- నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఆర్డీవో కార్యాలయం వద్దగట్టి బందోబస్తు
- 2,92,698 మంది ఓటర్లు, 256 పోలింగ్ కేంద్రాలు
తిరుపతి తుడా: నామినేషన్ల ఘట్టంతో తిరుపతి ఉప ఎన్నిక ఊపందుకుంది. ఈ నెల 12న కేంద్ర ఎన్నికల కమిషన్ తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆర్డీవో వి.వీరబ్రహ్మయ్య ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉద యం 11 గంటల నుంచి నామినేషన్లను ఆర్డీవో కార్యాలయంలో స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యం లో ఆర్డీవో కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే వ్యక్తికి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కార్యాలయానికి 100 మీటర్ల దూరం లోపు అనుమతి ఉండదు. పోలీసులతో ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
2,92,698 మంది ఓటర్లు
తిరుపతి నియోజవర్గం కొత్త ఓటర్ల జాబితాను రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీ నాటి తుది జాబితా ప్రకారం నియోజక వర్గంలో 2,92,698 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో వీరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషులు-1,48,999, మహిళలు - 1,43,660 , ఇతరులు 39 ఓటర్లు ఉన్నారని ఆర్‌వో వీరబ్రహ్మయ్య చెప్పారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో 256 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 25 సెక్టార్లుగా విభజించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.