
వాటర్ ట్యాంకులో చనిపోయిన ఎలుకలు
సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట దళితవాడలో గల పైలెట్ వాటర్ స్కీమ్‌లో చచ్చిన ఎలుకలు పడిఉండడం స్థానికంగా కలకలం సృష్టించింది. మూడు రోజుల కిందటే మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాగా... సోమవారం నాడు వాటర్ ట్యాంకులో చచ్చిపడివున్న ఎలుకలు కనిపించడంతో ఆ ప్రాంతవాసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందటే మున్సిపాలిటీ సిబ్బంది వాటర్ స్కీమ్‌కు మరమ్మతులు చేపట్టి నీటి అవసరాలు తీర్చారు.
అయితే పైపుల నుంచి చిన్నపాటి ధారగా నీరు వస్తుండడంతో ఏదైనా అడ్డు పడి ఉంటుందని భావించిన మహిళలు స్థానికులకు తెలియజేశారు. దీంతో స్థానిక యువత ట్యాంక్ లోపలికి తొంగి చూసి అవాక్కయ్యారు. లోపల చచ్చిన ఎలుకలు కనిపించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. మూడు రోజులుగా పైపుల నుంచి చిన్నధారే వస్తోందని... అంటే ఎలుకలు చనిపోయి మూడు రోజులై ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా కలుషిత నీరే వినియోగిస్తుండడంతో ఎటువంటి రోగాలు ప్రబలుతాయోనని గగ్గోలు పెడుతున్నారు. ఇదిలాఉంటే కొంతకాలంగా ట్యాంక్‌కు పైకప్పు లేకపోవడంతో పాటు మీద చెట్ల కొమ్మలు వేలాడడంతో వాటిపైనుంచి ఎలుకలు జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బ్లీచింగ్ వేసి ట్యాంక్‌ను శుభ్రం చేశారు. మూడు రోజుల పాటు నీటిని వినియోగించవద్దని సూచించారు.
భయమేస్తోంది...
కలుషిత నీటిని మూడు రోజుల పాటు వినియోగించాం. ఎటువంటి అంటురోగాలు ప్రబలుతాయోనని భయంగా ఉంది. ఎలుకలు చనిపోవడంతో నీరు బాగా పాడైపోయింది. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు ట్యాంకులు శుభ్రం చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు.– వరమ్మ, బంగారమ్మపేట
Comments
Please login to add a commentAdd a comment