ప్రకృతి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా సర్వం కోల్పోయిన కేరళ పౌరులు ఇప్పుడిప్పుడే బుర దతో నిండి ఉన్న తమ తమ ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కొందరికైతే వెళ్లడానికంటూ ఇళ్లే లేవు. అవి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. ఇప్పటికీ ఇంకా వరద ముంపులో ఉన్న ప్రాంతాలున్నాయి. ఈలోగా ఊహించని విధంగా వరద సాయం వివాదం మొదలైంది. కేరళలో జరి గిన నష్టం మొత్తం రూ. 21,000 కోట్ల పైమాటేనని, సాధారణ జీవనం మొదలు కావాలంటే కనీసం రూ. 2,200 కోట్లు అవసరమని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు గ్రాంటుగా మంజూరు చేసింది. ఇంత భారీ నష్టం సంభవించి నచోట ఇది ఏమూలకు సరిపోతుందన్న ప్రశ్నకు జవాబిచ్చేవారు లేరు. మరోపక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఇవ్వజూపిన రూ. 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. అంతేగాక ఏ దేశం సాయం చేయడానికి ముందుకొచ్చినా సున్నితంగా తిరస్క రించాలంటూ మన రాయబార కార్యాలయాలకు ప్రభుత్వం వర్తమానం పంపింది.
ఇప్పుడు సంభవించిన నష్టం సాధారణమైనది కాదు. కేరళలోని అత్యధిక జిల్లాల్లోని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలమంది ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు అందిస్తున్న సాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థి తుల్లో మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్న దేశాలను తోసిపుచ్చటం సరైనదేనా అన్న సందే హం ఎవరికైనా తలెత్తుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాలు సాయం అందించటానికి ముందుకు రావటం, మన దేశం వద్దనడం ఇది మొదటిసారేమీ కాదు. కశ్మీర్ భూకంపం(2005), ఉత్తరాఖండ్ వరదలు(2013), కశ్మీర్ వరదలు(2014) ఉదంతాల్లో అమెరికా, జపాన్, రష్యాలు ఇవ్వ జూపిన ఆర్థిక సాయాన్ని మన దేశం తిరస్కరించింది. 2004కు ముందు ఇలా లేదు. 1991నాటి ఉత్తరకాశీ భూకంపం, 1993నాటి లాతూర్ భూకంపం, 2001నాటి గుజరాత్ భూకంపం, 2002నాటి బెంగాల్ తుఫాను, 2004నాటి బిహార్ వరదల సమయాల్లో విదేశాల నుంచి సాయం అందుకుంది. ఎందుకీ మార్పు? ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని స్వశక్తితో పూడ్చుకోవటం సాధ్యమని నిజంగా మన దేశం విశ్వసిస్తోందా? ఇంతవరకూ జరిగిన వేర్వేరు వైపరీత్యాలను మనం అలా ఎదుర్కొనగలిగామా? పూర్తిస్థాయి పునర్నిర్మాణాన్ని
సుసాధ్యం చేసుకోగలిగామా?
ఆత్మాభిమానం కొనియాడదగిందే. ఎలాంటి పరిస్థితులెదురైనా చేయిచాచరాదన్న సంకల్పం గొప్పదే. కానీ లక్షలాదిమంది బతుకులు రోడ్డున పడినప్పుడు, మౌలిక సదుపాయాల కల్పనకు మన శక్తి చాలనప్పుడు సైతం ఇలాగే ప్రవర్తించాలా? ఇది మధ్యతరగతి మనస్తత్వాన్ని ప్రతిబింబించటం లేదా? ఇలా సాయాన్ని తిరస్కరించటం ద్వారా తానొక ఆర్థిక శక్తిగా రూపుదిద్దుకున్నానని చాటి చెప్పాలన్న ఆరాటమే కనబడుతోంది. మన దేశం గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చవి చూసింది. 60వ దశకంలో ఆకలి చావులు సంభవిస్తున్నప్పుడు, ప్రజలకు తిండిగింజలు చాలనప్పుడు అమెరికా ఇచ్చిన గోధుమలు, బియ్యంపై ఆధారపడ్డాం. 1991లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి అప్పు తెచ్చుకోవటానికి మన బంగారం నిల్వలను తాకట్టు పెట్టాం. ఇప్పటికి కూడా బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి విభాగం మొదలుకొని వేర్వేరు సంస్థల నుంచి పెద్ద మొత్తంలో సహా యాన్ని స్వీకరిస్తున్న దేశాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నాం.
2004లో సునామీ సంభవించి 12,000 మంది మరణించి, దాదాపు పది లక్షలమంది నిరాశ్రయులైనప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తొలిసారి విదేశీ సాయాన్ని తిరస్కరించారు. దీన్ని స్వయంశక్తితో ఎదుర్కొనగలమని అప్పట్లో ఆయన ప్రకటించారు. పైగా మన సర్కారు శ్రీలంకకు 2 కోట్ల 25 లక్షల డాలర్లు, ఇండొనేసియాకు పది లక్షల డాలర్లు ఆర్థిక సాయం అందించింది. అత్యంత పేద దేశమైన హైతీ మొదలుకొని బాగా అభివృద్ధి చెందిన జపాన్ వరకూ మన సాయం పొందాయి. 2005లో భారత్, పాకిస్తాన్‌లు రెండూ భూకంపం ధాటికి తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఆ సమయంలో కూడా మన దేశం విదేశీ సాయాన్ని తిరస్క రించింది. కానీ పాకిస్తాన్‌ను ఒప్పించి దాని అధీనంలోని ఆక్రమిత కశ్మీర్‌కు దుప్పట్లు, మందులు, ఆహారం పంపింది. 2 కోట్ల 50 లక్షల డాలర్ల చెక్కు కూడా ఇచ్చింది. ఎవరిదగ్గరైనా సాయం తీసుకో వటమంటే వారికి సాష్టాంగపడటమేనన్న అభిప్రాయం ఉన్న పక్షంలో ఇవ్వడంలోనూ అదే విధానాన్ని పాటించాలి. వారికి కూడా ఆత్మాభిమానం ఉంటుందని గుర్తించాలి. కనీసం వారు అర్ధించే వరకూ ఆగాలి.
యూఏఈ కేవలం ఒక దేశంగా మాత్రమే సాయపడటానికి ముందుకు రావటం లేదు. తమ ఆర్థిక పురోగతిలో కేరళ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల పాత్ర ఉన్నదని గుర్తించి, వారి కుటుంబాలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం తమ ధర్మమని భావించింది. కేరళకొచ్చిన కష్టం జాతీయ వైపరీత్యంగా పరిగణించి కేంద్రం తగిన మొత్తంలో నిధులందిస్తే వేరే విషయం. ఇంత వరకూ వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు అంతంతమాత్రమే. సునామీ సమయంలో 10వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం అందించిన మొత్తం రూ. 500 కోట్లు. మహారాష్ట్ర వరదలు(2005)లో నష్టం రూ. 6,000 కోట్లయితే అందిన సాయం రూ. 700 కోట్లు. ఇలా ఎప్పుడైనా కేంద్రం నుంచి అందేది తక్కువే. నష్టానికీ, అందే సాయానికీ మధ్య ఇంత అగాథం ఉంటున్నప్పుడు ఏ దేశమైనా మన తిరస్కరణను చూసి పరిహసించదా? తోటి మనుషులు ఆపదలో పడినప్పుడు అండగా నిలబడటం మానవ నైజం. ఇవాళ వాళ్లు సాయ పడితే... రేపు మన వంతు రావొచ్చు. పరస్పరం సహకరించుకోవటం, సాయం చేసుకోవటంలో కించపడ వలసిందేమీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment