chandra giri
-
గుట్టకాయ స్వాహా..
అధికారంలో ఉన్నన్నాళ్లూ కబ్జాలు, సెటిల్మెంట్లతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మారినా తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీటిపై యంత్రాంగం దృష్టి సారించడంతో.. వారికన్ను గుట్టలు, కుంటలపై పడింది. వాటిని ఇష్టానుసారం తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా చంద్రగిరిలోని పత్తి గుట్ట వీరి దెబ్బకు రూపురేఖలు కోల్పోతోంది. సాక్షి,చిత్తూరు(చంద్రగిరి): గత ప్రభుత్వంలో నీరు–మట్టి పథకం టీడీపీ నాయకులకు కల్పతరువుగా ఉండేది. ఈ పేరుతో వారు చెరువులను, కుంటలను కబ్జా చేయడంతో పాటు అక్కడి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి దోపిడీకి అడ్డుకట్ట పడింది. అయితే కొన్నిచోట్ల అక్రమాలకు అలవాటు పడిన నాయకులు తమ నీచబుద్ధిని మాత్రం ఇంకా వదులుకోలేదు. గుట్ట గుటుక్కు చంద్రగిరి లెక్కదాఖల సర్వే నంబరు 1479లో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో పత్తిగుట్ట ఉంది. ఈ గుట్టలో నాణ్యమైన ఎర్రమట్టి ఉండడంతో తెలుగుదేశం నాయకుల కన్ను దీనిపై పడింది. అంతే.. గత పది రోజులుగా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా నిర్విరామంగా మట్టిని తరలించేస్తూ లక్షలు దండుకుంటున్నారు. లోడ్ రూ.800 పత్తిగుట్టలోని మట్టిని ట్రాక్టర్ లోడ్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి పాతపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా మారి గుట్టను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారతీనగర్, ఎంజీ బ్రదర్స్ ప్లాట్లు, రెడ్డివీధితో పాటు ఇతర ప్రాంతాల్లో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారికి ఈ మట్టిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇటుక బట్టీల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ మట్టిని తరలించేస్తున్నారు. పట్టపగలే మట్టి అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఆలస్యంగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణ పౌరుడు గజం భూమి ఆక్రమిస్తే ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రెవెన్యూ సిబ్బంది, సుమారు ఎకరా విస్తీర్ణంలో గుట్టను పది రోజులుగా స్వాహా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం సర్వే నంబరు 1479లోని పత్తిగుట్టలో అక్రమంగా ఎకరాకు పైగా మట్టిని తరలించినట్లు తెలియడంతో ఆదివారం తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు సిబ్బందితో కలసి గుట్టను పరిశీలించారు. మట్టి అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐ మోహన్‌రెడ్డి, వీఆర్ఓలు నాగరాజు, అశోక్ కుమార్ ఉన్నారు. సబ్సిడీ ట్రాక్టర్ల ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందించే ట్రాక్టర్లను మట్టి తరలింపునకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆ ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు ట్రాక్టర్లను వినియోగించడమంటే ప్రభుత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. సుమారు 10 ట్రాక్టర్లకు పైగా వైట్‌బోర్డు(సబ్సిడీ ట్రాక్టర్లు) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు చంద్రగిరి సమీపంలోని పత్తిగుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే జేసీబీతో పాటు ట్రాక్టర్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. అధికారులు వచ్చే సమయానికి ఎవ రూ లేకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. – అరుణ్, చంద్రగిరి, భారతీనగర్ ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించాలి. అక్రమంగా మట్టి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే స్థానికులందరం కలసి ధర్నాకు దిగుతాం. – భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి -
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల 19న రీ–పోలింగ్
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లి (పోలింగ్ స్టేషన్ నంబర్ 321), పుల్లివర్తిపల్లి(104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం(313) పోలింగ్ స్టేషన్లలో పార్లమెంటు, శాసనసభలకు మే19న రీ–పోలింగ్ నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి మే 10, 11 తేదీల్లో వచ్చిన లేఖలను పరిశీలించి రీ–పోలింగ్‌కు ఆదేశించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదు బూత్‌ల్లోకి ఇతరులను లోపలికి రానీయకుండా రిగ్గింగ్ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దళితులను లోనికి రానీయకుండా అధికారపార్టీ నేతలు ఈ ఐదు బూత్‌లను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్ చేశారని, ఈ ఐదు చోట్ల వీడియా రికార్డింగులను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటూ చెవిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో రికార్డులను పరిశీలించి