
30 మంది ఎర్రచందనం కూలీల పరారీ
తిరుపతి క్రైమ్: శేషాచలం అడవుల్లో కూంబింగ్ జరుపుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మరోసారి తమిళ కూలీలు ఎదురుపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి తిరుపతి పట్టణ సమీపంలోని చైతన్యాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపారు.
పోలీసులను చూసి 30 మందికిపైగా తమిళ కూలీలు పరారయ్యారు. చిన్నప్ప అనే తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి చెందిన కూలీ మాత్రం పట్టుబడ్డాడు. 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారైన కూలీల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.