందన్నారు. త్వరలో కలెక్టర్‌ను కలిసి వర్ల రామయ్య అక్రమంగా స్థలం పొందడం గురించి వినతి పత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి టి.సుందర్ ప్రసాద్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.