రిగ్గింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చి, రీపోలింగ్‌కు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. మే19న రీ–పోలింగ్‌కు సంబంధిత అధికారులు మే17వ తేదీ సాయంత్రంలోగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 19 ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉత్తర్వులు వెలువడటానికి కొన్ని గంటల ముందు తెలుగుదేశం పార్టీ నేతలు కళా వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరిపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా విచారణకు ఆదేశిస్తారంటూ అడిషనల్ సీఈవో సుజాతా శర్మను నిలదీశారు. అనంతరం కళా వెంకటరావు విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలు జరగలేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న నివేదిక ఇచ్చారని, అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఎలా విచారణ జరుపుతుందని ప్రశ్నించారు. -
చెరువులపై పచ్చపడగ
సాక్షి, తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో 567 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద దాదాపు 15,200 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 146 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు గురైన చెరువుల విలువ దాదాపు రూ.208 కోట్లకు పైమాటేనని రెవెన్యూ సిబ్బందే ఆఫ్ ది రికార్డుగా చెపుతున్నారు. ఆక్రమణల్లో తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం టాప్. తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం మండలాల్లో చెరువుల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. రెండు మండలాల్లో 195 చెరువులు ఉంటే , అందులో 86కు పైగా చెరువులు ఇప్పటికే కబ్జాల పాలయ్యాయి. ∙తిరుపతి రూరల్ మండలం ఓటేరులోని చెరువును సైతం కొందరు ఆక్రమించి చెరువును మట్టితో నింపారు. చెరువులో ఇంటి పట్టాలను సైతం సృష్టించారు. జాతీయ రహదారికి ఆనుకొని 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు విలువ దాదాపు రూ.80 కోట్లకు పైమాటే. ∙ఎర్రావారిపాళెం: మండలం కమళ్లయ్యగారిపల్లిలో 13.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న గంగినేని చెరువులో రూ.18 లక్షలు విలువ చేసే 6 ఎకరాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ముగ్గురు ఆక్రమించారు. ∙ఇదే మండలంలో 25.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న బడగానిపల్లి చెరువులో రూ.15 లక్షలు విలువ చేసే 10 ఎకరాలను బడంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడు. ∙కమల్లయ్యగారిపల్లిలో రూ.10 లక్షల విలువైన చెరువుతో పాటు శ్మశానాన్ని సైతం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ∙తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువులో రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇంటి పట్టాలు ఇప్పించారు. పచ్చనేతలు లక్షలు లక్షలు వసూలు చేసుకోని చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేశారు. పేదలు ఇళ్లు కట్టుకోని నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో దాదాపు 90 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ∙దుర్గసముద్రం–అడపారెడ్డిపల్లె గ్రామాల మధ్య ఉన్న చెరువును కొందరు రాజకీయ అండతో అక్రమించి మామిడి తోటలను పెంచుతున్నారు. ∙రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లిలోని తాతిరెడ్డిచెరువులో రూ.1.20 కోట్ల విలువైన 10 ఎకరాలను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. చెరువు తనదేనని యథేచ్ఛగా వ్యవసాయం మొదలు పెట్టాడు. ∙తమకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా 9.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనుప్పల్లి చెరువులో 4 ఎకరాలను రైతులు అక్రమించారు. అలాగే కుప్పంబాదూరు, అన్నసానిగండి చెరువు, పిళ్లారికోన, బొప్పరాజుపల్లి చెరువుల్లోనూ అక్రమణలు జరిగిపోయాయి.శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద చెరువును ఆక్రమించి జోరుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం చెరువును ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాదాపు 22 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువులను చెరపట్టారు చంద్రబాబు ప్రభుత్వంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ స్థలాలు, పోరంబోకులను మింగిన భూబ కాసురులు చెరువులను సైతం చెరబట్టారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా ఉన్న రూ.100 కోట్ల విలువైన ఓటేరు చెరువును అధికార పార్టీ అండతో ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ రికార్డులను మా ర్చేందుకు తెగబడ్డాడు. వారికి రెవెన్యూ అధి కారులు వత్తాసు పలకడంతో ఓ దశలో పట్టా భూమిగా మార్చారు. నిజాయితీపరుడైన తహసీల్దార్ వచ్చి న్యాయ పోరాటం చేయడంతో తిరిగి చెరువుగా నిలిచింది. – రమణ, ఓటేరు -
చంద్రగిరికి చిత్తూరు రౌడీయిజం..!
చిత్తూరు, తిరుపతి రూరల్: చిత్తూరు రౌడీ రాజకీయం చంద్రగిరికి విస్తరిస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో కత్తులు, రాడ్డులు సైరవిహారం చేస్తున్నాయి. వరుస దాడులతో పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మొన్న చంద్రగిరి మండలం మొరవపల్లిలో దళితుడైన పుట్టా రవిపై జరిగిన దాడిని మరవకముందే, నిన్న తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన ఘటన కళ్లేదుటే ఉండగానే, తాజాగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిఖిల్పైన పులివర్తి నాని అనుచరులు కత్తులు, రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రయత్నించడమే అతను చేసిన తప్పు. కత్తులు, రాడ్లలతో దాడి దామినేడుకు చెందిన నిఖిల్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. నాని ఫ్లెక్సీ తప్ప మరొక పార్టీ వ్యక్తుల వారివి ఉండకూడదని దామినేడుకు చెందిన పులివర్తి నాని అనుచరుడు రాఘవ అక్కడ రచ్చ చేశాడు. ఫ్లెక్సీని తీసివేయాలని హుకుం జారీ చేశాడు. నిఖిల్ పట్టించుకోకపోవడంతో రాఘవతో పాటు అతని అనుచరులు నిఖిల్, అతని ఫ్రెండ్ వంశీపై రాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర రక్త గాయాలతో ఉన్న నిఖిల్, వంశీని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. పులివర్తి నాని అనుచరుడు రాఘవపై తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయపెడుతున్న కొత్త సంస్కృతి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతోనే దాడుల సంస్కృతి పెరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరికి వచ్చిన కొత్త సంస్కృతి వల్ల పల్లెల్లో ప్రశాంతత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకుడు ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడని మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ దాడులు, హత్యయత్నం ఘటనలపై చిత్తూరు, తిరుపతి అర్భన్ ఎస్పీలు సీరియస్ అయ్యారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త సంస్కృతిని చంద్రగిరి నుంచి తరిమివేయాలని, ప్రోత్సాహించే నాయకులకు తగిన గుణపాఠం తప్పదని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
చంద్రగిరి జన్మభూమి సభలో కలకలం
చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో జన్మభూమి సభలో కలకలం రేగింది. జిల్లా పరిధిలోని చంద్రగిరిలో శనివారం జరిగిన జన్మభూమి సభలో దళిత కులానికి చెందిన బాల సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు న్యాయం జరగాలంటూ ముగ్గురు చిన్నారులతో సహా ఒంటి పై కిరోసిన పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమిని అగ్ర కులాల వారు కబ్జా చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ బాలసుబ్రమణ్యం ఆరోపించాడు. విచారణ చేయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
తిరుపతి ఆర్టీవో, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం రాత్రి రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. వివరాలు... తిరుపతి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు ఏర్పడటంతో పరిసర ప్రాంతాలవారు అప్రమత్తమయ్యారు. మంటలు దాదాపు అరగంట పాటు మండుతూనే ఉన్నాయి. కార్యాలయంలోని నాలుగు కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 9.40 గంటలకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా, విద్యానగర్ బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆవరణలోని డీజిల్ జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈలోపు సుమారు 10 వేల రూపాయల డీజిల్ కాలిపోయినట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరగడం చర్చనీయాంశమైంది. అయితే అధికారులు మాత్రం రెండు సంఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయని తెలిపారు.