ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవలో ముగ్గురు వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డిపోల నుంచి లబ్ధిదారులు విడిపించుకుంటున్న బియ్యాన్ని ఇక్కడి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రేషన్ డిపోలలో ఉచితంగా వస్తున్న బియ్యానికి కిలో రూ.10లు ధరల ఇవ్వడంతో లబ్ధిదారులు వ్యాపారులకు విక్రయించేస్తున్నారు. వాటిని వ్యాపారులు తిరిగి మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ఇలా ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపోల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని గుట్టుగా ఇళ్లలోనే నిల్వ ఉంచి నెలాఖరున మిల్లర్లకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొన్న విజిలెన్స్ అధికారులు ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ మల్లిఖార్జునరావు, హెచ్‌సీలు ముబారక్, సత్యనారాయణ, సిబ్బందితో వచ్చి మంగళవారం దాడులు చేశారు. లీలాసుందరినగర్‌లో 1,240 కిలోలు, బాలాజీనగర్‌లో 740 కిలోలు, పాండురంగాపురంలో 2,800 కిలోల పీడీఎస్ బియ్యం పట్టుకొన్నారు. ఆయా వ్యాపారుల నుంచి ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. ముగ్గురు వ్యాపారులపైనా కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment