హౌసింగ్ డీఈఈ ఆస్తులు కోట్లలో..
Published Wed, Apr 23 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
సామర్లకోట హౌసింగ్ కార్యాలయంలో డీఈఈగా పని చేస్తున్న పల్లా నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేశారు. కాకినాడలోని ఆయన ఇంట్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉభయ గోదావరి, హైదరాబాద్‌లో ఉన్న ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :గృహనిర్మాణ సంస్థలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. కాకినాడకు చెందిన పల్లా నాగేశ్వర రావు సామర్లకోట హౌసింగ్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఉభయ గోదావరి, హైదరాబాద్‌లలోని ఆయన కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. వెదికే కొద్దీ ఆస్తులు బయటపడుతుండడంతో ఏసీబీ అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. కాకినాడలోని నాగేశ్వరరావు నివాసంలోనే సుమారు రూ. ఐదు కోట్ల ఆస్తులు ఏసీబీ అధికారులకు చిక్కాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లతో పాటు, బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఏసీబీ డీఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి. కాకినాడ శశికాంత్‌నగర్‌లోని శ్రీదేవి అపార్ట్‌మెంట్ బీ-1 ఫ్లాట్‌లోని అతని నివాసంలో మంగళవారం నిర్వహించిన దాడులలో రూ. 3.50 లక్షల నగదు, 3.5 కేజీల వెండి, 3.5 లక్షల విలువైన ఎల్‌ఐసీ బాండ్లు, ఎనిమిది స్థలాలకు సంబంధించిన పత్రాలు, 13 ఎకరాల పొలాల డాక్యుమెంట్లు, 770 గ్రాముల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. గొల్లబాబు అనే కాంట్రాక్టర్‌తో రూ. 50 లక్షల కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దీంతో గొల్లబాబు ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వరరావు, అతడి తండ్రి పల్లా సత్యానందం బ్యాంకు లాకర్లను ఇంకా పరిశీలించాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. భీమవరం, కత్తిపూడి, ఏలూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో వీరికి స్థలాలు కూడా ఉన్నాయని గుర్తించారు.
నాగేశ్వరరావు తమ్ముడు పల్లా ఏసుబాబు నివాసంలో, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు ఏసీబీ డీఎస్పీలు, సీఐలు దాడులలో పాల్గొన్నారు. హౌసింగ్ డీఈఈ పల్లా నాగేశ్వరరావు ఆస్తులపై ఏసీబీ దాడుల వ్యవహారం గృహనిర్మాణ సంస్థ వర్గాలలో కలకలం రేపింది. ఆయనతో సన్నిహితంగా ఉండే ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. తమపై కూడా ఏసీబీ దాడులు జరుగుతాయనే అనుమానంతో వారు అప్రమత్తం అయ్యారు. కాకినాడ, సామర్లకోటల్లోని హౌసింగ్ కార్యాలయాల సిబ్బంది, పలువురు కాంట్రాక్టర్లు కూడా కలవరానికి గురవుతున్నారు. తనిఖీలు మరో రెండురోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.
Advertisement
Advertisement