
పంచాయతీ’ పరీక్షలకు సర్వం సిద్ధం
పంచాయతీ’ పరీక్షలకు సర్వం సిద్ధం
అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 23న నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి బుధవారం ప్రత్యేక వాహనంలో ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరాయి.
జెడ్పీఏఓ అనూరాధ, డీపీఓ రమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వరదరాజు సమక్షంలో పశ్న్రపత్రాలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి సీల్ వేశారు. 202 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 46,780 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాప్తాడు, శింగనమల మినహా అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పెనుకొండ, పుట్టపర్తిలలో మొత్తం 144 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షల నిర్వహణకు 144 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిపి 24 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 13 మంది అబ్జర్వర్లు, దాదాపు 2 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు.