మానవ మృగం
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
నామవరంలో ఘటన
పోలీసులకు బంధువుల ఫిర్యాదు
అదుపులో నిందితుడు
పాయకరావుపేట: కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి తన కూతురు వయసున్న ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి అతని వికృతచేష్టలకు భయపడి కేకలు వేయడంతో ఉడాయించాడు. పాయకరావుపేట మండలం నామవరం గ్రామంలో మంగళవారం రాత్రి జాతీయరహదారి పక్కనే ఈ సంఘటన జరిగింది. బాలిక బంధువులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ, మేనమామ సంరక్షణలో ఉంటోంది. రాత్రి ఏడు గంటల సమయంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కిరాణాషాపుకు పంపించారు. చిన్నారి చీకట్లో ఒంటరిగా రావడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన కోన రమణ అనే వ్యక్తి మాటువేసి చిన్నారికి మాయమాటలు చెప్పి జాతీయరహదారిని ఆనుకుని మంచినీటి చెరువుగ ట్టుపై ఉన్న మాంసం విక్రయించే పాకలోకి తీసుకెళ్లాడు. దుస్తులు తొలగించి వికృత చేష్టలకు పాల్పడడంతో ఏం జరుగుతుందో తెలియని చిన్నారి కేకలు వేసింది.
అదే సమయంలో బాలి కను వెతుక్కుంటూ వచ్చిన అమ్మమ్మ, పిన్ని కేకలు విని అనుమానం వచ్చి పాకవైపు వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బంధువులు స్థానికుల సహాయంతో రమణను పట్టుకుని 100 ఫోన్ నెంబరు ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. పాయకరావుపేట పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన నిందితునిపై నిర్భయ చట్టప్రకారం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని బాధితురాలి మేనమామ స్వామి బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. కోన రమణపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ కుమార్ తెలిపారు. నిందితుడికి వివాహం అయింది. బాధితురాలి వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది.
గతంలోనూ ఇలాగే; రమణ గతంలో కూడా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి యత్నించగా, స్థానికులు చూసి దేహశుద్ధి చేసి విడిచిపెట్టినట్టు తెలిసింది. అప్పట్లోనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని గ్రామస్తులు చెప్పారు. ఫిర్యాదు స్వీకరణలో జాప్యం : కంట్రోలు రూం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు మంగళవారం రాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ బుధవారం ఉదయం ఫిర్యాదు స్వీకరణలో పోలీసులు జాప్యం చేశారని బంధువులు ఆరోపించారు. ఉదయం పది గంటల సమయంలో బాధితురాలి మేనమామ స్వామి బంధువులతో కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్‌కు వెళ్లారు. తాము నిరక్ష్యరాస్యులం కావడంతో వేరొకరితో రాయించి స్టేషన్‌లో ఇవ్వడానికి వెళ్తే ఫిర్యాదు రాసిన వ్యక్తినే తీసుకురావాలంటూ జాప్యం చేసి ఇబ్బందులు పెట్టినట్లు వాపోయారు.