నెల్లూరు(రెవెన్యూ): wap098204100397, RHP098204 140931 రేషన్ కార్డులు నెల్లూరులోని 41వ చౌకదుకాణంలో ఉన్నాయి. కార్డుదారులిద్దరూ 41వ చౌకదుకాణంలో ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. తోఫా ఇవ్వమని కార్డుదారులు వెళ్లి డీలర్‌ను అడిగారు. కార్డులు తోఫా జాబితాలో లేవని డీలర్ సమాధానం ఇచ్చారు. కార్డుదారులు ఏమి చేయాలో తెలియక డీఎస్‌ఓ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో ఇక్కడ కాదు.. నెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించమన్నారు. అక్కడకు పోతే మాకు సంబంధంలేదన్నారు. ఈ విధంగా అర్హులైన ముస్లింకార్డుదారులకు రంజాన్ తోఫా ఇవ్వకుండా ఇబ్బందులుపెడుతున్నారు.
రంజాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న రంజాన్ తోఫా ప్రకటించింది. ముస్లిం కార్డుదారులకు ఐదు కిలోల గోదుమపిండి, రెండు కేజీల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముస్లింకార్డుదారుల వివరాలు అందజేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ముస్లింకార్డుదారుల వివరాల సేకరణ ప్రక్రియను తహశీల్దార్లకు అప్పగించారు. జిల్లాలో 73 వేల మంది ముస్లింకార్డుదారులు ఉన్నారని తహశీల్దార్లు మొదటి విడత వివారలు అందజేశారు. ఇచ్చిన వివరాలు సక్రమంగా లేవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండో పర్యాయం వివరాలు సేకరించి 84,014 మంది ముస్లింకార్డులు ఉన్నాయని దానికి అనుగుణంగా తోఫా విడుదల చేయాలని అధికారులను కోరారు.
రాష్ట్ర అధికారులు 84,014 మంది కార్డుదారులకు సంబంధించిన తోఫాను ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. అవసరమున్న దాని కంటే అదనపు కోటా విడుదల చేయించామని అధికారులు చెబుతున్నారు. అదనపు కోటా ఎందుకు విడుదల చేయించారో అధికారులకే తెలియాలి. తహశీల్దార్ కార్యాలయాల్లో ముస్లింకార్డుదారుల వివరాల జాబితాలను మాన్యువల్‌గా సిద్ధం చేశారు.
ముస్లిం కార్డుదారుల జాబితాల సిద్ధం చేసే సమయంలో సంబంధిత అధికారులు చేతులకు పని చెప్పారని ఆరోపణలున్నాయి. అర్హుల పేర్లు పక్కన పెట్టి అనర్హుల పేర్లు జాబితాలో నమోదు చేశారనే విమర్శలున్నాయి. రేషన్ షాపులో ఉండాల్సిన ముస్లింకార్డుదారుల పేర్లు జాబితాలో చేర్చలేదు. ఫలితంగా డీలర్‌ను తోఫా ఇవ్వమని అడిగితే అధికారులు ఇచ్చిన జాబితాలో మీపేరు లేదు.. తోఫా ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారని బాధితులు వాపోయారు. పేర్లు జాబితాలో లేకుండా చేసి తోఫాను బహిరంగ మార్కెట్‌కు తరలించి సోమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
నెల్లూరు నగరం, రూరల్‌లో పరిధిలో 173 చౌకదుకాణాలున్నాయి. సుమారు 25 వేల ముస్లింకార్డులున్నాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు. నగరంలో జాబితా సిద్ధం చేయడంలో ఒక ప్రైవేట్ వ్యక్తి కీలక పాత్ర పోషించాడు. కార్డుల జాబితా సిద్ధం చేయడం నుంచి డీలర్లకు జాబితాలు ఇచ్చేంత వరకు ఆ వ్యక్తి హహా కొనసాగింది. నగరంలోనూ రెండు రోజుల కిందట మూడు వేల కార్డులకు తోఫా ఇవ్వాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క సారిగా కాకుండా విడతల వారీగా కార్డుదారులు జాబితా సిద్ధం చేయడంలో అవకతవకలు జరిగి ఉంటాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
అర్హులైన కార్డుదారులకు తోఫా పంపిణీ చేశాం: ధర్మారెడ్డి, డీఎస్‌ఓ
రంజాన్ తోఫాను అర్హులైన ముస్లింకార్డుదారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం. ముస్లింకార్డుదారుల ఎంపిక ప్రక్రియను తహశీల్దార్లకు అప్పగించాం. తహశీల్దార్లు ఇచ్చిన వివరాల ప్రకారం తోఫా విడుదల చేయించాం. అదనంగా తోఫాను తీసుకురావడం మంచిదైంది. దాని వలన జాబితాలో పేర్లులేని అనేక మంది ముస్లింకార్డుదారులకు తోఫా పంపిణీ చేశాం.
తోఫా.. దోఖా..
Published Sat, Jul 18 2015 2:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement