కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రంజీ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్రతో నిర్వహించే రంజీ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత 4 మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టు పేలవ ప్రదర్శనతో గురువారం జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ విజయం సాధించిన మహారాష్ట్ర జట్టు మంచి జోష్ మీద ఉంది. మూడు మ్యాచ్‌లలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి, ఒక మ్యాచ్ ఓడిన ఆంధ్రా జట్టు సమిష్టి ఆటతీరును ప్రదర్శించి విజయం సాధిస్తే తప్ప ప్రయోజనం లేదు.
ఆంధ్రా జట్టు విజయమే ధ్యేయంగా రెండు రోజులుగా తీవ్రంగా సాధన చేస్తున్నారు. కడపలో నిర్వహిస్తున్న మూడవ రంజీ మ్యాచ్‌లో కడప క్రీడాకారులు పైడికాల్వ విజయ్‌కుమార్, మారుపూరి సురేష్ ఆడుతుండటంతో క్రీడాభిమానుల ఆసక్తి పెరిగింది. ఆంధ్రా జట్టుకు అమోల్ మజుందార్, మహారాష్ట్ర జట్టుకు రోహిత్ మోత్వాని కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.
ముమ్మరంగా ఇరుజట్ల సాధన
వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో ఆంధ్రా, మహారాష్ట్ర జట్టు క్రీడాకారులు ఉదయం కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్‌ల సమక్షంలో మూడు గంటల పాటు సాధన చేశారు. ఇరుజట్ల కెప్టెన్‌లు అమోల్ మజుందార్, రోహిత్ మోత్వానీలు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ విజయం పట్ల ధీమాను కనబరుస్తూ సాధన చేశారు.
నేటి నుంచి రంజీ మ్యాచ్
Published Thu, Nov 28 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement