పరేషన్
చిట్టినగర్ : వేలిముద్రలు సరిగ్గా పడటం లేదని మీకు రేషన్ నిలిపేశారా..?, ఊళ్లో లేకపోవడంతో మీరు సకాలంలో రేషన్ తెచ్చుకోలేకపోయారా..?, అనారోగ్యం బారిన పడి నడిచివెళ్లే పరిస్థితి లేక ఆ నెల సరకులు వదులుకున్నారా? అయితే, మీ రేషన్‌కార్డుకు గ్రహణం పట్టినట్టే. పేదల సంక్షేమమే చంద్రన్న లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్తవారికి రేషన్‌కార్డులు ఇచ్చేందుకు.. ఎప్పటి నుంచో రేషన్ తీసుకుంటున్న వారి కార్డులను రద్దుచేయాలని చూస్తోంది.
ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా లక్ష కార్డుల రద్దుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటుండగా, నగరంలో 15వేల కార్డులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న 255 రేషన్ డిపోల్లో కార్డుల రద్దు కోసం పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సర్వేకు సంబంధించిన పలు పత్రాలను డీలర్లకు అందజేశారు. ప్రతి రేషన్ డిపో నుంచి కనీసం 80 నుంచి 150 వరకూ కార్డులు రద్దు చేయనున్నారు. రద్దుచేసే వాటిని ఇటీవల కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
రద్దుకు ప్రతిపాదించిన అంశాలివే..
డీలర్లకు ఇచ్చిన సర్వే పత్రంలో 18 రకాల కారణాలు తెలపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నెలలో సరకులు తీసుకోని వారు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, మరణించిన వారితో పాటు ఆధార్‌కార్డు నమోదు సమస్య, మంచంపై అనారోగ్యంతో ఉన్నవారు, యూఐడీ కార్డులు, వేలిముద్రలు పడని వారితో పాటు ఆర్థికంగా కాస్త ఉన్నవారి వివరాలను ఈనెల 20వ తేదీ కల్లా అందజేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీలర్లు ఇప్పటికే కొన్ని వివరాలు సేకరించడంతో పాటు వాటిని అందజేసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేపై ప్రభుత్వం ఎంత కచ్చితంగా ఉందంటే సర్వే చేయని డీలర్లకు సరకులు నిలిపివేసేందుకు సైతం వెనుకంజ వేయడం లేదు.
ఇంటి పన్నుతో లింక్
గత ప్రభుత్వం ఎవరికి పడితే వారికి తెల్లరేషన్ కార్డులు మంజూరు చేసిందని భావిస్తున్న ప్రభుత్వం వాటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తెల్లరేషన్ కార్డును కార్డుదారుడి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేశారు. మరోవైపు నగరంలో సొంత ఇళ్లు ఉన్నవారి ఇంటి పన్నుకు ఆధార్‌కార్డు అనుసంధానం పూర్తి కా గా, ఈ రెండు వివరాలతో బేరీజు వేసుకుని అధికంగా ఇంటి పన్ను చెల్లిస్తున్న వారి కార్డు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఒక్కో రేషన్ షాపునకు వంద
నగరంలోని 255 రేషన్ డిపోల్లో కనీసం 15వేల కార్డులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో రేషన్ షాపునకు కనీసం 600 పైబడి కార్డులకు సరకుల పంపిణీ జరుగుతోంది. అయితే, ఒక్కో షాపులో నెలకు కనీసం 50 నుంచి 80 వరకు వేలిముద్రలు సరిగ్గా పడకనో, సరకులు ఇచ్చే సమయానికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారో ఉంటున్నారు. రెండు నెలలు వరుసగా సరకులు తీసుకోకుంటే.. ఇక ఆ రేషన్ కార్డుకు నూకలు చెల్లినట్టే. ఇక మంచంపై అనారోగ్యంతో ఉన్నవారితో పాటు మరణించినవారు, పింక్ కార్డును తెల్లకార్డుగా మార్చుకున్న వారు మరో 20 మంది ఉంటారు. ఇలా సరాసరిన ప్రతి డిపో నుంచి కనీసం వంద కార్డులను రద్దుచేస్తే నగరవ్యాప్తంగా15వేల పైబడే రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.
మా పరిస్థితి ఏం కానూ..
కూలీ పనులకు ఇతర నగరాలకు వెళ్తుంటాం. ఇలా కార్డులు రద్దంటే మాలాంటి వారి పరిస్థితి ఏం కాను. నా బిడ్డ నడవలేడు. వాడికి సరకులు ఇవ్వడం లేదు. అసలు డిపోలో ఇచ్చేవే అరకొర. కార్డులు తీసేస్తామంటే ఎలా..
- కుంచం లక్ష్మి, కూలీ, వన్‌టౌన్
కార్డు పోతుందనే వస్తున్నా..
వయసు మీద పడటంతో నడిచి రాలేను. రెండు నెలలు సరకులు తీసుకోకుంటే కార్డు పోతుందనే భయంతో కళ్లు కనిపించకపోయినా.. చుట్టుపక్కల వారు, నా బిడ్డల సాయంతో డిపోకు వెళ్తున్నా. మాలాంటి వారిపై ఇది ప్రభుత్వ కుట్ర.
- కొరగంజి రామయమ్మ, నడవలేని వృద్ధురాలు
వేలిముద్రల కోసం పదిసార్లు వస్తా..
నా చేతి వేళ్లు సక్రమంగా ఉండవు. వేలిముద్రలు పడితేనే సరకులు అంటున్నారు. నెలలో ఒక్కసారి ఇచ్చే సరుకుల కోసం పనులు మానుకుని పదిసార్లు అయినా వస్తాను. కార్డు ఉంటే ఏదైనా ఉపయోగం ఉంటుందనే కదా. మాలాంటి వారి కార్డులు సాకులు చెప్పి తీసేయకండి.
- శాన నరసింహారావు, కుష్టు వ్యాధిగ్రస్తుడు