నరేంద్ర మోదీ, పినరయి విజయన్
సాక్షి, న్యూఢిల్లీ : జల ప్రళయానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇస్తానన్న ఆర్థిక సహాయాన్ని కేంద్రం తిరస్కరించిందన్న వార్తలపై కేంద్రం, కేరళ మధ్య తలెత్తిన వివాదం శుక్రవారం నాడు మరో మలుపు తిరిగింది. యూఏఈ ఆఫర్ గురించి మీకు ఎవరు చెప్పారు? ఆ వార్త ఎలా వచ్చింది? కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి వివరణ కోరడం, అసలు అలాంటి ఆఫరే యూఏఈ నుంచి రాలేదని బీజేపీ నాయకుడు అమిత్ మాలవియా శుక్రవారం ప్రకటించడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు యూఏఈ ముందుకు వచ్చిందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగస్టు 21వ తేదీన ట్వీట్ చేశారు. ఇది కేంద్రం ఇప్పటి వరకు ప్రకటించిన ఆర్థిక సహాయం 600 కోట్ల రూపాయలకన్నా అధికం అవడంతో ఆయన ట్వీట్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ వార్త తప్పన్న విషయమై వాట్సాప్ గ్రూపుల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నకిలీ వార్తలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ వార్తలో నిజమెంతుంది? అబద్ధమెంతుంది? అందుకు బాధ్యులెవరు? అన్న అంశాన్ని పరిశీలించాల్సిందే. అయితే వార్తా వ్యాప్తి క్రమాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చూడాలి.
- కేరళ జల ప్రళయం గురించి తెలియగానే యూఏఈ స్పందిస్తూ తమ దేశ విజయగాధలో కేరళ ప్రజల పాత్ర ఉన్నందున కేరళకు సహాయం చేయాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. కేరళ సహాయక చర్యలకు సహకరించేందుకు ఓ అత్యవసర కమిటీని ఏర్పాటు చేశామని యూఏఈ ఆగస్టు 18వ తేదీన ప్రకటించింది.
- కష్ట కాలంలో కేరళ ప్రజలను ఆదుకోవడానికి యూఏఈ ముందుకు వచ్చినందుకు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అల్ మక్తౌమ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.
- ఆగస్టు 21వ తేదీన కేరళ సీఎం పినరయి విజయన్, 700 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చిందని ట్వీట్ చేశారు. యూఏఈ ఈ విషయాన్ని ముందుగా గల్ఫ్‌లో అతిపెద్ద రిటైల్ చెయిన్ కలిగిన ‘లూలూ గ్రూప్’ యజమాని, మలయాళి వ్యాపారి యూసుఫ్ అలీ ఎంఏకు తెలియజేసిందని, నరేంద్ర మోదీకేమో అబుదాబీ రాజు షేక్ మొహమ్మద్ అల్ నాహ్యన్ ఈ విషయాన్ని తెలియజేశారని కేరళ సీఎంవో వరుస ట్వీట్లలో తెలియజేసింది.
- ఈ ట్వీట్లను ఆ రోజున యూఏఈగానీ, పీఎంవో కార్యాలయంగానీ ఖండించలేదు. ఈ ఆఫర్‌ను స్వీకరించేందుకు ప్రధాని మోదీ సుముఖంగా లేరని, విదేశీ సహాయం స్వీకరించకూడదనే కేంద్రం వైఖరికే ఆయన కట్టుబడి ఉన్నారంటూ ఆ మరుసటి రోజు, అంటే ఆగస్టు 22వ తేదీన అభిజ్ఞ వర్గాల పేరిట వార్తలొచ్చాయి.
- కేరళను ఆదుకునేందుకు పలు విదేశీ ప్రభుత్వాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకు ధన్యవాదాలు. విదేశీ విరాళాలను స్వీకరించకుండా స్వదేశీ నిధులను సహాయక చర్యలకు వెచ్చించే పద్ధతినే పాటిస్తాం. ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధులను కేరళ పునర్నిర్మాణానికి ఖర్చు పెడతాం. ఎన్‌ఆర్‌ఐ, పీఐవోలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల నుంచి మాత్రం ఆర్థిక సహాయాన్ని స్వీకరిస్తాం అంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
- కేరళకు వచ్చిన విపత్తు అసాధారణమైనది కనుక, ఇలాంటి సమయాల్లో ఆర్థిక సహాయం తీసుకోవచ్చంటూ 2015 నాటి మోదీ ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్’ చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారికి విదేశీ సహాయాన్ని స్వీకరించాల్సిందిగా తన సీనియర్లను కోరుతున్నానని కేంద్ర బీజేపీ మంత్రి కేజే ఆల్ఫాన్స్ వ్యాఖ్యానించారు.
- ఆగస్టు 24: భారత్‌కు తాము ఇంత మొత్తం ఆర్థిక సహాయం చేయాలంటూ కచ్చితమైన సంఖ్యనేమీ సూచించలేదని, ఎంత సహాయం అందించాలనే విషయమై ఇంకా కసరత్తు జరుగుతోందని భారత్‌లోని యూఏఈ రాయబారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో వ్యాఖ్యానించారు.
- అదే రోజు బీజేపీ నాయకులు కేరళ ప్రభుత్వంపై దండయాత్ర ప్రారంభించారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తామనే ఆఫర్‌నే రాయబారి ఖండించినట్లు వారు ప్రచారం చేశారు. వాస్తవానికి ఆఫర్‌ను రాయబారి ఖండించలేదు. 700 కోట్ల రూపాయలను ఇస్తామన్న సంఖ్యను మాత్రమే ఆయన ఖండించారు.
- యూఏఈ ఆఫర్‌ను మోదీ ప్రభుత్వం తిరస్కరించిందన్నదే ఇక్కడ వార్తగానీ ఎంత అన్న సంఖ్య ముఖ్యం కాదు. కేంద్రం కన్న ఆఫర్ మొత్తం ఎక్కువ ఉన్నందున కేంద్రం పరువు తీయడానికి ఈ సంఖ్యను సృష్టించే అవకాశం కూడా ఉంది. మరి వాస్తవాలు తెలియడం ఎలా?
- గల్ఫ్ దేశం మోదీకే నేరుగా ఆఫర్ చేసిందని పినరయి విజయన్ చెప్పారు. తనకు ఆఫర్ చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. తనకు ప్రముఖ మలయాళి గల్ఫ్ వ్యాపారస్థుడు యూసుఫ్ అలీ చెప్పారని తెలిపారు. ఇటు కేరళతోపాటు అటు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం, యూఏఈ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయనకు వాస్తవం తెలియాలి. మోదీ ముందుకు ఆఫర్ తీసుకొచ్చిన వారికి, ఆఫర్‌ను తిరస్కరించిన మోదీకి వాస్తవాలు తెలియాలి. దీనిపై ఇంత వివాదం జరుగుతున్నా మోదీ గానీ, ఆయన కార్యాలయంగానీ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment