kadapa sports
-
ఒకటే లక్ష్యం..!
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కఠోర సాధన, క్రమశిక్షణతో పాటు క్రీడల్లో రాణించాలన్న తపన ఉన్న వారికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. నగరంలోని డీఎస్ఏ క్రీడామైదానంలో మే నెల 1 వ తేదీ నుంచి క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఏసీఏ కోచ్‌ల పర్యవేక్షణలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలతో పాటు మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి రుసుం లేకుండా శిక్షణ ఇస్తున్నారు. ఏఏ అంశాల్లో శిక్షణ.. ఏ క్రీడకైనా ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమన్న విషయం తెలిసిందే. ఇందుకోసం తొలుత శిక్షణ శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులతో తొలుత జాగింగ్ చేయిస్తారు. అనంతరం ఫిట్నెస్కోసం స్ట్రెచ్చింగ్, వార్మ్అప్గేమ్స్, స్ప్రింట్స్ తదితర వ్యాయామాలను చేయిస్తారు. అనంతరం వారు ఎన్నుకున్న రంగంలో అంటే బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ ఇలా వేర్వేరు విభాగాల్లో సీనియర్స్, జూనియర్స్‌కు వేర్వేరుగా మెళకువలు నేర్పుతారు. ఇందులో క్రీడాకారులకు ఫార్వర్డ్ డిఫెన్స్, బ్యాక్వర్డ్ డిఫెన్స్, షాడో ప్రాక్టీస్, డ్రాప్బాల్స్, స్పాట్బౌలింగ్, లాంగ్ బ్యారియర్ ఫీల్డింగ్, మ్యాన్ టు మ్యాన్ క్యాచెస్ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. కష్టపడే తత్వం ఉండాలి.. క్రీడాకారుల్లో కష్టపడేతత్వం, క్రమశిక్షణ, రెగ్యులారిటీ ఉంటే క్రికెట్లో రాణించవచ్చు. ప్రతిరోజు సాధన చేయడం ద్వారా క్రీడాకారుల్లోని బలహీనతలను అధిగమించే అవకాశం ఉంటుంది. క్రికెట్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నందున బాగా సాధన చేయడంతో పాటు ఫిట్నెస్ కూడా కాపాడుకోవడం ముఖ్యం. - ఖదీర్, ఏసీఏ లెవల్ 1 కోచ్ మంచి క్రీడాకారుల కోసం అన్వేషణ జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయి. ప్రతిభ కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు అవకాశం కోల్పోకూడదనే ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నాం. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోంది. శిబిరం తర్వాత కూడా రెగ్యులర్‌గా క్రీడాకారులు సాధనకు రావచ్చు. - ఖాజామైనుద్దీన్, శిక్షణ శిబిరం ఇన్చార్జి, ఏసీఏ లెవల్ ‘ఓ’ కోచ్ -
విజేతగా నిలవాలి
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : బ్యాడ్మింటన్‌లో విజేతలుగా నిలవాలని క్రీడాకారులకు కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. కడపలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ పోటీలకు విచ్చేసిన ఆయన తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తరువాత పోటీలను ప్రారంభించారు. గత ఏడాదే ఈ పోటీలు నిర్వహించాల్సి ఉన్నా, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయని ఏజేసీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పోటీలు విజయవంతం కావడంతో రానున్న కాలంలో మరిన్ని పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కడప నగర పాలక కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రిమ్స్ డెరైక్టర్ సిద్ధప్ప గౌరవ్, డీఎస్డీఓ బాషామోహిద్దీన్, కడప ఎంఈఓ నాగమునిరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రైజ్‌మనీ, సర్టిఫికెట్లు సిద్ధం ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్-జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచే క్రీడాకారులు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా వారి సర్టిఫికెట్లతో పాటు ప్రైజ్‌మనీ సిద్ధం చేశారు. ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి విచ్చేసి అన్ని సర్టిఫికెట్లపై సంతకం చేసి సిద్ధంగా ఉంచారు. అన్ని విభాగాల క్రీడాకారులకు దాదాపు రూ.5 లక్షల మేర ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అండర్-13 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగం, అండర్-15 బాలురు, బాలికలు, డబుల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి, రన్నరప్‌గా నిలిచిన వారికి ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అభినందన అండర్-13 విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆలిండియా నంబర్-1 ర్యాంక్ క్రీడాకారుడు మైశ్నమ్ మైరభను కడప కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్‌జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో మెయిన్‌డ్రాకు చేరుకున్న క్రీడాకారుల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. శనివారం నిర్వహించిన ప్రీ క్వార్టర్, క్యార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠను లేపుతూ క్రీడాభిమానులకు కనువిందుచేస్తోంది. మొత్తం 64 మ్యాచ్‌లు నిర్వహించగా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 32 మంది క్రీడాకారులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కాగా కడప క్రీడాకారుడు దత్తాత్రేయరెడ్డి 3వ సీడెడ్ క్రీడాకారుడు ఆర్జిత్ చేతిలో ఓటమి చవిచూశాడు. గట్టిపోటీ ఇచ్చినప్పటికీ విజయం అందుకోలేకపోయాడు. కాగా పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ సింగిల్స్ విభాగంలో క్వార్ట్ర్ ఫైనల్లో 3వ ర్యాంకు క్రీడాకారిణి రిచాముక్తిబోధ్ చేతిలో ఓటమి చవిచూసిన్పటికీ డబుల్స్ విభాగంలో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అంతర్జాతీయ క్రీడాకారుడు లక్ష్యసేన్ ఏపీకి చెందిన జగదీష్‌పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్ విజేతల వివరాలు.. అండర్ 13 డబుల్స్ బాలికల విభాగం : ఆర్.ముక్తిబోధ్ (కర్నాటక), సిమ్రాన్‌సింగ్, (మహారాష్ట్ర) వి. జక్కా, పుల్లెల గాయత్రి గోపీచంద్ (ఏపీ), దీత్యాజగదీష్, మేధాశశిధరన్ (కర్నాటక), జోషిదివ్యాన్షి, షిఫెయిల్ గౌతం (ఉత్తరఖండ్). అండర్ 13 డబుల్స్ బాలుర విభాగం : ఎస్.మదీన (ఏపీ), ఎం.మైరభ (మణిపూర్), బి.రితిన్, మణిదీప్ (ఏపీ), ఎస్.కర్రిషణ్ముకఅంజన్, పి.రాజ్వత్, చయంతిజోష్(ఉత్తరఖండ్), వికాస్‌యాదవ్ (ఢిల్లీ). అండర్ 15 డబుల్స్ బాలికల విభాగం : అశ్వినిభట్, మిథుల (కర్నాటక), రియాఅరోల్కర్, పుర్వబార్వే (మహారాష్ట్ర), ఉన్నతిబిషాట్(ఉత్తరఖండ్), చిమ్రాన్కలిత(అస్సాం), షబానాబేగం, కె. ప్రీతి (ఏపీ). అండర్ 15 డబుల్స్ బాలుర విభాగం : కె. గుల్షన్‌కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), జశ్వంత్ (ఏపీ), ధరువ్కపిల (పంజాబ్), గౌస్షేక్, బషీర్ సయ్యద్ (ఏపీ), కృష్ణప్రసాద్, సాత్విక్‌సాయిరాజ్ (ఏపీ). అండర్ 13 సింగిల్స్ బాలికల విభాగం : సిమ్రాన్‌సింగ్ (మహారాష్ట్ర), రిచాముక్తబోధ్ (కర్నాటక), తనిష్కదేశ్పాండే (మహారాష్ట్ర), నిషితావర్మ (ఏపీ). అండర్ 13 సింగిల్స్ బాలుర విభాగం : మైశ్నమ్ మైరభ (మణిపూర్), వరుణ్‌దేవ్ (మహారాష్ట్ర), బి.రితిన్ (ఏపీ), సాయి కర్రి షణ్ముఖఅంజన్ (ఏపీ). అండర్ 15 సింగిల్స్ బాలికల విభాగం : పూజ దవ్లేకర్ (మహారాష్ట్ర), పూర్వాబార్వే (మహారాష్ర్ట), రియాఅరోల్కర్ (మహారాష్ట్ర), కె. అశ్వినిభట్ (కర్నాటక) అండర్ 15 సింగిల్స్ బాలుర విభాగం : కార్తికేయ గుల్షన్‌కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), ఆర్జిత్ చలిహ (అస్సాం), రాహుల్ భరద్వాజ్ (కర్నాటక). -
క్రీడల ఖిల్లాగా కడప
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు సిద్ధమైన తర్వాత అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లేదా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీలకు కడపను వేదికగా ఎన్నుకుందుకు సంతోషంగా ఉందన్నారు. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయన్నారు. క్రీడాకారులు ఫిట్నెస్ను కలిగి ఉండాలని, ఆల్ ఇంగ్లాడ్ చాంపియన్ ప్రకాష్ పడుకునే గురించి వివరించారు. తాను బలంగా ఆడాలన్న కాంక్ష క్రీడాకారుడిలో ఉండాలే తప్ప ఎదుటి వ్యక్తి బలహీనమైనంగా ఉండాలనుకోకూడదన్నారు. టోర్నమెంట్ ఇన్చార్జ్, రెఫరీ పానీరావు మాట్లాడుతూ కడపలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉందన్నారు. క్రీడాకారులు బాగా ఆడాలని ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ ఎం. రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఎం.సుదర్శన్‌రెడ్డి, చీఫ్ రెఫరీ మంజూషా సహస్త్ర బుద్ధి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, రెఫరీ సతీష్‌మాల్యా, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షుడు మనోహర్, చీఫ్ ప్యాట్రన్ బాషాఖాన్, కోశాధికారి నాగరాజు, సభ్యులు రవిశంకర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, మదన్‌మోహన్‌రెడ్డి గంగాధర్ పాల్గొన్నారు. -
నేటి నుంచి రంజీ మ్యాచ్
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రంజీ మ్యాచ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్రతో నిర్వహించే రంజీ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత 4 మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టు పేలవ ప్రదర్శనతో గురువారం జరగనున్న మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ విజయం సాధించిన మహారాష్ట్ర జట్టు మంచి జోష్ మీద ఉంది. మూడు మ్యాచ్‌లలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయి, ఒక మ్యాచ్ ఓడిన ఆంధ్రా జట్టు సమిష్టి ఆటతీరును ప్రదర్శించి విజయం సాధిస్తే తప్ప ప్రయోజనం లేదు. ఆంధ్రా జట్టు విజయమే ధ్యేయంగా రెండు రోజులుగా తీవ్రంగా సాధన చేస్తున్నారు. కడపలో నిర్వహిస్తున్న మూడవ రంజీ మ్యాచ్‌లో కడప క్రీడాకారులు పైడికాల్వ విజయ్‌కుమార్, మారుపూరి సురేష్ ఆడుతుండటంతో క్రీడాభిమానుల ఆసక్తి పెరిగింది. ఆంధ్రా జట్టుకు అమోల్ మజుందార్, మహారాష్ట్ర జట్టుకు రోహిత్ మోత్వాని కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను ప్రజలు ఉచితంగా వీక్షించవచ్చని జిల్లా క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ముమ్మరంగా ఇరుజట్ల సాధన వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో ఆంధ్రా, మహారాష్ట్ర జట్టు క్రీడాకారులు ఉదయం కోచ్, ఫిట్నెస్ ట్రైనర్ల సమక్షంలో మూడు గంటల పాటు సాధన చేశారు. ఇరుజట్ల కెప్టెన్లు అమోల్ మజుందార్, రోహిత్ మోత్వానీలు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ విజయం పట్ల ధీమాను కనబరుస్తూ సాధన చేశారు.