చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్‌ | Re-polling in five places in Chandragiri constituency on 19th | Sakshi
Sakshi News home page

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్‌

Published Thu, May 16 2019 4:57 AM | Last Updated on Thu, May 16 2019 2:15 PM

Re-polling in five places in Chandragiri constituency on 19th - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి (పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ 321), పుల్లివర్తిపల్లి(104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం(313) పోలింగ్‌ స్టేషన్లలో పార్లమెంటు, శాసనసభలకు మే19న రీ–పోలింగ్‌ నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి మే 10, 11 తేదీల్లో వచ్చిన లేఖలను పరిశీలించి రీ–పోలింగ్‌కు ఆదేశించినట్లు  ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదు బూత్‌ల్లోకి ఇతరులను లోపలికి రానీయకుండా రిగ్గింగ్‌ చేసినట్లు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దళితులను లోనికి రానీయకుండా అధికారపార్టీ నేతలు ఈ ఐదు బూత్‌లను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్‌ చేశారని, ఈ ఐదు చోట్ల వీడియా రికార్డింగులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటూ చెవిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో రికార్డులను పరిశీలించి రిగ్గింగ్‌ జరిగినట్లు నిర్ధారణకు వచ్చి, రీపోలింగ్‌కు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.  మే19న రీ–పోలింగ్‌కు  సంబంధిత అధికారులు మే17వ తేదీ సాయంత్రంలోగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 19 ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఉత్తర్వులు వెలువడటానికి కొన్ని గంటల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు కళా వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరిపై విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా విచారణకు ఆదేశిస్తారంటూ అడిషనల్‌ సీఈవో సుజాతా శర్మను నిలదీశారు. అనంతరం కళా వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలు జరగలేదని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న నివేదిక ఇచ్చారని, అయినా  రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఎలా విచారణ జరుపుతుందని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement