విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవై రామయ్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హామీలు అమలు చేయకుండా, రిజర్వేషన్ల పేరుతో వైషమ్యాలను రెచ్చగొట్టి సీఎం చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహిగా మారారని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. దేశంలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ చేయనంత అన్యాయం టీడీపీ చేసిందని విమర్శించారు. పార్టీ జిల్లా జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తానని చెప్పి.. నాలుగున్నరేళ్ల తరువాత కూడా అంత మొత్తం ఖర్చు చేయలేకపోయారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచి బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. హాస్టళ్లు, కాలేజీలను మూసివేయడంతోపాటు మహిళలకు రుణాలు కూడా మంజూరు చేయలేదన్నారు. ఆదరణ పథకంలో నాసిరకం పరికరాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.50 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఒక్కరైనా లబ్ధిదారుడిని చూపించాలని సవాల్ విసిరారు. ఫెడరేషన్‌కు వచ్చిన డబ్బునంతా మాయం చేశారని ఆరోపించారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ అంశంపై సమావేశమవుదామని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నారని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో జయహో బీసీ పేరిట చంద్రబాబు సదస్సులు నిర్వహించడం వంచించడమేనన్నారు.
కదలిరండి...
టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసే మోసాన్ని వివరించేందుకు 20వ తేదీ కర్నూలులో నిర్వహించే బీసీ ర్యాలీకి కర్నూలు పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది తరలి రావాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. ఉదయం పది గంటలకు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్ చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీవై రామయ్య పేర్కొన్నారు. బీసీల సమస్యలను తెలుసుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సెల్ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బుట్టా రంగయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు రియల్‌టైం నాగరాజుయాదవ్, సత్యం యాదవ్, డీకే రాజశేఖర్, ధనుంజయాచారి, నాయకులు బ్రదర్ రమణ, లక్కీటూ గోపినాథ్, రాధాకృష్ణ, శ్రీనివాసులు(సర్పంచ్), వెంకటేశ్వర్లు(అరికెర), సురేష్, లింగమల్లయ్య, కురవళ్లి శివ(ఆలూరు నియోజకవర్గం), కాశీ విశ్వనాథ్‌రెడ్డియాదవ్, మద్దిలేటి, రామకృష్ణ, విజయ యాదవ్, మల్లికార్జున యాదవ్, సహదేవుడు, కాల్వముని, కురువమద్దిలేటి(మంత్రాయలం) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment