ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలలే..
2015 ఏప్రిల్ ఆధార్ లింక్‌తో రేషనలైజేషన్
25న జీవో విడుదల! ఉపాధ్యాయ నేతల ఆందోళన
మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలలపై సర్కారు కన్నెర్ర చేస్తోంది. ఇప్పటివరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2015 ఏప్రిల్ నాటికి విద్యార్థుల ఆధార్ అనుసంధానాన్ని బట్టి పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియను అమలుచేయనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్య డెరైక్టర్ ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేశారు. వీటిని ఆయా జిల్లాల విద్యాశాధికారులకు పంపారు. డెరైక్టర్ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నెల 25న రేషనలైజేషన్ అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఇవి అమలైతే జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మాత్రమే కొనసాగుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు దాదాపు మూతపడే అవకాశం మెండుగా ఉందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు.
అన్ని స్కూళ్లపై ప్రభావం
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2606, ప్రాథమికోన్నత పాఠశాలలు 907, ఉన్నత పాఠశాలలు 929 మొత్తం 4442 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,09,387, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98,767, ఉన్నత పాఠశాలల్లో 2,92,517 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విడుదల చేసిన విధివిధానాల్లో ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7తరగతుల్లో 35 మంది లోపు, 6, 7, 8 తరగతుల్లో 50 మంది లోపు, ఉన్నత పాఠశాలల్లో 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత పాఠశాలను మూసివేయాలని నిర్ణయించారు. 2015 విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో 2014 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్‌ను అమలు చేశారు. 2015 ఏప్రిల్ నాటికి ఆధార్ లింకు ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రేషనలైజేషన్ అమలు చేయనున్నారు. 2015లో ప్రాథమిక పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేసిన సమయంలో రైల్వేట్రాక్‌లు, పెద్దకాలువలు, జాతీయ రహదారులను దాటి వేరే ప్రాంతానికి విద్యార్థులు వెళ్లాల్సి ఉంటే మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు. ఈ విధివిధానాలను తయారుచేసి గత నెల చివరి వారంలో ఉపాధ్యాయ సంఘ నాయకుల సమావేశం నిర్వహించి పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలు చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ విషయంపై కొందరు ఉపాధ్యాయ సంఘ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయడమే తప్ప ఉపాధ్యాయ సంఘం నాయకుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని చెప్పకనే చెప్పారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. పదో తరగతి మూల్యాంకనం పూర్తయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో రేషనలైజేషన్ అమలుకు రంగం సిద్ధమైనట్లేనని ఉపాధ్యాయులు అంటున్నారు. సక్సెస్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పైగా ఇంగ్లిషు మీడియం చదువుతుంటే ఆ పాఠశాలలను ఇంగ్లిషు మీడియం పాఠశాలగా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా అదే పాఠశాలలో తెలుగు మీడియం చదివే విద్యార్థులను వేరే పాఠశాలలో కలిపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
ఇబ్బందులు ఇవీ
ప్రభుత్వం ముందూవెనుక ఆలోచించకుండా రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాయటమేననే వాదన వినిపిస్తోంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలను మూసివేస్తే కిలోమీటరు దూరంలోని మరో ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదివే విద్యార్థులు గ్రామాన్ని విడిచి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు ఎలా వెళ్లివస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉంది. 75 మందిలోపు విద్యార్థులు ఉంటే సంబంధిత ఉన్నత పాఠశాలను మూసివేస్తే 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు ఐదు కిలోమీటర్లు ఎలా వెళ్లి వస్తారనే ప్రశ్నను వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా గ్రామం నుంచి పాఠశాలను పూర్తిగా తొలగిస్తే ఆ ప్రభావం స్థానికంగా పడుతుందని, కనీసం ఐదు నుంచి ఏడు శాతం వరకు చిన్నారులు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు. పాఠశాలను మూసివేసి ఉపాధ్యాయులను ఎక్కడికి బదిలీ చేస్తారనేది అర్ధం కాని పరిస్థితి. ఇప్పటికే కొంత మంది ఉపాధ్యాయులను వయోజన విద్యా విభాగానికి కేటాయించారు. ఉపాధ్యాయ సంఘ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వారికి ఆర్డర్లు ఇవ్వకుండా తొక్కిపట్టారు. రేషనలైజేషన్ అమలు చేస్తే మరికొంత మంది ఉపాధ్యాయులు మిగులుబాటుగా ఉండే అవకాశం ఉంది. వీరిని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపయోగించుకుంటారనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటం దుర్మార్గపు చర్యగానే పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై విద్యాశాఖ త్వరలో జీవో జారీ చేయనుండటంతో జిల్లాలో ఎన్ని పాఠశాలలు మూతపడతాయో వేచి చూడాలి.