కొత్తసొలసలోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న అధికారులు
గుంటూరు, యడ్లపాడు: అక్రమ రేషన్ బియ్యం నిల్వలకు, రవాణాకు యడ్లపాడు మండలం కేంద్ర బిందువుగా మారింది. మండలంలోని కొత్తసొలస గ్రామంలో జిల్లా పౌరసరఫరాల అధికారి టి.శివరామప్రసాద్ నేతృత్వంలో జిల్లాస్థాయి అధికారుల బృందం శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేసింది. ముందుస్తు సమాచారంతో చేసిన ఈ దాడుల్లో 425 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిల్వల్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.
గతంలోనూ ఇదే ఇంటిలో..
గతంలోనూ కొత్తసొలస గ్రామంలో ఇదే తరహాలో జిల్లా అధికారులు అక్రమంగా నిల్వలున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అప్పుడు ఎవరి ఇంట్లో రేషన్ బియ్యం నిల్వలు పట్టుబడ్డాయో..ఇప్పుడు వారి ఇంట్లోనే అంతేస్థాయిలో పట్టుకోవడం గమనార్హం. అప్పట్లో అర్ధరాత్రి హడావిడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వ్యాపారులపై క్రిమినల్ కేసుల్ని పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు కూడా 6–ఏ కేసు నమోదు చేయడం విశేషం. దీంతో అక్రమార్కులు పగలు వాహనాలను ఇళ్ల వద్ద ఉంచి రాత్రిళ్లు లోడు చేసి దర్జాగా తరలించడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.
చిలకలూరిపేట గోదాముకు బియ్యం తరలింపు
మండలంలోని కొత్తసొలసలో అక్రమ రేషన్‌బియ్యం నిల్వలు ఉన్నాయని పక్కా సమాచారం అందుకున్న అధికారుల బృందం రాత్రి 11.30 గంటల సమయంలో కిలారు నాగేశ్వరరావు ఇంటిపై దాడి చేసింది. 425 యూరియా బస్తాల్లో 167 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం నిల్వలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి నాలుగు వాహనాల్లో రాత్రికి రాత్రే చిలకలూరిపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ గోదాముకు తరలించారు. దాడుల్లో డీఎస్‌ఓ టి. శివరామప్రసాద్, జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి శ్రీనివాసరావు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ సాంబశివరావు, ఫణికుమార్, జియా, అశోక్ పాల్గొన్నారు.
అక్రమార్కులు చెప్పిన వారే నిందితులు
అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్న తరుణంలో అక్రమార్కులు ఎవరన్నది స్థానికులతో పాటు అధికారులకు తెలిసినా కేసుల నమోదులో మాత్రం కొత్తవారి పేర్లు వెలుగు చూడటం పరిపాటిగా మారింది. గతంలోనూ రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేస్తున్న వ్యక్తి పేరు లేకుండా అసలు సంబంధం లేని వ్యక్తి పేరుపై నమోదు చేయడం స్థానికుల నుంచి విమర్శలు భారీగా వచ్చాయి. ప్రస్తుతం అదే తరహాలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాల్లో పలు కేసుల్లో ఉన్న నిందితుడి తండ్రి ఇంట్లోనే నిల్వలు ఉండగా.. వాటిని గ్రామానికి చెందిన పి. రాంబాబు అనే వ్యక్తివిగా చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. టీడీపీ వర్గీయుల ఒత్తిడి కారణంగానే అసలు నిందితుల పేర్లు కేసు నమోదుల్లోకి రాకుండా పోయాయని తెలుస్తోంది. అధికారులు కూడా అక్రమార్కులకు సాయం అందిస్తున్నారంటూ పక్కా సమాచారాన్ని అందించిన ప్రజలే మండిపడుతున్నారు.
ఇబ్బందులు లేకుండా కేసులు
మండలంలో పలుమార్లు దాడులు చేసి అనేకచోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నప్పటికీ అక్రమ వ్యాపారులకు మాత్రం బెరుకు లేకుండా పోయింది. అనేకమార్లు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని స్వాధీనం చేసుకున్నా.. చౌక బియ్యం దందాను నిలుపుదల చేయడంలో విఫలం అయిపోతున్నారు. రేషన్ అక్రమ వ్యాపారులు టీడీపీకి చెందిన మంత్రి అనుచరులే కావడమే ఈ దందా యథేచ్ఛగా కొనసాగడానికి ప్రధాన కారణమని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగున్నరేళ్లుగా అక్రమ దందా
కొత్తసొలస గ్రామంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీడీఎస్ అక్రమ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది. మొదట రాత్రివేళ రహస్యంగా తరలించే ఈ వ్యవహారం గత మూడేళ్లుగా విచ్చల విడికి దారితీసింది. పట్టపగలే దర్జాగా లారీలకు ఎత్తేస్థాయికి వచ్చిందంటే పాలకులు, అధికారుల అండదండలు ఏస్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. రాత్రీపగలు తేడా లేకుండా పీడీఎస్ బియ్యం దిగుమతి, ఎగుమతులు చేయడంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కొత్తసొలస గ్రామం నిత్యం ఆటోలు, లారీల రాకతో రద్దీ ప్రాంతంగా మారింది. ప్రతినెలా 3వ తేదీ నుంచి 10వ తేదీలోపు రోజుకు రెండు చొప్పున, మిగిలిన రోజుల్లో ఒకలారీ చొప్పున లోడింగ్ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment