తిరుపతి ఆర్టీవో, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రెండు ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం రాత్రి రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. నిమిషాల వ్యవధిలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. వివరాలు... తిరుపతి ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు ఏర్పడటంతో పరిసర ప్రాంతాలవారు అప్రమత్తమయ్యారు. మంటలు దాదాపు అరగంట పాటు మండుతూనే ఉన్నాయి. కార్యాలయంలోని నాలుగు కంప్యూటర్లు, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది 9.40 గంటలకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే స్థానికులు మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కాగా, విద్యానగర్ బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆవరణలోని డీజిల్ జనరేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈలోపు సుమారు 10 వేల రూపాయల డీజిల్ కాలిపోయినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు తెలిపాయి. కాగా, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు జరగడం చర్చనీయాంశమైంది. అయితే అధికారులు మాత్రం రెండు సంఘటనలు ప్రమాదవశాత్తు జరిగాయని తెలిపారు.