ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండాలు | red flags in government lands | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండాలు

Published Thu, Oct 5 2017 1:01 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

red flags in government lands - Sakshi

విజయనగరం పూల్‌భాగ్‌: పట్టణంలోని కెఎల్‌.పురం, చెంచుల కాలనీతో పాటు పలు వార్డుల్లో నివసించే పేదలు సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో భూ పోరాటానికి బుధవారం సన్నద్ధమయ్యారు. ప్రభుత్వ భూమిని స్వా«ధీనం చేసుకుని పేదలకు అప్పగించారు. పట్టణంలో సీపీఎం సాధించిన సుందరయ్య కాలనీ సమీపాన సర్వే నెంబరు 90/1లో  ఉన్న సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలంతా ఎర్ర జెండాలు పాతారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకున్నారు.  ఈ సందర్భంగా  సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలోని పేదలందరికీ గూడు కావాలని ఏళ్లుగా సీపీఎం పోరాడుతోందన్నారు. నిలువనీడ లేని ఎందరో పేదలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారని, ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ ఇళ్లు  హామీ ఆచరణలో అమలు కావటంలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం కూడా డబ్బున్న వారి తరఫున పని చేస్తునందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌బి.నగర్, సుందరయ్య కాలనీ, రామకృష్ణానగర్‌ కాలనీ వాసులు సీపీఎం పోరాడి సాధించుకున్నారని తెలిపారు. ఇక్కడ కూడా నిజమైన పేదలకు న్యాయం జరిగేంత వరకూ సీపీఎం అండగా ఉంటుందన్నారు. డివిజన్‌ కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ పేదలకు ఇళ్లు స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎప్పటి నుంచో పోరాడుతోందన్నారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.రమణమ్మ, పుణ్యవతి, బి.దేవరాజు, రాము, కె.రమణ, అధిక సంఖ్యలో పేదలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement