‘నా కొడుకు ఎవలకు అన్యాయం చేసినోడు కాదు. సేవ చేసుడే ముఖ్యమనేటోడు. చిన్నతనంలోనే మంచి పేరు సంపాదించుకున్నడు. అయినా కొందరు గిట్టనోళ్లు నా బిడ్డను పొట్టన పెట్టుకున్నరు. రమేష్‌ను అన్యాయంగా చంపినోళ్లను, దానికి సహకరించిన పోలీసులను గట్టిగ శిక్షించాలె. అప్పుడే నా కొడుకు ఆత్మకు శాంతి కలుగుతది..’ అని గోదావరిఖనిలో 2010 ఫిబ్రవరి 9న హత్యకు గురైన కానిస్టేబుల్ ఎర్రగోల్ల రమేష్ తల్లి కొమురమ్మ తన మనోగతాన్ని వెల్లగక్కింది. - న్యూస్‌లైన్, గోదావరిఖని
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రమేష్ హత్యకేసులో నిందితులుగా పే ర్కొంటూ నలుగురు పోలీస్ అధికారులు, ఇద్ద రు వైద్యులపై కోర్టులో అనుబంధ చార్జిషీట్ దా ఖలు చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ‘మాకు నలుగురు కొడుకులు. రమేష్ మూడో సంతానం. ఆయనకు 2001లో శ్రీవల్లితో పెళ్లి చేసినం. వారికి ఇద్దరు పిల్లలు. కూతురు హసితాసాచి, కొడుకు సాయికౌషద్. ఇప్పుడు రమేష్ లేకపోవడంతో పిల్లల బతుకు ఆగమైంది.
పోలీ సులకు నా కొడుకు ఎంతో నమ్మకంగా పనిచేసిండు. వాళ్లేమో నమ్మించి మోసం చేసిండ్లు. రమేష్ పోయిననాడు కేసును రోడ్డు ప్రమాదంగా మార్చితే పైసలు అత్తయని పోలీసులు చెప్పిండ్లు. ఈ విషయం ఎవలకూ చెప్పద్దన్నరు. డ్యూటీలున్న ఓ పోలీస్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయిండని తెలుసుకోకుండా తోటి పోలీ సులే కేసును పక్కదోవ పట్టిచ్చిండ్లు. మా ఉసు రు వాళ్లకు తప్పక తగులుతది. నా కొడుకు గో దావరిఖనిలో పనిచేయనని అన్నడు. వేరేచోట కు పోయేతందుకు ఏర్పాట్లు చేసుకునే టైంలనే రమేష్‌ను పొట్టన పెట్టుకున్నరు. పోలీస్ పెద్దసారు (డీఐజీ రవిశంకర్ అయ్యన్నార్) చేయవట్టి పోలీసులపై కేసు పెట్టిండ్లు. ఈ హత్యను రోడ్డు ప్రమాదమని నమ్మించిన పోలీసోళ్లను కోర్టుకు పిలిచి శిక్షలు గట్టిగ వెయ్యాలే. ఇలాంటి పరిస్థితి మరేవరికీ రాకుండా చేయాలే..’ అని కొమురమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.
వెంటాడుతున్న మనోవేదన
రమేష్ హత్యను భార్య శ్రీవల్లి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగా ఉన్న ఆమె.. భర్త హత్యతో మనోవేదన చెందుతోంది. నిత్యం భర్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం పల్స్‌రేట్ పడిపోయి ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతోంది. శ్రీవల్లి మాట్లాడే స్థితిలో లేదని ఆమె బంధువులు తెలిపారు.
నాన్న గుర్తుకొస్తున్నాడు..
‘నాన్న రమేశ్ మమ్మల్ని ఎగ్జిబిషన్‌కు, సినిమాలకు తీసుకెళ్లేవాడు. బజార్‌కు వెళ్దామంటే వెంట నే వచ్చేవాడు. బిస్కెట్లు, చాక్లెట్లు కొనితెచ్చేవాడు. ఇప్పుడు మాకు నాన్న లేడు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. ఆటపాటలు అన్నీ ఇంటివద్దనే. నాన్న గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపొస్తుంది’ అంటూ రమేశ్ కుమార్తె ఐదో తరగతి చదువుతున్న హసితాసాచి బోరున ఏడ్చింది.
ప్రభుత్వ సహకారం కరువు
రమేష్ అసాంఘిక శక్తుల చేతిలో హత్యకు గురయ్యాడని భావించిన రాష్ట్ర పోలీసుశాఖ ఆయనను అమర పోలీస్‌గా గుర్తించి, అతని కుటుం బానికి జ్ఞాపికను అందజేసింది. 2010 అక్టోబర్ 21న అప్పటి డీజీపీ అరవిందరావు రమేష్ కు టుంబానికి రూ.9లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు వారికి అందలేదు. రమేష్ భార్య శ్రీవల్లికి మొదట కమాన్‌పూర్ మండలంలోని వెటర్నరీ కార్యాలయంలో అటెండర్ పోస్ట్ ఇచ్చారు. ఆమె డిగ్రీ చదువుకోవడంతో కనీసం జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే ఆ ఫైల్‌ను పక్కన పడేశారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహకారంతో కలెక్టర్ ను, హైదరాబాద్‌లో ఉన్నతాధికారులను కలవగా ఇటీవల అనుమతి లభించింది. ఫైల్ కదిలే సమయంలోనే సచివాలయంలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. కథ మళ్లీ మొదటికి వచ్చింది. నాటినుంచి నేటి వరకు రమేష్ కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పడంలేదు.
కోల్‌బెల్ట్‌లో చర్చ
రమేశ్ హత్యఘటనలో నలుగురు పోలీస్ పెద్దల పాత్రపై ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేసు సీఐడీ చేతుల్లోకి వెళ్లి మూడేళ్లు కాగా, కథ కంచికి చేరిందని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో హోంశాఖ ఆ నలుగురిని విచారించేందుకు సీఐడీకి అనుమతివ్వడంతో డొంక కదిలింది.
పస్తుతం విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు హబీబ్‌ఖాన్, రాజేంద్రప్రసాద్, వెంకటరమణ, విద్యాసాగర్‌లను, కేసును తారుమారు చేసినట్టుగా భావిస్తున్న ఇద్దరు వైద్యులను నిందితులుగా పేర్కొంటూ కరీంనగర్ కోర్టులో సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేయడం కోల్‌బెల్ట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న బుగ్గల శ్రీనివాస్‌పై ఇప్పటికే చార్జిషీట్ నమోదయ్యింది. చార్జిషీట్లు పూర్తి కావడంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఆదుకోవాల్సినవారే.. ఆగంజేసిండ్రు
Published Wed, Sep 4 2013 5:43 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement