
చినబాబు – కో..దే విశాఖ ఉత్సవ్
⇒ ఆయన సిఫార్సు చేసిన సంస్థకే నిర్వహణ కాంట్రాక్టు
⇒ ఎక్కువ రేట్ కోట్ చేసినా.. అస్మదీయునికే ధారాదత్తం
⇒ ట్రాక్ రికార్డు లేదు.. నిబంధనలూ పట్టించుకోలేదు
⇒ ఇటీవలే విండ్ ఫెస్టివల్ ఫ్లాప్ అయినా.. ఓకే
⇒ లోకల్ టాలెంట్‌ను విస్మరించడంపై విమర్శలు
ఎక్కడైనా.. ఏదైనా కాంట్రాక్టును.. తక్కువ ధర కోట్ చేసిన వారికే ఇస్తారు. ప్రభుత్వమైనా, ప్రైవేట్ సంస్థలైనా ఇదే ఫార్ములాను అనుసరిస్తాయి. ఎవరి విషయంలోనో అయితే ఇవన్నీ ఓకే గానీ.. సాక్షాత్తు చిన్నబాబే రంగంలోకి దిగితే ఫార్ములాలన్నీ ఫార్సుగా మారిపోవాల్సిందే..కావాలంటే విశాఖ ఉత్సవ్‌టెండర్ తతంగాన్నే చూడండి..తక్కువ కోట్ చేసిన సంస్థను కాలదన్ని.. ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థకుకాంట్రాక్టు కట్టబెట్టారు.భారీ ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి అనుభవమూ లేని సంస్థకు.. ఎక్కువ ధరకు కట్టబెట్టారంటేనే..విశాఖ ఉత్సవ్ ఉత్సాహమంతా చినబాబు అండ్ కో..దేనని వేరే చెప్పాలా!
విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ను ఈ నెల 27 నుంచి మూడ్రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.75 కోట్లు మంజూరు చేసిందని అధికారులు చెబుతున్నారు. కానీ అంచనా వ్యయం మాత్రం రూ.3.50 కోట్లుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు. గత ఏడాది ఇవే ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మాత్రమే ఇవ్వగా..అప్పట్లో అధికారులు నగరంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల నుంచి సుమారు ఐదు కోట్ల వరకు విరాళాల రూపంలో దండేశారు. లెక్కాపత్రం లేకుండా వసూళ్లు సాగించి.. సగానికి పైగా విరాళాల సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఉత్సవాలకు టూరిజం శాఖ టెండర్ పిలవగా రెండే రెండు టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్ సంస్థ, మరొకటి పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్. హైదరాబాద్‌కు చెందిన వైబ్రీ ఈవెంట్స్(విష్ణు) మేనేజ్‌మెంట్ సంస్థ రూ.1.85 కోట్లకే టెండర్ దాఖలు చేయగా, పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ సంస్థ రూ.1.97 కోట్లకు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం చూస్తే.. తక్కువ రేటు కోట్ చేసిన వైబ్రీసంస్థ టెండర్‌నే ఖరారు చేయాలి. సైమా అవార్డుల ఫంక్షన్ వంటి భారీ ఈవెంట్లు నిర్వహించిన అనుభవం కూడా ఈ సంస్థకు ఉంది. కానీ అధికారులు దాన్ని కాదని పూణేకు చెందిన ఈ ఫ్యాక్టర్ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీని వెనుక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న చినబాబు ఒత్తిళ్లు పనిచేశాయంటున్నారు. తన స్నేహితులు భాగస్వాములుగా ఉన్న పూణే సంస్థకు కాంట్రాక్టు దక్కేలా ఆయనగారు చక్రం తిప్పారని అంటున్నారు. పూణేలో వెడ్డింగ్ ప్లానింగ్స్, కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వ హించే ఈ సంస్థకు రూ.5 కోట్ల టర్నోవర్ ఉందనే ఏకైక కారణంతో అప్పగించినట్టు తెలుస్తోంది.
విండ్ ఫెస్టివల్ దెబ్బతిన్నా...
పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా ఉన్న కౌశిక్ ముఖర్జీ ఈ టెండర్ ఖరారు వెనుక క్రియాశీల పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. ఇటీవలే అట్టర్ ఫ్లాప్ అయిన విండ్ ఫెస్టివల్ కాంట్రాక్టును కూడా కౌశిక్ ముఖర్జీయే చినబాబు ద్వారా మంత్రాంగం జరిపి ఈ ఫ్యాక్టర్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్‌కు అప్పగించారు. కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టిన ఈ విండ్ ఫెస్టివల్ ఎవ్వరినీ ఆకర్షించలేకపోయింది. స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఈవెంట్ నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ అదే సంస్థకు విశాఖ ఉత్సవాల కాంట్రాక్టు కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది. కేవలం చినబాబు సిఫార్సు మేరకే చేసేది లేక కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ కూడా ఓకే చేసిందని అంటున్నారు.
లోకల్ టాలెంట్ పనికి రాదా?
వాస్తవానికి గతంలో విశాఖకు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకే ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. నిర్వహణలోపాలు ఎలా ఉన్నా ఆ సంస్థలు లోకల్ కళాకారుల ప్రతిభను బాగానే వినియోగించుకున్నాయి. అయితే ఇప్పుడు లోకల్ టాలెంట్‌ను కాదని బడాబాబుల పెళ్లిళ్లు, పేరంటాలు చేసే ఈ ఫ్యాక్టర్‌కు భారీ సొమ్ముకు కట్టబెట్టడం విమర్శల పాలవుతోంది. ఇంతవరకు విశాఖ ఉత్సవ్ వంటి పెద్ద ఈవెంట్ చేసిన ట్రాక్ రికార్డు ఆ సంస్థకు లేదు. కేవలం చినబాబు నుంచి సిఫార్సు రాగానే లోకల్ టాలెంట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి ప్రామాణికాలు, అర్హతలు లేని సంస్థకు అప్పజెప్పడంపై వివాదం రేగుతోంది.