ప్రాణ త్యాగం | Reassuring Tragedy | Sakshi
Sakshi News home page

ప్రాణ త్యాగం

Published Sat, Feb 1 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

ప్రాణ త్యాగం

ప్రాణ త్యాగం

  •      మూగజీవిని రక్షించబోయి మృత్యువాత
  •      అన్నదమ్ముల విషాదాంతం
  •      రెండు కుటుంబాల్లో శోకం
  •      ఇసుక తవ్వకాలే కారణం
  •  గొలుగొండ, న్యూస్‌లైన్ : మూగజీవి మృత్యు ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ అన్నదమ్ములు చలించిపోయారు. తమ జీవనాధారమైన జీవిని రక్షించాలని ఆరాటపడ్డారు. ముందు అన్న వెళ్లి మృత్యువు గుప్పెట్లో చిక్కి విలవిలలాడుతూ ఉంటే అతడిని కాపాడడానికి తమ్ముడు వెళ్లి తానూ బలయిపోయాడు. వరాహ నదిలోని ఊబిలో మునిగిపోతున్న పాడిగేదెను రక్షించే ప్రయత్నంలో ఇద్దరూ కన్నుమూసి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు.  నదిలో నీటి ఉధృతి లేకపోయినా ఒకేచోట 20 అడుగుల లోతులో ఊబి కారణంగా ఈతరాని ఇద్దరూ పాడిగేదెతో పాటు మృత్యువు పాలై తమ వారిని విషాదంలో ముంచారు.

    గొలుగొండ మండలం గుండుపాల కొత్తూరుకు చెందిన కొరుప్రోలు రాజుబాబు, కొరుప్రోలు సత్యనారాయణ చీడిగుమ్మల సమీపంలో ఉన్న వరాహనది సమీపంలోని పంటపొలాల్లో మేత కోసం పాడిగేదెను తీసుకెళ్లారు. అది పారిపోకుండా కాళ్లకు బంధాలు వేసి వదిలారు. ఎప్పటికీ రాకపోయేసరికి సాయంత్రం వెతకడం మొదలెట్టారు. గేదె అప్పటికే వరాహనదికి ఆనుకుని ఉన్న గడ్డి మేస్తూ జారిపడింది. కాళ్లకు బంధాలు ఉండడంతో అది ఒడ్డుకు చేరుకోలేక అవస్థ పడుతూ ఉండడంతో గేదె యజమాని రాజుబాబు రక్షించేందుకు ఒక్కసారిగా నదిలోకి దిగాడు. రాజుబాబుకు ఈత రాకపోవడంతోపాటు ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశాడు.

    అన్న కేకలు విన్న సత్యనారాయణ కూడా నదిలోకి దిగాడు. అతడికి కూడా ఈత రాకపోవడంతో గేదెతో పాటు ఇద్దరూ మృతి చెందారు. రాజుబాబు, సత్యనారాయణ చిన్నాన్న, పెదనాన్న బిడ్డలు. ఇద్దరూ ఎప్పటికీ ఇళ్లకు రాకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెతుకులాట మొదలెట్టి, చివరికి నది వద్దకు వచ్చి గేదె కళేబరాన్ని, చెంతనే రాజుబాబు, సత్యనారాయణల మృతదేహాలను చూసి గొల్లుమన్నారు.

    రాజుబాబుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా సత్యనారాయణకు ఇద్దరూ ఆడపిల్లలే. నర్సీపట్నం రూరల్ సీఐ తిరుమలరావు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.  రాత్రి కావడంతో మృతదేహాలను వెలికితీయడానికి అవకాశం లేకుండా పోయింది. నది వద్దకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని బావురుమంటున్నారు.
     
    ఇసుక తవ్వకాలే కారణం : వరాహనదిలో ప్రమాదం జరిగిన చోట భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో నదీగర్భం లోతుగా మారిందని స్థానికులు చెబుతున్నారు. స్వార్థం కోసం ఇసుక స్మగ్లర్లు ఒకేచోట తవ్వకాలు చేపట్టడంతో ఊబి ఏర్పడిందని అంటున్నారు. ఈ ఊబిలో అన్నదమ్ములు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఇక్కడే ఒక బాలుడు కూడా మృతిచెందాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement