
మట్టి దొంగలు
► అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు
► చెరువు ఆధునికీకరణ పేరుతో మట్టిని అమ్ముకుంటున్న వైనం
► కాంట్రాక్టర్, ఫారెస్ట్ అధికారుల మిలాఖత్
నందనపల్లె (కర్నూలు సీక్యాంప్): అడవులను సంరక్షించాల్సిన అధికారులే మట్టి దొంగలకు అండగా నిలిచారు. నందనపల్లె గ్రామ పంచాయతీలో దర్గా సమీపంలోని అటవీశాఖ గట్టు తరిగిపోతోంది. ఐదు నెలల కాలంలో కొండను పూర్తిగా తవ్వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. కాంట్రాక్టర్, అటవీ అధికారుల అండతో సూదిరెడ్డిపల్లె, నందనపల్లెకు చెందిన ఇద్దరు వ్యాపారులు అక్రమంగా మట్టిని తవ్వుకుని అమ్మేస్తున్నారు. గార్గేయపురం చెరువు ఆధునికీకరణకు అవసరమైన మట్టిని సమీపంలోని కొండ గట్టులో తవ్వుకునేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ మట్టి వ్యాపారులతో చేతులు కలిపాడు. రెండు ట్రిప్పులు చెరువు నిర్మాణానికి తరలిస్తే మరో మూడు ట్రిప్పులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పు రూ. 2 వేల నుంచి 3 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీతో కొండ గట్టును ఇప్పటికే దాదాపు చదును చేశారు. వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. ఒకప్పుడు గుట్టగా కనిపించే ప్రాంతం మైదానంలా మారిపోయింది. ఫారెస్ట్ అధికారులకు నెల మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మట్టి తరలింపును ఎవరూ అడ్డుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని బెదిరించారు. దీంతో అటు వైపు రైతులు వెళ్లేందుకు సాహసించడం లేదు.