రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్..
విశాఖపట్నం: గేట్లులేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్న ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మెదక్ జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదంలో చిన్నారుల మృతి అందర్నీ కలచివేసింది. అయితే విశాఖపట్నం ఉక్కునగరంలో నివసించే టీవీ మెకానిక్ సెంగుటువన్ మాత్రం ఈ ప్రమాదాలను చూస్తూ అయ్యోపాపం అని కూర్చోవాలనుకోలేదు. తన సృజనాత్మకతతో రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్ వేసే పరికరాన్ని కనిపెట్టాడు. అతితక్కువ ఖర్చయే ఈ పరికరం అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, ఇలాంటి పరికరం దేశంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ రూపొందించలేదని చెబుతున్నాడు. ఇక ఈ పరికరం పని తీరు ఎలా ఉంటుందంటే.. పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ పరికరానికి పసుపు, ఎరుపు ఎల్‌ఈడీ బల్బులను, వాటి కింద లూపర్‌ను అమర్చాలి.
దానిపై రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్, బ్యాటరీ ఉంటుంది. ఈ పరికరాన్ని క్రాసింగ్‌కు ఇరువైపులా రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్ వద్ద స్తంభానికి అమర్చాలి. ఇదేవిధంగా రైలు ఇంజిన్‌పై కూడా చిన్నసైజు సోలార్ ప్యానెల్, రేడియో ట్రాన్స్‌మీటర్‌ను బ్యాటరీతో పాటు అమర్చాలి. రైలు గేటుకు చేరడానికి మూడు నిమిషాల ముందు నుంచి ఎరుపు రంగు బల్బు వెలుగుతుంది. అప్పుడు ఆపరికరం నుంచి మొదలయ్యే హెచ్చరికలు రైలు వెళ్లిన నిమిషంన్నర వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత మరో రైలు వచ్చే వరకూ పసుపురంగు బల్బు వెలుగుతూ ఉంటుంది. 17 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి వైజాగ్‌లో స్థిరపడ్డ సెంగుటువన్ ఇంతకు ముందు గ్యాస్‌లీక్ సెన్సర్ కూడా కనుగొన్నాడు.