పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు, టెక్ దిగ్గజాలు మొదలుకొని సామాన్యుల వరకు తమకు తోచిన సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆగస్టు 29 వరకు 730 కోట్ల రూపాయలు అందాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. వరదల అనంతర పరిస్థితులపై, పునరావాస చర్యలపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ.. 730 కోట్ల రూపాయల సాయం అందిందని ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో ఈ మొత్తం జమ అయినట్టు ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం(600 కోట్ల రూపాయలు) కన్నా ఇది 21.7 శాతం ఎక్కువని పేర్కొన్నారు. తమ అంచనాల కన్నా మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. కేరళను పునర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ నలుమూలల నుంచి కేరళను ఆదుకోవడానికి అనేక మంది ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రకృతి విలయం కారణంగా కేరళలో 20వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది.
ఊహించని వర్షం.. అపార నష్టం
వరదల కారణంగా 483 మంది ప్రాణాలు కోల్పోయారని, 15 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. వరదల సమయంలో 14.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం 59,296 మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని చెప్పారు. 57 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. వరదల కారణంగా సంభవించిన నష్టం దాదాపుగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను దాటిపోయిందని భావిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు 98.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేయగా ఏకంగా 352.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment