సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితుల మధ్య వివాదం రోజు రోజుకు ముదిరిపోతోంది. ఆలయం నిర్వహణపై గత కొద్దికాలంగా రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ సింఘాల్ స్పందించారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. అయితే మరికొద్ది సేపటికే మీడియా ముందుకు వచ్చిన రమణ దీక్షితులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా శ్రీవారి ఆభరణాలను అర్చకులు కాపాడుతూ వచ్చారని అన్నారు. 1996లో మిరాశి రద్దు కావడంతో ఆభరణాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే స్వామివారి ఆభరణాలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు.
ఐదు పేట్ల ప్లాటినం హారంలో గులాబీ రంగు వజ్రం ఉండేదని, గరుడ సేవలో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిందని రికార్డుల్లో రాశారని, వజ్రం పగలడం జరుగుతుందా అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇటీవల జనీవాలో వేలం వేసిన వజ్రం ఇక్కడిదే అయి ఉండచ్చొని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఇరువై రెండేళ్లలో ఎన్ని మణులు, మాణిక్యాలు కనిపించకండా పోయాయని, వాటిపై ఎందుకు విచారణ చేపట్టేదని నిలదీశారు. ఇలాంటి తప్పిదాల కారణంగానే స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని, అలా జరిగితే భక్తులకు అనుగ్రహం దొరకదని అన్నారు.
వెయ్యికాళ్ల మండపం తొలగించకూడదని చాలాసార్లు చెప్పామని, శిల్ప సంపదతో కూడిన మండపాన్ని కాపాడాలని కోరినా కూడా ఫలితం లేకుండా పోయిందని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. రథ మండపాన్ని కూడా తేసేశారని అన్నారు. వీటన్నింటిని ప్రశ్నిస్తున్నందుకే తనని తొలగించారని పేర్కొన్నారు. శ్రీవారి అలంకారానికి పాత నగలు బదులు కొత్త నగలు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. టీటీడీ కింద అర్చకులు జీతగాళ్లు కాదని, సంభావణ కింద పనిచేస్తామని తెలిపారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ప్రాకారాలను ఎందుకు తవ్వారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందన్నారు. తాను తప్పులు చేస్తే శిక్షించాలని.. కానీ శ్రీవారి ఆస్తులను కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment