ముండ్లమూరు, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్ బియ్యాన్ని ముండ్లమూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున స్థానికుల సాయంతో పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముండ్లమూరు గ్రామం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కొందరు స్థానికులే ప్రధాన రోడ్లపై కాపుకాశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రామంలోని ప్రధాన వీధిలో టాటా ఏస్ ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండటాన్ని గమనించి వెంటపడి పట్టుకున్నారు.
అనంతరం స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. వేములలో విధి నిర్వహణలో ఉన్న ఎస్సై ద్వారా ఆదేశాలందుకున్న స్టేషన్‌లోని సిబ్బంది వెంటనే ముండ్లమూరు చేరుకుని ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటికే డ్రైవర్ పరారయ్యాడు. గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అద్దంకి డీటీ కె.లింగారావు, పొదిలి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి.విజయశ్రీలు ఆటోలో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. మొత్తం 36 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక గిడ్డంగికి బియ్యాన్ని తరలించారు. దీనిపై 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కె.లింగరాజు తెలిపారు. అనంతరం స్థానిక రేషన్‌షాపును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించగా... స్టాక్ రిజిష్టర్ ప్రకారం 31 క్వింటాళ్ల 70 కేజీల బియ్యం ఉండాల్సి ఉండగా, 9 కేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి కార్డుదారులను విచారించారు.
డీలర్‌తో అధికారుల కుమ్మక్కు : గ్రామస్తుల ఆరోపణ
స్థానిక రేషన్ డీలర్‌కు సంబంధించిన షాపు నుంచే బియ్యం తరలుతున్నప్పటికీ అతనితో అధికారులు కుమ్మక్కై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యాన్ని పట్టించినప్పటికీ అధికారుల అవినీతి కారణంగా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా తనిఖీలు చేశారని, ఈలోగా షాపులోని రికార్డులను డీలర్ తారుమారు చేశాడని వారు అనుమానిస్తున్నారు. దీని పై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
టంగుటూరులో 87 బస్తాలు...
టంగుటూరు, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 87 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు గురువారం స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులో పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ముందుగా మండలంలోని ఆలకూరపాడు నుంచి అప్పీ ఆటోలో సింగరాయకొండ వైపు తరలిస్తున్న 21 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంగోలు నుంచి ట్రక్కు ఆటోలో తరలిస్తున్న 66 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
వాటన్నింటినీ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 21 చిన్నచిన్న బస్తాల్లో ఏడు క్వింటాలు, 66 బస్తాల్లో 33 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. మొదటి ఆటోలో ఉన్న డ్రైవర్ పి.రాజారావు, రేవూరి శ్రీనివాసరావు, రెండో ఆటోలో ఉన్న చప్పిడి శ్రీనివాసరావు, డ్రైవర్ కదిలి బ్రహ్మనాయుడు, పలగర్ల శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కలెక్టర్ కోర్టులో 6(ఏ) కేసులు పెడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు విజిలెన్స్ సీఐ కిశోర్‌కుమార్, ఎస్సై సాంబయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు ఏసుదాసు, ప్రభాకరరావు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
Published Fri, Feb 14 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement