అధికారంలో ఉన్నన్నాళ్లూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మారినా తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వీటిపై యంత్రాంగం దృష్టి సారించడంతో.. వారికన్ను గుట్టలు, కుంటలపై పడింది. వాటిని ఇష్టానుసారం తవ్వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా చంద్రగిరిలోని పత్తి గుట్ట వీరి దెబ్బకు రూపురేఖలు కోల్పోతోంది.
సాక్షి,చిత్తూరు(చంద్రగిరి): గత ప్రభుత్వంలో నీరు–మట్టి పథకం టీడీపీ నాయకులకు కల్పతరువుగా ఉండేది. ఈ పేరుతో వారు చెరువులను, కుంటలను కబ్జా చేయడంతో పాటు అక్కడి మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి దోపిడీకి అడ్డుకట్ట పడింది. అయితే కొన్నిచోట్ల అక్రమాలకు అలవాటు పడిన నాయకులు తమ నీచబుద్ధిని మాత్రం ఇంకా వదులుకోలేదు.
గుట్ట గుటుక్కు
చంద్రగిరి లెక్కదాఖల సర్వే నంబరు 1479లో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో పత్తిగుట్ట ఉంది. ఈ గుట్టలో నాణ్యమైన ఎర్రమట్టి ఉండడంతో తెలుగుదేశం నాయకుల కన్ను దీనిపై పడింది. అంతే.. గత పది రోజులుగా రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జేసీబీల సాయంతో ట్రాక్టర్ల ద్వారా నిర్విరామంగా మట్టిని తరలించేస్తూ లక్షలు దండుకుంటున్నారు.
లోడ్ రూ.800
పత్తిగుట్టలోని మట్టిని ట్రాక్టర్ లోడ్ రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి పాతపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా మారి గుట్టను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారతీనగర్, ఎంజీ బ్రదర్స్ ప్లాట్లు, రెడ్డివీధితో పాటు ఇతర ప్రాంతాల్లో నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారికి ఈ మట్టిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇటుక బట్టీల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ మట్టిని తరలించేస్తున్నారు. పట్టపగలే మట్టి అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఆలస్యంగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది. సాధారణ పౌరుడు గజం భూమి ఆక్రమిస్తే ఆగమేఘాలపై చర్యలు తీసుకునే రెవెన్యూ సిబ్బంది, సుమారు ఎకరా విస్తీర్ణంలో గుట్టను పది రోజులుగా స్వాహా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
సర్వే నంబరు 1479లోని పత్తిగుట్టలో అక్రమంగా ఎకరాకు పైగా మట్టిని తరలించినట్లు తెలియడంతో ఆదివారం తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు సిబ్బందితో కలసి గుట్టను పరిశీలించారు. మట్టి అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ మోహన్‌రెడ్డి, వీఆర్‌ఓలు నాగరాజు, అశోక్ కుమార్ ఉన్నారు.
సబ్సిడీ ట్రాక్టర్ల ద్వారా..
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందించే ట్రాక్టర్లను మట్టి తరలింపునకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆ ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలి. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు ట్రాక్టర్లను వినియోగించడమంటే ప్రభుత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. సుమారు 10 ట్రాక్టర్లకు పైగా వైట్‌బోర్డు(సబ్సిడీ ట్రాక్టర్లు) వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
చంద్రగిరి సమీపంలోని పత్తిగుంట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే జేసీబీతో పాటు ట్రాక్టర్లు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. అధికారులు వచ్చే సమయానికి ఎవ రూ లేకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఇదే సీన్ రిపీట్ అవుతోంది.
– అరుణ్, చంద్రగిరి, భారతీనగర్
ప్రశ్నిస్తే దౌర్జన్యానికి
పాల్పడుతున్నారు
ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించాలి. అక్రమంగా మట్టి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే స్థానికులందరం కలసి ధర్నాకు దిగుతాం.
– భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి
Comments
Please login to add a commentAdd a comment