
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలత పెరిగింది. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తామని అధికార పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తే సమీపంలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరించదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేవని తాజాగా తేల్చిచెప్పింది. ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం అంగీకరించే
అవకాశముంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రామాయపట్నం పోర్టు కోసం వైఎస్సార్ సీపీ, వామపక్షాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు కోసం కావలి నుంచి రామాయపట్నం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. అధికారంలో ఉన్న టీడీపీ రామాయపట్నం పోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
రామాయపట్నమే పోర్టుకు అనుకూలత:
► కేంద్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మాణానికి రామాయపట్నం తీరం అనువైనదిగా ఇప్పటికే నివేదికనిచ్చింది.
► ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోర్టు కోసం అవసరమైన మేర ప్రభుత్వ భూములున్నాయి.
► ఇక్కడ సముద్రం సహజంగానే లోతుగా ఉంది. కాబట్టి షిప్‌యార్డు నిర్మాణానికి డ్రెడ్జింగ్ (ఇసుక తవ్వి బయటకు పోయడం) అవసరం ఉండదు.
► కేంద్ర నౌకాయాన శాఖలోని ఆర్థిక–రవాణా విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారి బీఎం అరోరా నేతృత్వంలోని కమిటీ రామాయపట్నం తీరం ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమని నివేదిక ఇచ్చింది.
► గ్రానైట్, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు భారీ స్థాయిలో ఎగుమతి చేయవచ్చు. దుబాయ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్ దేశాల కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.
► రామాయపట్నం తీరం నుంచి జాతీయ రహదారి, రైలు మార్గం రెండూ తీరానికి కేవలం 5 కి.మీ. లోపే ఉన్నాయి.
► రామాయపట్నంలో ప్రతిపాదించింది కేవలం పోర్టు నిర్మాణమే కాదు. షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ బ్రేకింగ్ యూనిట్ (డిస్‌మాల్టిల్), నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్. ఇవన్నీ వస్తే ఉద్యోగాల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
► రామాయపట్నం పోర్టు వస్తే గ్రానైట్, పత్తి, పొగాకు, ఆక్వా ఉత్పత్తులు, ఇనుప ఖనిజాల ఎగుమతులకు మరింత అనుకూలం.
దుగ్గిరాజపట్నంలో పోర్టు ఏర్పాటుకు అడ్డంకులు:
► అక్కడ షిప్‌యార్డు నిర్మిస్తే సమీపంలోనే ఉన్న పులికాట్ సరస్సుకు ముంపు వాటిల్లుతుంది. పర్యావరణ సమస్యలు ఎదురవుతాయి.
► ఖండాతరాల నుంచి విహారానికి వచ్చే పక్షులు ముఖం చాటేస్తే నేలపట్టుకు ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి కనుమరుగవుతుంది.
► షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నందున దేశ రక్షణ, ఆంతరంగిక భద్రత దృష్ట్యా అక్కడ షిప్‌యార్డు నిర్మాణం మంచిది కాదు.
► దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మిస్తే ఇప్పటికే ఉన్న కృష్ణపట్నం పోర్టు, దక్షిణాన కట్టుపల్లి, ఇన్నురు, చెన్నై పోర్టులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
► దుగ్గిరాజపట్నం తీరం జాతీయ రహదారికి, రైలు మార్గానికి చేరువలో లేనందున తీరాన్ని కలుపుతూ 50 కి.మీ. మేర రోడ్డు వేయాలి. అందు కోసం మళ్లీ ప్రైవేట్ భూములనే సేకరించాలి.
► ప్రభుత్వం కేటాయించిన డబ్బు దుగ్గిరాజపట్నంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ల్యాండ్‌ను మార్కెట్ ధరకి కొనడానికే చాలదు. మరీ షిప్‌యార్డును ఎలా నిర్మిస్తారు...? ఇప్పటికీ నిర్మిస్తారు...?
దుగ్గిరాజపట్నం ఏరియా కృష్ణపట్నం పోర్టు అథారిటీ ఎకనామిక్ జోన్ పరిధిలో ఉన్నందున వారు అంగీకరించే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment