దేశం కాదు...క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చంద్రబాబే! | Ravali Jagan Kavali Jagan Program in Guntur | Sakshi
Sakshi News home page

దేశం కాదు...క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చంద్రబాబే!

Published Sun, Nov 11 2018 10:14 AM | Last Updated on Sun, Nov 11 2018 10:14 AM

Ravali Jagan Kavali Jagan Program in Guntur - Sakshi

సాక్షి,అమరావతి బ్యూరో: దేశంలో క్లిష్ట పరిస్థితులున్నాయని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మోదీపై యుద్ధం చేస్తున్నానని చంద్రబాబు డైలాగులు చెబుతున్నారని, వాస్తవానికి చంద్రబాబే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని  శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.  పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం ఆధ్వర్యంలో వేళాంగిణి నగర్‌లో రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఉమ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

 2014లో బీజేపీ, పవన్‌ మద్దతు ఉన్నా, కేవలం 1.9 శాతం ఓట్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడిందన్నారు. ఇటీవల రెండు జాతీయ సర్వేలు సైతం టీడీపీ కంటే అదనంగా 10 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అందరి వద్దకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 336 కరువు మండలాలున్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, రాష్ట్రంలో ఇంత దారిద్య్ర పరిస్థితులు నెలకొని, జనం వలసలు పోతున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్రం సుభిక్షంగా ఉందని గొప్పలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

 జగన్‌పై హత్యాయత్నం విషయంలో దోషులను శిక్షించాలనే విషయాన్ని మరిచి, దుర్మార్గానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ సీనియర్‌ నాయకుడు విజయచందర్‌ మాట్లాడుతూ జగన్‌ సీఎం అయ్యే కోరిక తీర్చమని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని, దానిని నెరవేర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మడమ తిప్పని నేతను మంచి మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 

వడ్డెర ప్రతినిధిగా ఊహించని అవకాశం... 
పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీటు అడగకపోయినా అత్యంత వెనుబడిన బీసీ వర్గానికి చెందిన తనను గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది ఉన్న వడ్డెర కులానికి ప్రతినిధిగా ఊహించని విధంగా అవకాశం కల్పించడంపై తన ఆనందానికి అవధులు లేవన్నారు. రాష్ట్రంలో రెడ్డి, క్రిస్టియన్, ముస్లింలను గుర్తించి వారి ఓట్లు తీసేస్తున్నారని విమర్శించారు. 

పశ్చిమ నియోజక వర్గంలోనే 42 వేల ఓట్లు తీసేశారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్త కిలారి రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మట్టి, ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ సీఎం కావడం చారిత్రక అవసరమని చెప్పారు. అందుకోసం త్యాగాలు తప్పవన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మొహమ్మద్‌ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలకు మంచి చేయాలన్న తపన
–రావి వెంకట రమణ, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు
పేదలకు మంచిచేయాలన్న తపనతో వైఎస్‌ జగన్‌ ఎంతటి అవరోధాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాభిమానం ముందు టిడిపి నేతలు నిలబడలేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement