
తిరువనంతపురం: వరదలతో అల్లాడిన కేరళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీసాయాన్ని ప్రకటించడం ఆకర్షణీయంగా నిలిచింది. అయితే తాజాగా యూఏఈ ఆర్థికసాయంపై మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సాయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనలేదని యూఏఈ అంబాసిడర్ ప్రకటించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
కేరళకు అందించే ఆర్థిక సహాయం నిర్దిష్ట మొత్తాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదని గల్ఫ్ దేశ రాయబారి ప్రకటించారు. వారికందించాల్సిన విరాళాలపై తమ అంచనా కొనసాగుతోందని అహ్మద్ అల్బన్నా చెప్పారని రిపోర్ట్ చేసింది. అయితే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్రానికి కేవలం 600 కోట్ల రూపాయలిచ్చి కేంద్రం చేతులు దులుపుకోగా గల్ఫ్‌దేశం రూ.700 కోట్ల భారీ సాయం అందించిందంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు విదేశీ ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం కూడా భారీ చర్చకు తెరతీసిన సంగతి తెలిసిందే. విదేశీసాయంపై ఒకవైపు వివాదం కొనసాగుతుండగానే, యూఏఈ రాయబారి ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు యూఏఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేయడం కూడా గమనార్హం. మరి తాజా గందరగోళంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరోవైపు గల్ఫ్ దేశం సాయాన్నితిరస్కరించడంపై పలువురు నాయకులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేరళ ఆర్థికమంత్రి థామస్ ఇసాక్ గల్ఫ్ దేశం ఇచ్చింది రుణంకాదు, సాయం, విపత్తు నివారణ విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత‍్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే యూఏఈ సహాయాన్ని ఆమోదించేలా విధానంలో సవరణలు తేవాలంటూ ప్రధాని మోదీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఒక లేఖ రాశారు. ప్రజల బాధలను నిర్మూలించేలా విధానాలు ఉండాలి, విదేశీ ఆర్థిక సహాయాన్ని ఆమోదించడానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే, దయచేసి తగిన మార్పులను తీసుకురావాలని ఆయన కోరారు.
కాగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ యూఏఈ సహాయంపై స్వయంగా మీడియాకు తెలియజేసారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ‍్మద్ బిన్ జావేద్ అల్ నహాన్ రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment