తెలంగాణ నుంచి వాహనంలో తెచ్చిన బియ్యం
బియ్యం అక్రమ రవాణాకు జిల్లా అడ్డాగా మారింది. తెలంగాణలోని ఖమ్మం, ఇతర ప్రాంతాలతో పాటు జిల్లాలోని రేషన్‌డిపోల నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ పట్టించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తున్న దాడుల్లో రైసుమిల్లుల వద్ద పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దొరుకుతుండటం సంచలనంగా మారింది. 24 గంటల వ్యవధిలో తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారం శ్రీ శ్రీనివాసా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్లులో నాలుగు కోట్ల డబ్భై ఆరు వేల రూపాయల విలువ గల మొత్తం స్టాకును స్వాధీనం చేసుకోగా, తాజాగా నల్లజర్ల మండలం అనంతపల్లి శ్రీ వెంకట సత్యనారాయణ రైస్ అండ్ ఫ్లోర్ మిల్‌లో సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖమ్మం జిల్లా నుంచి పలు రేషన్ డీలర్లు, ప్రజల వద్ద సేకరించిన రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్‌లో జిల్లాలోని ఆనంతపల్లి రైస్ మిల్లుకు తరలించి దిగుమతి చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఓ మినీ వ్యాన్‌ని స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లులో ఉన్న స్టాకు నిల్వల్ని కూడా అధికారులు తనిఖీలు చేశారు. స్టాకుల్లోనూ వ్యత్యాసాలు గుర్తించారు. 298 క్వింటాళ్ల ధాన్యం, 11 క్వింటాళ్ల బియ్యం వ్యత్యాసాలు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఈసారి 6ఎ తోపాటు 7(1) లెవీ ఆర్డర్స్ రూల్ అతిక్రమణగా కేసులుగా నమోదుచేసి రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.
పేదలకు రేషన్ డిపోల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి, అక్కడ నుంచి బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రేషన్‌షాపుల నుంచి, లబ్ధిదారులను మభ్యపెట్టి కేజీ రూ.10కి కొనుగోలు చేసి వీటిని రీసైక్లింగ్ చేసి కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రతినెలా లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇస్తుంది. నలుగురు ఉన్న కుటుంబానికి కేజీ రూ.1కు 20 కేజీల వరకు నెలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే ఎక్కువ మంది ఈ బియ్యాన్ని వాడటానికి ఆసక్తి కనపరచకపోవడంతో లబ్ధిదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి ఆ బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు ఆటోల ద్వారా గోడౌన్‌లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన రైస్‌బ్యాగ్‌లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
జిల్లాలోని రేషన్‌షాపుల నుంచే కాక జిల్లా సరిహద్దు తెలంగాణ గ్రామాల పరిధిలోని రేషన్‌షాపుల నుంచి కూడా బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెం, చింతలపూడి, జీలుగుమిల్లి, టి.నరసాపురం తదితర ప్రాంతాల్లో విజిలెన్స్‌అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకోగా తాజాగా తాడేపల్లిగూడెం, నల్లజర్లలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గతంలో రెవెన్యూ విజిలెన్స్ అధికారులు అక్రమార్కులపై దాడులు చేసినా కేవలం 6ఎ కేసుతో సరిపెట్టడంతో ఈ కేసుల నుంచి బయటపడి వెంటనే మళ్లీ ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్కరిపైనా 10 నుంచి 15 కేసులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఈ అక్రమ వ్యాపారాన్ని మానడం లేదు. ఈసారి కలెక్టర్ ఆదేశాల మేరకు 6ఎతో పాటు 7(1) సెక్షన్ కింద కేసులు పెట్టడంతో అక్రమ రవాణాదారుల్లో కలకలం రేగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికైనా రైస్‌మిల్లులపై దృష్టి పెడితే ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment