- ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తా
- వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రామలింగారెడ్డితో ఆర్డీవో వినాయకం
వేముల : మండలంలోని బెస్తవారిపల్లె గ్రామంలో టీడీపీకి చెందిన వారితోనే బియ్యం పంపిణీ చేస్తాం.. ఏమి చేస్తారో చేసుకోండి.. ఇంకా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తానంటూ జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం వేముల మండల వైఎస్‌ఆర్‌సీపీ పరిశీలకులు రామలింగారెడ్డితో ఫోన్‌లో వాగ్వాదానికి దిగారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని వేల్పుల పంచాయతీ పరిధిలోని బెస్తవారిపల్లె గ్రామంలో డీలర్ అశోక్ బియ్యం పంపిణీ చేసేవారు.
ఇది జీర్ణించుకోని టీడీపీ నాయకులు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులతో చౌక దుకాణంపై దాడులు చేయించారు. బోర్డుపై ధరల పట్టిక లేదని సస్పెండ్ చేశారు. దీంతో బియ్యం పంపిణీని టీడీపీకి చెందిన వారికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గ్రామంలో 200కార్డుదారులు ఉండగా.. 185మంది కార్డుదారులు అక్కడికి బియ్యానికి వెళ్లారు. వారం రోజులక్రితం గ్రామానికి చెందిన వంద మంది కార్డుదారులు తాము అక్కడికి బియ్యానికి వెళ్లమని.. తమ కార్డులకు దేవాలయం వద్ద పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ చిన్నయ్యకు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఆయన కార్డుదారులతో ఇరువురికి ఆమోదయోగ్యమైన పేరును సూచిస్తే వారితో పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. వారం రోజులు గడిచినా తహశీల్దార్ చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం మళ్లీ కార్డుదారులు తహశీల్దార్‌కు సమస్యను వివరించారు. దీంతో ఆయన గ్రామంలో బియ్యాన్ని టీడీపీ వారే పంపిణీ చేస్తారు.. ఏమి చేస్తారో చేసుకోండంటూ గ్రామస్తులతో చిర్రుబుర్రులాడారు. వెంటనే వారు వైఎస్‌ఆర్‌సీపీ మండల పరిశీలకులు రామలింగారెడ్డికి విషయం చెప్పారు. ఆయన రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని తహశీల్దార్‌తో చర్చించారు. దీంతో ఆయన తన చేతుల్లో ఏమీ లేదని ఆర్డీవో వినాయకంతో మాట్లాడుకోవాలని సూచించారు. వెంటనే రామలింగారెడ్డి ఆర్డీవో తో ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో టీడీపీ వారి వద్దకు కార్డుదారులు బియ్యానికి వెళ్లనప్పుడు దేవాలయం వద్ద పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందుకు ఆర్డీవో వినాయకం రామలింగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలో టీడీపీ వారితోనే బియ్యం పంపిణీ చేస్తాం.. ఏమి చేస్తారో చేసుకోండి, తమాషా చేస్తున్నారా.. ఎక్కువగా మాట్లాడితే కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇందుకు రామలింగారెడ్డి కూడా తమ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని అడుగుతున్నాం, మీరు కేసులు పెడతామంటే..ఎవరూ భయపడరంటూ సమాధానం ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయానికి కార్డుదారులు చేరుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పంపించివేశారు.
ఏం చేస్తారో చేసుకోండి..
Published Thu, Apr 30 2015 4:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement