అర్హుల రేషన్‌కార్డులకు ఎసరు
నెల్లూరు(రెవెన్యూ) : దగదర్తి మండలానికి చెందిన రమణయ్య వ్యవసాయ కూలీ. ముగ్గురు పిల్లలు. కూలి చేసుకుంటూ రేషన్‌షాపులో వచ్చే బియ్యంతో ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆధార్ సీడింగ్ పేరుతో రమణయ్య రేషన్‌కార్డును తొలగించారు.
పొదలకూరుకు చెందిన పెంచలయ్య ఎస్‌టీ. భార్య ముగ్గురు పిల్లలున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను గ్రామంలో లేడండూ రేషన్‌కార్డు తొలగించారు. ఇలా జిల్లాలో అనేకమంది ఉన్నారు. రేషన్‌కార్డులు కోల్పోయిన బాధితులు పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితంలేదు. ఇప్పటి వరకు వారి కార్డులను పునరుద్ధరించలేదు.
ఆధార్ సీడింగ్‌కు ముందు 8.56 లక్షల కార్డులు
జిల్లాలో ఆధార్ సీడింగ్‌కు ముందు 8.56 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి కందిపప్పు పంపిణీ చేసే అవకాశాలు కన్పించడంలేదు. ప్రస్తుతం 8.14 లక్షల రేషన్‌కార్డులున్నాయి. ఆధార్ సీడింగ్ పేరుతో వేల సంఖ్యలో కార్డులను తొలగించారు. ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టడంతో మరొక పర్యాయం ఆధార్ సీడింగ్ చేపట్టి వందల సంఖ్యలో కార్డులను పునరుద్ధరించారు. జిల్లాలో సుమారు 42 వేల మంది రేషన్‌కార్డులు కోల్పోయి ఇబ్బందులుపడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అధికారపార్టీకి ఓటు వేయలేదనే కక్షతో రేషన్‌కార్డులు తొలగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పథకాల అమలుకు ఆధార్ సీడింగ్ అనుసంధానం చేశారు. గత ఏడాది రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి కమిటీలు సూచించిన వారి కార్డులు ఉంచి అర్హులైన లబ్ధిదారుల కార్డులు తొలగించారనే ఆరోపణలున్నాయి. ఆధార్ కార్డుల కాపీలు అధికారులకు ఇచ్చినా ఇంత వరకు వారి రేషన్‌కార్డులను పునరుద్ధరించలేదు.
మూడంతస్తుల భవనం ఉన్న వ్యక్తికీ కార్డు
నెల్లూరు ఏసీ నగర్‌లో మూడంతస్తుల భవనం ఉన్న ఓ వ్యక్తికి రేషన్‌కార్డు మంజూరు చేశారు. నెల్లూరు రామ్మూర్తి నగర్‌కు చెందిన ఓ వ్యక్తికు రెండు భవనాలు ఉన్నాయి. ఆయనకూ రేషన్‌కార్డు మంజూరు చేశారు. అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. రేషన్‌కార్డులు కోల్పోయిన వారు పలువు జిల్లా అధికారుల వద్దకు వచ్చినా ఫిర్యాదులును వారు తిరిగి మండల స్థాయి అధికారులకు పంపుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే మండల స్థాయి అధికారులు అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారు.
ఆధార్ సీడింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్డులు కోల్పోయిన బాధితుల నుంచి ఆధార్ కార్డులు స్వీకరించారు. స్వీకరించిన వాటిని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేశారేకానీ కార్డులు పునరుద్ధరించలేదనే విమర్శలున్నాయి. జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల కోసం 65,800 మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. జన్మభూమి సభలు, మండల కార్యాలయాలు, కలెక్టరేట్‌లో రేషన్‌కార్డుల కోసం లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హత ఉన్నవి 65,800గా గుర్తించారు. అర్హుల పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కనికరిస్తే కొత్త రేషన్‌కార్డులు మంజూరవుతాయి.
ప్రభుత్వం అనుమతిస్తే కొత్త రేషన్‌కార్డులు :
కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 65,800 అర్జీలను అర్హులకు సంబంధించినవిగా గుర్తించాం. అర్హుల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం.
- టి.ధర్మారెడ్డి, డీఎస్‌ఓ