ఆదోని టౌన్: అన్నదాతల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలే లేవంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదివారం ఆదోని మునిసిపల్ క్రీడా మైదానంలో ఏఐటీయూసీ 19వ జిల్లా మహా సభలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. తుపాన్ కారణంగా నష్టపోయి ఉత్తరాంధ్ర రైతులు ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వర్షాల్లేక కరువుకాటకాలతో రాయలసీమ అన్నదాత బలవంగా తనువు చాలిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, టీడీపీలకు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.
దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌మాణిక్యం అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులను అన్యాయంగా తొలగిస్తున్నారన్నారు. మహాసభలకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, నాయకులు భీమ లింగప్ప, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, రాష్ట్ర సమతి సభ్యులు అజయ్‌బాబు, సీపీఐ మండల, పట్టణ నాయకులు కల్లుబావి రాజు, వీరేష్, సుంకయ్య, మహిళా సంఘం నాయకురాళ్ళు లలితమ్మ, భాగ్యలక్ష్మి, నాయకులు గిడ్డయ్య, నాగేంద్ర, ప్రసాద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రజెండా రెపరెపలు..
ఆదోనిలో ఆదివారం ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఏఐటీయూసీ జిల్లా 19వ మహా సభల సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రదర్శనగా మునిసిపల్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ప్రదర్శనలో కళాకారులు సందడి చేశారు. మోటార్ సైకిళ్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మిక, కర్షక, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.
ఎర్ర దండు
Published Mon, Dec 8 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement