రెడ్ అలర్ట్ | red alert | Sakshi
Sakshi News home page

రెడ్ అలర్ట్

Published Tue, Apr 7 2015 3:51 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM

red alert

జిల్లాలో ‘సిమి’  కదలికలపై నిఘా నేత్రం
పోలీసుల ముమ్మర తనిఖీలు
జీపీఆర్ సిస్టమ్ ద్వారా దర్యాప్తు

 
కడప అర్బన్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సిమి ఉగ్రవాదుల కదలిక జిల్లాకు కూడా పాకిందని ఉన్నతాధికారుల ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు.. కడప నగరంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సిమి ఉగ్రవాది నెల్లూరు నుంచి జిల్లాలో ప్రవేశించాడని జీపీఆర్ సిస్టమ్ ద్వారా భావించారు. కడపలోని మాసాపేట సర్కిల్, దేవునికడప రోడ్డు, పెద్దదర్గా సమీపాల్లో సదరు సభ్యుని కదలికలు ఉన్నాయని అనుమానించారు. ప్రతి వాహనాన్ని కడప అర్బన్ పోలీసులు తనిఖీలు చేశారు. మరోవైపు మాసాపేట సర్కిల్ సమీపంలో ఓ వాహనం ఉండడంతో దానిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే, సదరు వాహనం ప్రొద్దుటూరుకు సంబంధించిన వ్యక్తిదిగా నిర్ధారించారు. తనిఖీల అనంతరం ఎవరూ పట్టుబడకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల్లో సదరు నిందితుడు కర్నూలు వైపు వెళ్లాడని సమాచారం రాగానే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లాలో దోపిడీలకు పాల్పడిన ముఠా సభ్యుడని అనుమానం

కడప నుంచి కర్నూలు వైపు బయలుదేరిన సదరు నిందితుడు నంద్యాల మీదుగా కర్నూలుకు చేరుకోగానే అక్కడి పోలీసులకు ముందస్తుగా జిల్లా సీసీఎస్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. అక్కడ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కొద్ది సమయంలోనే కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. విచారణ చేస్తే జిల్లాలోని వరుస దోపిడీలు, జువారీ, ఆర్టీపీపీలలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన ముఠాలోని ప్రధాన సభ్యుడిగా భావిస్తున్నారు.

ఉగ్రవాది కదిలికలంటూ హల్‌చల్

 దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటికే ముగ్గురు పోలీసులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ క్రమంలో సిమి ఉగ్రవాదుల కదలిక జిల్లాలో ప్రధానంగా కడప నగరంలో ఉందని తెలియగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాది కదలికలు నెల్లూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు మీదుగా వచ్చి మాసాపేట సర్కిల్, పెద్దదర్గా వరకు వెళ్లి.. మరలా మాసాపేట సర్కిల్ మీదుగా దేవునికడప మీదుగా బైపాస్‌రోడ్డుకు చేరుకుని తర్వాత కర్నూలు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఆయుధాలతోపాటు పటిష్ఠ బందోబస్తుతో వచ్చి వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా మొత్తం ఈ సమాచారంతో అలర్ట్ అయ్యారు.

జిల్లా వ్యాప్తంగా అలర్ట్

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు రెండు రోజుల నుంచి సెమి ఉగ్రవాదుల కదలిక, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలంటూ పోలీసు అధికారులందరికీ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన సంఘటనల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు కూడా స్పెషల్ పార్టీ పోలీసుల సమన్వయంతో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సిమి ఉగ్రవాదుల నైజం

సిమి ఉగ్రవాదులు నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పోలీసులపై ఉన్నట్లుండి కాల్పులు జరిపారని.. పోలీసులు పోరాడి అమర వీరులయ్యారని వారి గమనాన్ని కూడా ఉన్నతాధికారులు జిల్లా పోలీసులకు సూచించినట్లు సమాచారం. వారు దోపిడీలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలను సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెడతారని, అలాగే పోలీసులు యూనిఫాంలో ఉన్నా లేక మఫ్టీలో ఉన్నా వారిని పసిగట్టి వెంటనే తమ దగ్గరున్న ఆయుధాలతో కాల్పులు జరుపుతారని చెప్పినట్లు విశ్వసనీయం సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అధికారులు జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement