railway crossing
-
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్.. క్షణాల్లో తునాతునకలు!
లక్నో: రైలు పట్టాలు దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గేటు వేసినా ఆ ఏమౌతుందిలే అని వెళ్లే ప్రయత్నం చేస్తే.. ప్రాణాల మీదకే వస్తుంది. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో జరిగింది. అయితే.. ఇక్కడ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు. అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో కిడ్నాపైన బాలుడు.. బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో ప్రత్యక్షం! -
ఒక్క క్షణం ఆలస్యమైతే.. పరిస్థితి? వైరల్ వీడియో
సాక్షి, రాజమండ్రి : రైల్వే క్రాసింగ్‌ల వద్ద, రైలు పట్టాలవద్ద ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా..జనాల నిర్లక్ష్యం మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. తొందరగా వెళ్లి పోవాలన్న ఆతృతలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సీసీటీవీలో రికార్డైంది. టూవీలర్‌తో పాటు పట్టాలను దాటాలని ప్రయత్నించాడో యువకుడు. ఇంతలో అదుపుతప్పి పడబోయాడు. చివరి క్షణంలో చేతిలో బైక్‌ను అక్కడే వదిలేసి పక్కకు తప్పుకున్నాడు. అంతే.. వేగంగా దూసుకొచ్చిన రైలు ధాటికి ఆ బైక్ తునా తునకలైపోయింది. ఈ దృశ్యాల్ని చూసిన యువడికి గుండె అరచేతిలోకి వచ్చినంత పనైంది. క్షణాల్లో ప్రమాదం తప్పడంతో ఆ యువకుడు బతుకు జీవుడా... అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆఖరి నిమిషంలో ప్రాణాలు దక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా....రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
రిస్క్ చేస్తే ఇలాంటివే జరుగుతాయి
-
రిస్క్ చేస్తే ఇలాంటివే జరుగుతాయి
లాస్ ఏంజిల్స్ : రైల్వే ట్రాక్ దాటుతున్న కారును రైలు వేగంగా వచ్చి ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో కారును రైలు ఈడ్చుకెళ్లిన దృశ్యం చూస్తే ఎవరికైనా భయం కలగాల్సిందే... అయితే ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడటం విశేషం. ఈ ఘటన లాస్ ఏంజిల్స్‌లో చోటుచేసుకుంది. కాగా ఈ సన్నివేశం మొత్తం అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. రైల్వే ట్రాక్ వద్ద గేటు లేకపోతే జరిగే ప్రమాదం ఎలా ఉంటుందనడానికి ఇదే ఉదాహరణ. దీనిని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియాలో కారు రైల్వే క్రాసింగ్ దగ్గరకు మెల్లిగానే వచ్చినట్లు తెలుస్తుంది. అయితే గేట్ లేకపోవడంతో మొదటి లెవల్ క్రాసింగ్ వద్దకు రాగానే రైలు వస్తుందో లేదో గమనించి కారును ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో ఒక రైలు వేగంగా వచ్చి కారును ఈడ్చుకెళ్లింది. ' ఈ ఘటనను మేం అస్సలు ఊహించలేదు. ప్రమాదంలో కారు మొత్తం నుజ్జయినా డ్రైవర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడడం అదృష్టమనే చెప్పాలి. కానీ ఈ సన్నివేశం అందరికి ఒక గుణపాఠం కావాలి. రైల్వే గేటు లేకున్నా.. సిగ్నల్స్, రైలు వస్తుంది..లేనిది గమనించి వెళితే బాగుంటుంది. అనవసర రిస్క్‌లు తీసుకుంటూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు' అంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కారు డ్రైవర్‌దే తప్పు ఉందంటూ.. రైలు వస్తుందో..లేదో గమనించి వెళితే బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు. -
‘బడికి కాదు.. కాటికి సాగనంపా’
లక్నో, కుశినగర్ : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం తాలూకు బాధిత కుటుంబాల్లో శోకం అలుముకుంది. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టిన ఘటనలో 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మిశ్రౌలీ గ్రామ పెద్ద కిరణ్‌దేవి తన ముగ్గురు బిడ్డల్ని కోల్పోయారు. ఘటనలో రవి (12), సంతోష్ (10), రాగిణి (7)లు విగతజీవులుగా మారారు. ‘బడికి వెళ్లమని నా పిల్లలు మొండికేశారు. కానీ బలవంతంగా వారిని బస్సు ఎక్కించి నా చేతులారా నేనే చంపుకున్నా’అని కిరణ్ దేవి గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనతో షాక్‌కు గురైన చిన్నారుల తండ్రి ఇంకా తేరుకోలేదు. ‘మా మనుమలు, మనమరాలు ఫోటోలు గోడకు వేలాడుతున్నాయి. కానీ వారు లేరనే విషయాన్ని నమ్మలేక పోతున్నాం. ఆ ఫోటోలపైపు చూడాలంటేనే భయంగా ఉంది’ అని చిన్నారుల తాతయ్య హరిహర ప్రసాద్ భోరున విలపించాడు. తన కొడుకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని.. ఇప్పుడు తమ వంశానికి వారసులే లేకుండా పోయారని వాపోయాడు. కుశినగర్ జిల్లాలో కాపలా లేని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద గురువారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది. రైలు ఢీకొట్టడంతో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా 12 ఏళ్లలోపు వాళ్లే. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగుగు విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. ప్రభుత్వం తరపున రూ. 2లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. -
‘క్రాసింగ్’ దాటని ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు రైల్వే క్రాసింగ్‌లో చిక్కుకుంటున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల నిర్మాణాలు రైల్వే లైన్లు దాటలేక చతికిలబడుతున్నాయి. తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 32 రైల్వే క్రాసింగ్‌లు ప్రాజెక్టుల పనులకు అడ్డుగా నిలుస్తుండటంతో 4.74 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతోంది. ఈ విషయమై రైల్వేతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి 11 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి. ఇందులో ఇప్పటికే 26 క్రాసింగ్‌ల పనులు పూర్తయ్యాయి. మరో 32 చోట్ల పూర్తయితే గానీ కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టడం కుదరదు. ఇందులో నెట్టెంపాడు పరిధిలో 5, దేవాదులలో 6, ఎల్లంపల్లిలో 3, కాళేశ్వరంలో 3, ఉదయసముద్రం, వరద కాల్వ పరిధిలో రెండేసి చొప్పున క్రాసింగ్ సమస్యలున్నాయి. పెనుగంగ, కొమురం భీం పరిధిలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. క్రాసింగ్లకు సంబంధించి నిధులను నీటి పారుదల శాఖ రైల్వేకు డిపాజిట్ చేస్తున్నా పనుల్లో వేగం మాత్రం కానరావడంలేదు. పనులు పట్టాలెక్కుతాయా..? రైల్వే క్రాసింగ్‌ల వల్ల ప్రభావితమవుతున్న 4,74,851 ఎకరాల ఆయకట్టులో 3,38,507 ఎకరాలకు ఈ ఏడాది చివరికి నీళ్లివ్వాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నెట్టెంపాడు, దేవాదుల, కొమురం భీం, ఉదయసముద్రం, ఎల్లంపల్లి పరిధిలో 18 చోట్ల రైల్వే క్రాసింగ్‌ల పనులు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రాసింగ్ ఇబ్బందులపై వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలయ్యే నాటికి 12 క్రాసింగ్ పనులు పూర్తి చేసి 90,709 ఎకరాలకు.. రబీ నాటికి మరో 2,47,798 ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలని కోరారు. మరో 14 క్రాసింగ్లను పూర్తి చేస్తే 1,36,344 ఎకరాలకు నీరందు తుందని చెప్పారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలత వ్యక్తం చేసినా పనులు పట్టాలెక్కుతాయా? ఆయకట్టుకు నీరందుతుందా? వేచి చూడాలి. -
అనుమతులు అడవిపాలు.. కాల్వలు రోడ్డు పాలు..!
సాగునీటి ప్రాజెక్టుల కాల్వలకు అడవి, రోడ్లు, రైల్వే క్రాసింగ్‌ల చక్రబంధం ► ప్రధాన పనులపైనే అధికారుల దృష్టి ► అటవీ అనుమతుల్లేక రెండున్నర లక్షల ఎకరాలపై ప్రభావం ► రోడ్డు దాటలేక ఏడు లక్షల ఎకరాలకు చేరని నీరు ► రైల్వే క్రాసింగ్‌ల సమస్యతో 2.8 లక్షల ఎకరాలకు తిప్పలు ► ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక ప్రాజెక్టుల జాప్యం ► పెరిగిపోతున్న ప్రాజెక్టుల వ్యయ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నా.. ఆయకట్టుకు నీరందేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల ప్రధాన పనులు పూర్తిచేసినా కాల్వల నిర్మాణానికి అటవీ అనుమతులు, రోడ్లు, రైల్వే క్రాసింగ్‌లు ఇబ్బందిగా మారాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, అనుమతుల జారీలో కేంద్రం చేస్తున్న జాప్యం ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి. దీంతో 10 లక్షలకుపైగా ఎకరాల ఆయకట్టు ప్రభావితం అవుతుండడం గమనార్హం. –సాక్షి, హైదరాబాద్ రైల్వే క్రాసింగ్‌లతో ఇబ్బందులు 11 ప్రాజెక్టులు 60 క్రాసింగ్‌లు 26 పూర్తయినవి 10 పురోగతిలో ఉన్నవి 24 చేపట్టాల్సినవి ప్రభావితమయ్యే ఆయకట్టు: 2,83,966 ఎకరాలు ఆయకట్టును పట్టాలు ఎక్కనివ్వని రైల్వే! నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రైల్వే క్రాసింగ్‌లు అడ్డంకిగా మారాయి. కొన్ని ప్రాజెక్టుల రిజర్వాయర్లు, డ్యామ్‌లు, కాల్వల పనులు ముగిసినప్పటికీ.. రైల్వే శాఖ పరిధిలో చేయాల్సిన పనుల్లో జాప్యంతో సుమారు 2.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిందించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 11 ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి. అవి పూర్తయితేనే కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తవుతుంది. ఈ 60 పనుల్లో తెలంగాణ ఏర్పాటయ్యాక 26 పనులను రైల్వే శాఖ పూర్తిచేయగా.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 24 చోట్ల పనులను అసలు చేపట్టనే లేదు. ఇందులో దేవాదుల, ఎస్ఎల్బీసీ పరిధిలో 8 చొప్పున క్రాసింగ్‌లు, నెట్టెంపాడు పరిధిలో 16 చొప్పున క్రాసింగ్‌లు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైల్వే శాఖతో సంప్రదించింది. స్వయంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు కూడా చర్చించారు. అయినా రైల్వే శాఖ స్పందించడం లేదు. అటవీ అనుమతుల జాడ్యం సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన వాటిలో అటవీ భూముల అంశమే ప్రధానమైనది. రాష్ట్రంలో 8 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు సమస్యగా మారాయి. మిగతా ప్రాజెక్టులు, ఆయకట్టు కాల్వలకు కలిపి మొత్తంగా 15,672 ఎకరాలకు సంబంధించి అనుమతులు అవసరం. దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులు దాదాపు ఏడెనిమిదేళ్ల కిందే మొదలుపెట్టినా ఇంతవరకు అటవీ రాలేదు. చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్ సర్వే పూర్తికాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపక పోవడం, పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారుకాకపోవడం, పలుచోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమిని అంతకు ముం దే ఇతరులకు కేటాయించి ఉండడం వంటివి అటవీ అనుమతులకు సమస్యగా మారాయి. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగి అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. కొమ్రుం భీం ప్రాజెక్టు పరిధిలో అటవీ అనుమతుల జాప్యంతో వ్యయం రూ. 274 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగింది. రూ.9,427 కోట్లతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు వ్యయం రూ.13,445 కోట్లకు పెరిగింది. మొత్తంగా అటవీ భూముల అనుమతుల ప్రభావం రెండున్నర లక్షల ఎకరాలపై పడుతుండడం గమనార్హం. రోడ్డు కూడా అడ్డే.. ఇక ఆర్ అండ్ బీ రోడ్లు, జాతీయ రహదారుల కారణంగా కాల్వల నిర్మాణానికి ఇబ్బందులూ తీవ్రంగానే ఉన్నాయి. ఆయకట్టు కాల్వలకు అడ్డంగా ఉన్న రహదారులను పునర్నిర్మించేందుకు అవసరమైన నిధులను నీటి పారుదల శాఖ చెల్లిస్తున్నా.. శాఖల మధ్య సమన్వయంలోపించి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆర్అండ్బీ రోడ్ల కారణంగా ఏకంగా 5.24 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడుతోంది. ఇందులో ఎస్ఎల్బీసీ పరిధిలో 9, డిండిలో 29, దేవాదుల పరిధిలో 113 క్రాసింగ్ సమస్యలుండగా.. వాటిల్లో 63 పరిష్కారమయ్యాయి. ఇంకా 50 చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి 8 ప్రాజెక్టుల పరిధిలో 37 క్రాసింగ్‌లు ఉండగా.. ఇంకా 31 పనులు పూర్తి చేయాల్సి ఉంది. -
ఆయకట్టుకు రైల్వే ‘క్రాసింగ్’!
♦ 11 సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా రైల్వే పనులు ♦ జాప్యం చేస్తున్న సంబంధిత విభాగం ♦ 8.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంపై ప్రభావం ♦ పనులను వేగిరం చేయాలని రైల్వే జీఎంకు సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులకు రైల్వే క్రాసింగ్‌లు అడ్డుగా నిలుస్తున్నాయి. రిజర్వాయర్ లు, డ్యామ్‌లు, కాల్వల వంటి ప్రధాన పనులు ముగిసినా ఆయా ప్రాజెక్టుల పరిధిలో రైల్వేశాఖ చేయాల్సిన పనుల్లో జాప్యం జరుగుతుండటంతో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైల్వేశాఖతో సమీక్షలు నిర్వహించి విన్నవిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. గత ఏడాది జూలై నాటికే రాష్ట్రంలోని 8 ప్రాజెక్టుల పరిధిలో 30 రైల్వే క్రాసింగ్లకు సంబంధించిన పనులు జరగాల్సి ఉన్నా మెజారిటీ పనులను రైల్వేశాఖ చేయలేదు. దీంతో ఆ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టులో 2.15 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం 11 ప్రాజెక్టుల పరిధిలో 65 పనులను రైల్వేశాఖ పూర్తి చేయాల్సి ఉంది. ఇవి పూర్తయితేగానీ సాగు నీటి ప్రాజెక్టుల కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టే వీలులేదు. ఇందులో ఇప్పటివరకు కేవలం 8 పనులను రైల్వేశాఖ చేపట్టగా మరో 57 పనులను ఇంతవరకూ మొదలుపెట్టనేలేదు. రైల్వే చేపట్టాల్సిన పనుల్లో ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోనే 14 పనులు జరగాల్సి ఉండగా, భీమా ప్రాజెక్టు పరిధిలో 18 పనులు, వరద కాల్వ పరిధిలో రెండు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలో మరో రెండు పనులను పూర్తి చేయాల్సి ఉంది.వరంగల్‌లోని దేవాదుల, మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పరిధిలోనూ రైల్వే క్రాసింగ్లకు సంబంధించిన సమస్యలున్నాయి. రైల్వే పనుల్లో జాప్యం 8,24,479 ఎకరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం రైల్వే జీఎం రవీంద్ర గుప్తాకు లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు పూర్తయినా రైల్వే సంబంధిత పనులు పూర్తి కానందువల్ల నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నామని ఆయన దృష్టికి తెచ్చారు. పనులను పూర్తి చేసేందుకు ఇప్పటికే రూ. 68.51 కోట్లను రైల్వేశాఖకు జమ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని పనులను వేగిరం చేయాలని కోరారు. -
మోదీజీ మా కష్టాలను తీర్చండి..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి వార్తల్లో నిలిచాడు. కాన్పూర్‌లోని ఉన్నావ్‌కు చెందిన నయన్ సింగ్ పాఠశాలకు వెళుతున్న క్రమంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను తెలుపుతూ ఈ లేఖ రాశాడు. ఈ లేఖకు సంబంధిత అధికార వర్గాల నుంచి స్పందన రావడంతో ఒక్కసారిగా ఈ 11 ఏళ్ల బాలుడు సెలబ్రిటీగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే చంద్రశేఖర్ ఆజాద్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదవుకునే నయన్ తమ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ దగ్గర క్రాసింగ్ లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను ఏకరువు పెడుతూ ప్రధానికి లేఖ రాశాడు. తన తోటి విద్యార్థులు, సహా తాను చాలా కష్టాలు పడాల్సి వస్తోందని తెలిపాడు. చాలా దూరం నడిచి సుమారు రెండు కిలో మీటర్ల మేర చుట్టు తిరిగి స్కూలు కు వెళ్లాల్సి వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీనివల్ల చాలాసార్లు బడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలు వెళ్లాల్సి వస్తోందని, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మోదీకి మొరపెట్టుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో నయన్ రాసిన ఈ లేఖకు రెండు రోజుల క్రితం రైల్వే శాఖ డివిజనల్ ఇంజనీర్ నుండి స్పందన వచ్చింది. అయితే రైల్వే క్రాసింగ్ దగ్గర బ్రిడ్జి నిర్మించే అధికారం తమ పరిధిలో లేదని ఆయన వివరించారు. నిబంధనల ప్రకారం రైల్వే మంత్రిత్వశాఖ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. మరోవైపు రైల్వే అధికారుల నుంచి లేఖ రావడంతో ఆశ్చర్యపోవడం నయన్ కుటుంబ సభ్యులు వంతు అయ్యింది. తమ కొడుకు చూపిన చొరవ గురించి తెలుసుకొని తండ్రి అశుతోష్ సంతోషం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపడితే పిల్లలకే కాకుండా, వృద్ధులకు, మిగిలిన ప్రజలకు కూడా ఉపయోపగపడుతుందన్నారు. తాను ప్రధానికి ఉత్తరం రాసిన చాలా రోజులైందని నయన్ తెలిపాడు. అసలు ఆ ఉత్తరం గురించి తాను ఎప్పుడో మర్చిపోయానన్నాడు. అధికారుల నుంచి స్పందన అయితే వచ్చింది గానీ, ఇంతవరకు ఆ ఏరియాను ఏ అధికారి సందర్శించలేదని తెలిపాడు. మరి ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం దొ రుకుందా వేచి చూడాల్సిందే. -
పాసింజర్ రైలు అడ్డగింపు
లెవెల్ క్రాసింగ్ మూసివేతపై ఆందోళన వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ పల్లెవాడ (కైకలూరు) : రైల్వే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ రామవరం గ్రామస్తులు పాసింజర్ రైలును అడ్డుకున్నారు. గ్రామానికి చేరడానికి దగ్గర దారిగా ఉపయోగపడుతున్న పల్లెవాడ - రామవరం క్రాసింగ్‌ను రైల్వే అధికారులు మూసివేయడంపై ఆందోళన చేపట్టారు. గ్రామానికి చేరే పట్టాల వద్ద వాహనాలు వెళ్లకుండా ఇనుప గడ్డర్లు పాతిన విషయాన్ని తెలుసుకుని పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు వచ్చి పట్టాలపై కూర్చున్నారు. దీంతో గుడివాడ - నర్సాపూర్ (77204) పాసింజరు రైలు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న కైకలూరు తహశీల్దార్ కేఏ నారాయణరెడ్డి, భీమవరం రైల్వే ఎస్సై చింతయ్య అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. యాభయ్యేళ్లుగా ఇదే దారిలో గ్రామస్తులందరూ ప్రయాణిస్తున్నారని, కైకలూరు, ఏలూరు వంటి పట్టణాలకు చేరుకోవడానికి దగ్గర మార్గమని వారు వివరించారు. గ్రామానికి చేరుకోడానికి నేరుగా ఉన్న ఈ గేటును మూసివేసి పల్లెవాడ మలుపు వద్ద గేటును ఉంచడం అన్యాయమని చెప్పారు. ప్రజలు రాత్రి సమయంలో వచ్చేటప్పుడు ఆ రహదారిలో లైట్లు లేవని తెలిపారు. గేటు మూసివేత విషయం తెలియడంతో ముందుగానే రైల్వే అధికారులు, కలెక్టర్‌కు వినతిపత్రం అందించామన్నారు. ప్రజల అవసరాల రీత్యా అధికారులు వెంటనే రైలు పట్టాలకు అడ్డంగా నిర్మించిన స్తంభాలను తొలగించాలని వారు కోరారు. చివరకు రైల్వే పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. చేపల రైతులకు మేలు చేసేందుకే... పల్లెవాడ నుంచి రామవరానికి నేరుగా వచ్చే లెవెల్ క్రాసింగ్ దారిని మూసివేసి సమీపంలోని చేపల చెరువులకు వెళ్లే లెవెల్ క్రాసింగ్‌ను ఉంచడంపై రామవరం గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పల్లెవాడ మలుపు వద్ద నుంచి వెళ్లే రహదారిలో చేపల చెరువులు అధికంగా ఉన్నాయని, యజమానులు చేపల మేతలు తీసుకువెళ్లడానికి ఆ దారి అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు. -
రైల్వే క్రాసింగ్స్‌లు రక్తసిక్తం
న్యూఢిల్లీ: రక్షణలేని రైల్వేక్రాసింగ్‌లు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. రెప్పపాటులో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి క్రాసింగ్లను తొలగించడానికి సరైన విధానమేది లేకపోవడంతో రైల్వే అధికారులు కూడా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికితోడు సిబ్బంది లేని క్రాసింగ్‌ల వద్ద రాకపోకలు సాగించే ప్రజల అజాగ్రత్త, తొందరపాటు చర్యల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఘటనలో వాహన చోదకులు, చిన్నారులు, పశువులు, జంతువులు ఇలా ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైల్వే క్రాసింగ్‌లు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. నివారణకు ప్రభుత్వం, రైల్వే యంత్రాంగ ం తీసుకొంటున్న చర్యలు నామమాత్రమే..సంఘటనలు జరిగినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప ఎలాంటి ఫలితం ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా.. రక్షణ లేని రైలే ్వ క్రాసింగ్‌లన్నీ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయాయి. తాజా ఉత్తర ప్రదేశ్‌లోని మాహులో రక్షణ లేని క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో 5గురు కిండర్‌గార్డెన్ స్కూల్ విద్యార్థులు మృత్యువా త పడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఏడా 94 మంది చనిపోయా రు. ఇలా దేశంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు, ముందస్తు చర్యలు తీసుకోవడానికి రైల్వేశాఖ వద్ద సరైన యంత్రాంగం లేదు. దుర్ఘటనలకు అంతం లేకుండా పోయింది. మొత్తంగా 30, 348 క్రాసింగ్‌లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30,348 రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, ఇందులో 18,785 క్రాసింగిల్లో సిబ్బంది రక్షణగా ఉన్నారు. మిగతా 11,563 క్రాసింగ్లల్లో సిబ్బంది రక్షణ లేదని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తోంది. 40 శాతం అంటే..అత్యధిక రైల్వే ప్రమాదాలు చోటుచేసుకొంటున్న రక్షణ లేని క్రాసింగ్‌ల వద్దనే అని పలు నివేదికలు బట్టబయలు చేశాయి. తొలగించాలని సిఫార్సు రక్షణలేని రైల్వే క్రాసింగ్లను తొలగించాలని అనిల్ కాక్కోదర్ నేతృత్వంలో అత్యున్నస్థాయి భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది. ఈ లక్ష్యాన్ని 2017 వరకు సాధించడానికి ప్రతి రైల్వేజోన్‌లో ప్రత్యేక అవసరాల వాహనం(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అటమిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, అటమిక్ ఎనర్జీ విభాగం సెక్రటరీ, మాజీ ఢిల్లీ మెట్రో అధినేత ఈ శ్రీదరన్ ఈ కమిటీలో సభ్యులు. వీరంతా ఇంకా సూచనలను చేశారు. ఈ మేరకు గత ఐదే ళ్లుగా సుమారు 4,792 రైల్వే క్రాసింగ్లను తొలగించామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇదే క్రమంలో మిగతా క్రాసింగ్లను కూడా తొలగించి, ఆయా చోట్ల సబ్‌వేలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో రైల్వేజోన్లవారిగా రైలు ప్రమాదాల నివారణకు అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల సంఖ్య.. రక్షణలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద..2009-10లో 65 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. 2010-11లో -48, 2011-12లో-54, 2012-13లో -53, 2013-14లో 46 ప్రమాదాలు జరిగాయి. 2011-12 లెవల్‌క్రాసింగ్ వద్ద జరిగిన ఘటనల్లో 208 మంది, 2012-13లో124, 2013-14లో 95 మంది మృత్యువాతపడ్డారు. రైల్వే యాక్టు 1989 ప్రకారం.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఎవరైనా చనిపోయినా, గాయాలపాలైనా ఎలాంటి నష్టపరిహారం చెల్లించడానికి అనుమతించదు. అలాంటి నిబంధనలు ఏమీ లేవు. రక్షణ ఉన్న లేదా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరిగితే, బాధితులకు జాతీయ రవాణా విభాగమే నష్టపరిహారాలను చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రమాద బాధితులకు రూ. 1,39,28,047, 12,97,108లను ఈ ఏడాది నవంబర్ 20, 2014 వరకూ చెల్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణికులు రైల్వేశాఖ నిబంధనలను గౌరవించడం లేదని, ఫలితంగానే అత్యధికంగా రైల్వేక్రాసింగ్‌ల వద్ద చోటు చేసుకొంటున్నాయని పేర్కొన్నారు. -
రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్..
విశాఖపట్నం: గేట్లులేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద జరుగుతున్న ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మెదక్ జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదంలో చిన్నారుల మృతి అందర్నీ కలచివేసింది. అయితే విశాఖపట్నం ఉక్కునగరంలో నివసించే టీవీ మెకానిక్ సెంగుటువన్ మాత్రం ఈ ప్రమాదాలను చూస్తూ అయ్యోపాపం అని కూర్చోవాలనుకోలేదు. తన సృజనాత్మకతతో రైల్వే క్రాసింగ్ ప్రమాదాలకు రెడ్ సిగ్నల్ వేసే పరికరాన్ని కనిపెట్టాడు. అతితక్కువ ఖర్చయే ఈ పరికరం అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, ఇలాంటి పరికరం దేశంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ రూపొందించలేదని చెబుతున్నాడు. ఇక ఈ పరికరం పని తీరు ఎలా ఉంటుందంటే.. పూర్తిగా సోలార్ విద్యుత్ ఆధారంగా పనిచేసే ఈ పరికరానికి పసుపు, ఎరుపు ఎల్ఈడీ బల్బులను, వాటి కింద లూపర్ను అమర్చాలి. దానిపై రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్, బ్యాటరీ ఉంటుంది. ఈ పరికరాన్ని క్రాసింగ్‌కు ఇరువైపులా రోడ్డు పక్కన స్పీడ్ బ్రేకర్ వద్ద స్తంభానికి అమర్చాలి. ఇదేవిధంగా రైలు ఇంజిన్‌పై కూడా చిన్నసైజు సోలార్ ప్యానెల్, రేడియో ట్రాన్స్‌మీటర్‌ను బ్యాటరీతో పాటు అమర్చాలి. రైలు గేటుకు చేరడానికి మూడు నిమిషాల ముందు నుంచి ఎరుపు రంగు బల్బు వెలుగుతుంది. అప్పుడు ఆపరికరం నుంచి మొదలయ్యే హెచ్చరికలు రైలు వెళ్లిన నిమిషంన్నర వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత మరో రైలు వచ్చే వరకూ పసుపురంగు బల్బు వెలుగుతూ ఉంటుంది. 17 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి వైజాగ్‌లో స్థిరపడ్డ సెంగుటువన్ ఇంతకు ముందు గ్యాస్‌లీక్ సెన్సర్ కూడా కనుగొన్నాడు. -
ఇంకా ఆస్పత్రిలోనే...
కళ్లు తెరవని వరుణ్‌గౌడ్... నెమ్మదిగా తేరుకుంటున్న ప్రశాంత్... శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు. ప్రశాంత్(6) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరత్(6), నితిషా(7)లు నెమ్మదిగా కోలుకుంటున్నారు. మూసాయిపేట్ రైల్వేక్రాసింగ్ ఘటనలో 18 మంది మృతి చెందగా, 20 మంది క్షతగాత్రులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. వీరిలో వైష్ణవి, తరుణ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందగా, 14 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన నలుగురినీ ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్య నిపుణులు, 100 మంది పారా మెడికల్ స్టాఫ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. పది రోజులుగా అదే స్థితి... వెంకటాయపల్లికి చెందిన మల్లేష్, లత దంపతులకు రుచిత గౌడ్(8), వరుణ్ గౌడ్(7), శృతి గౌడ్(6) ముగ్గురు పిల్లలు. వీరందరినీ కాకతీయ టెక్నో స్కూల్లో చదివిస్తున్నారు. ఘటన జరిగిన రోజు శృతి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన రుచితగౌడ్, వరుణ్‌గౌడ్‌లను యశోద ఆస్పత్రికి తరలించారు. రుచిత పూర్తిగా కోలుకోవడంతో గురువారం వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. కుమారుడు వరుణ్‌గౌడ్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. మెదడు దెబ్బతింది. కుడి కాలర్ ఎముక విరిగింది. ఛాతి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో ఒత్తిడికి అవి దెబ్బతిన్నాయి. ఎడమ మోకాలి కార్టిలేజ్‌పై చర్మం అంతా ఊడిపోయింది. ఐదు రో జుల క్రితం ఆయనకు ప్లాస్లిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇప్పటి వరకు కళ్లు కూడా తెరువలేదు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. పూర్తిగా మందులే వినియోగిస్తున్నారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా పిల్లల్లాగే తన కుమారుడు వరుణ్‌గౌడ్ కూడా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అతని తల్లిదండ్రులు కనిపించిన దేవుడినల్లా ప్రార్థిస్తున్నారు. కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే తీపి కబురు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ మెదడు చుట్టూ నీరు... వెంకటాయపల్లికి చెందిన స్వామి, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రశాంత్(6) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరణ్‌గౌడ్‌తో పోలిస్తే ఇతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. పుర్రె ఎముక విరిగి మెదడుకు ఆనుకుంది. తలపై చర్మం ఊడిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తొడ భాగంలోని కొంత చర్మాన్ని తీసి తలపై అమర్చారు. మెదడు చుట్టూ నీరు చేరుతుండటంతో మూడు రోజుల క్రితం సర్జరీ చేసి, నీటిని బయటికి తీసేశారు. ముఖంపై గాయాలు ఇంకా మాన లేదు. ఎడమ చేయి విరగడంతో శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. సహజ పద్ధతిలో ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిట్స్ రావడంతో వైద్యుల పరిశీలనలో ఉంచారు. మరోసారి ఫిట్స్ వస్తే...మళ్లీ వెంటిలేటర్ అమర్చాల్సి ఉంటుందని ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ బి.జె.రాజేశ్ తెలిపారు. -
యమపురికి ద్వారాలు
సాక్షి, సంగారెడ్డి: కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు యమపురికి ద్వా రాలుగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలం మాసాయిపేట ప్రమాద ఘటనే ఇందుకు తార్కాణం. మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద నాందేడ్ ప్యాసింజర్ రైలు తూప్రాన్‌కు చెందిన కాకతీయ టెక్నోస్కూల్ బస్సును ఢీకొట్టడంతో 16 మంది మృతి చెం దిన విషయం తెలిసిందే. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా చరిత్రలోనే మాసాయిపేట ఘటన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకోవచ్చు. రైల్వే శాఖ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే గురువారం నాటి ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. తాజా ప్రమాదంతో జిల్లాలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జహీరాబాద్, మెదక్, గజ్వేల్, పటాన్చెరు నియోజకవర్గాల గుండా మొత్తం 82 కిలోమీటర్లకుపైగా రైలుమార్గం ఉంది. 30 రైల్వే క్రాసింగ్లకుగాను 13 చోట్ల కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లున్నాయి. కాపలాలేని 13 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే శాఖ సత్వరం భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాపలాలేని రైల్వే క్రాసింగ్స్ ఇవీ .. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 12 రైల్వే క్రాసింగ్స్ ఉండగా వీటిలో ఐదుచోట్ల కాపలా లేరు. కోహీర్-పైడిగుమ్మల్ గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపాలా లేని రైల్వే గేటు ఉంది. జహీరాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. న్యాల్కల్ మండలంలో మామిడ్గి-బసంత్‌పూర్ వెళ్లే రోడ్డుకు రాష్ట్ర సరిహద్దులో గల రాజోలా వద్ద కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. న్యాల్కల్ మండలం గంగ్వార్ నుంచి కర్ణాటక వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉండగా ఇటీవల మూసివేశారు. కోహీర్ నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డుకు కాపలాలేని లెవెల్ క్రాసింగ్ ఉంది. దీనిని రైల్వే శాఖ మూసివేసేందుకు రెండేళ్ల క్రితం ప్రతిపాదించింది. ప్రజల ఆందోళనలతో వాయిదా వేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 18 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా మొత్తం 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలా లేవు. మాసాయిపేట, కూచారం తండా, లింగారెడ్డిపేట, పడాలపల్లి రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం మాసాయి రైల్వేక్రాసింగ్ వద్ద రైల్వేశాఖ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టింది. మెదక్ నియోజకవర్గంలో 14 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఉండగా 8 రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగుచోట్ల కాపలా లేదు. శేరిపల్లి-మిర్జాపల్లి గ్రామాల మధ్యన రైల్వే క్రాసింగ్, కామారం తండా-కామారం రైల్వే క్రాసింగ్, కామారం తండా-చిన్నశంకరంపేట రైల్వేక్రాసింగ్, పోలంపల్లి వద్ద రైల్వేక్రాసింగ్ వద్ద కాపలాలేవు. వాహనదారుల నిర్లక్ష్యం తోడవుతోంది... రైల్వేశాఖ నిర్లక్ష్యానికితోడు వాహనదారులు నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వేక్రాసింగ్స్ వద్ద వాహనదారులు, రోడ్డుదాటే పాదచారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న సందర్బాలున్నాయి. రైలు వచ్చేలోగా పట్టాలు దాటేయవచ్చన్న ధీమాతో వాహనదారులు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనికితోడు వాహనదారులు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో సంభాషించటం ప్రమాదాలకు కారణమవుతోంది. రైలు డ్రైవర్లు రైల్వేక్రాసింగ్‌ల వద్ద హారన్ మోగించకపోవటం, కొన్నిచోట్ల రైళ్లు క్రాసింగ్‌వద్ద కానరాకపోవటం ప్రమాదాలకు దారితీస్తోంది. -
మృత్యు దారులు
పదేళ్లుగా ఇంతే..! విజయనగరం కంటోన్మెంట్/టౌన్: విజయనగరం డివిజన్ పరిధిలో సుమా రు 15 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒక లైన్లో నెల్లిమర్ల, చీపురుపల్లి, గరివిడి, పొందూరు, మరోలైన్‌లో కోరుకొండ, అలమండ, కంటకాప ల్లి, పెందుర్తి, కొత్తవలస, గొట్లాం, గజపతినగరం, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, బెల గాం, పార్వతీపురం మీదుగా రైళ్ల రాకపోకలకు విజయనగరం ప్రధాన జంక్షన్‌గా ఉంది. ఈ మార్గంలో ప్రతి రోజూ సుమారు 100 గూడ్స్, ప్రయాణికుల రైళ్లు రాకపోకలు చేస్తుంటా యి. ఈ రీజియన్ పరిధిలో 50కి పైగానే నాన్మెన్ లెవెల్ క్రాసిం గ్లున్నాయి. వీటికి సంబంధిం చి ఎక్కడా హెచ్చరిక బోర్డులు కాని, సూచికలు గాని లేవు. విజయనగరంలో వీటీ అగ్రహా రం, బీసీ కాలనీల్లోకి వెళ్లాలంటే రైల్వే ట్రాకు దాటుకుని వెళ్లాలి. ఇక్కడ పదేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నా.. పాలకు లు పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఇక్కడ 800 మందికిపైగా మృతి చెందారు. టన్నెల్స్ నిర్మాణాలతోనే పరిష్కారం! సాధారణంగా అన్‌మేన్డ్ లెవెల్ క్రాసింగ్లున్న చోట రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది.అయితే ఇక్కడ బ్రిడ్జిలు నిర్మిం చాలంటే భారీ వ్యయంతో కూడి న పని. ఈ నేపథ్యంలో భూగర్భం లోంచి వెళ్లేలా కాంక్రీటు టన్నెల్ నిర్మాణాలు (క్యూబ్స్)చేపడితే ప్రయోజనాలు కనిపి స్తాయి. పలు ప్రాంతాల్లో వీటిని నిర్మాణాలు చేస్తున్నప్పటికీ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. (లేకపోతే ఈ నిర్మాణాలు వృథావుతాయి). జిల్లాలో డొం కినవలస రైల్వేస్టేషన్లో ఈ తరహా నిర్మాణాన్ని రెండేళ్ల క్రితం చేపట్టినప్పటికీ దీని వినియోగం లేక లక్షలాది రూపాయలు వృథాఅయ్యాయి. లెవెల్ క్రాసింగ్ అంటే ... లెవెల్ క్రాసింగ్ లో మేన్డ్, అన్‌మేన్డ్ రెం డు రకాలుంటాయి. ఇందులో కొన్ని స్టేషన్‌మాస్టర్ కంట్రోల్‌తో ఉన్న ఆటోమేటిక్ సిస్టమ్‌తోనూ, మరి కొన్ని సిగ్నల్ సమాచారం ద్వారా అప్రమత్తమయ్యే విధానంలో పని చేస్తాయి. ఈ రెం డూ లేని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా యి. సిగ్నల్స్‌తో సంబంధం ఉన్న రైళ్ల రాకపోకలకు టెలిఫోన్ ద్వారా సమాచారమందిస్తారు. దీనికి సంబంధించి ముందు స్టేషన్‌మాస్టర్ కోడ్ పాస్ చేస్తారు. కోడ్ పాసైన వెంటనే సిగ్నల్ వేయడం... అదే సమయంలో గేటు పడడం జరుగుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చాక ముం దు స్టేషన్ నుంచి నేరుగా మానిటర్‌లోనే రైల్ వస్తున్న స మాచారం తెలుస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా కేబిన్‌లోనే లాక్ పడి గేటు వేస్తారు. ఇక్కడి నుంచి రె ల్ బయలు దేరిన వెంటనే మానిటర్లో అన్‌లాక్ సిగ్నల్ కనిపిస్తుంది. వెంటనే సిబ్బంది గేటు ఎత్తేస్తారు. ప్రాణాలు హరిస్తున్న రైల్వే క్రాసింగ్‌లు బొబ్బిలి/ రూరల్: బొబ్బిలి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న గున్నతోటవలస రైల్వే క్రాసింగ్ వద్ద గేటు లేదు. ఏడాది కిందట ఇక్కడ ఆటోను రైలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడేదుర్మరణం పాలయ్యారు. బాడంగి మండలానికి చెందిన ఓ ద్విచక్ర వాహనచోదకుడు రైలు ఢీకొని ఛిద్రం అయ్యారు. ఈ ఏడాదిలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినా.. అధికారు లు మాత్రం గేటు ఏర్పాటుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.బొబ్బిలి పట్టణంలో డబుల్ రైలు గేటు వల్ల ఏదైనా ఇబ్బందులుంటే వాహనచోదకులు ఇలాగే ప్రయాణం సాగించి ఇటు విశాఖ రోడ్డుకు, అటు బొబ్బిలి పట్టణానికి చేరుకుంటా రు. పట్టణంలో రాస్తారోకోలు, ఆందోళనలు జరిగి ట్రాఫిక్ నిలిచిపోయినా.. వాహనాల రాకపోకలకు ఇదే ప్రత్యామ్నాయ రహదారి. అయితే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన అధికారులు రెండేళ్ల క్రితం ఇక్కడ గేటు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికీ ఈ పనులు కొనసాగుతూ...నే ఉన్నాయి. బాడంగి రైల్వేస్టేషన్ ముందు డొంకినవలస వెళ్లడానికి ముందు కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగే ఉంది. అక్కడ గేటు, కాపలాదారు లేకపోవడంతో రెండేళ్ల కిందట ఏకంగా గ్యాస్ సిలిండర్ల లారీనే రైలు ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు అవి పేలకుండా చెరువులో పడి పోయాయి. లేకపోతే పెనుప్రమాదమే జరిగేది. ఇక బొబ్బిలి-సీతానగరం రైల్వే గేట్లు మధ్య ఆర్. వెంకంపేట గ్రామ సమీపంలో కూడా ఇటువంటి క్రాసింగులు రెం డు ఉన్నాయి. వాటి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థాని కులు భయూందోళన చెందుతున్నారు. బొబ్బిలి నుంచి సాలూరు వెళ్లే రైల్బస్సు మార్గంలో కూడా ఎక్కడా రైల్వే గేట్లు లే వు. ఈ మార్గంలో బొబ్బిలి, సాలూరు, రామభద్రపురం మండలాలు ఉన్నాయి. వ్యవసాయూనికి దారులు, విద్యార్థులు, పలు గ్రామాల ప్రజ లు నిత్యం పట్టాలు దాటి రాకపోకలు చేస్తుం టారు. అయితే ఈ మార్గంలో ఎక్కడా గేట్లు ఏ ర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందో తెలియని పరిస్థితి నెల కొంది. అలాగే బొబ్బిలి మండలంలోని నారాయణప్పవలస, కాశిందొరవలస గ్రామాల్లోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -
మృత్యు మార్గాలు.. రైల్వే క్రాసింగ్‌లు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్‌ను రైలు ఢీకొన్న ఘటనతో ‘పశ్చిమ’ ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాపాలాదారు లేని రైల్వే క్రాసింగ్‌లు జిల్లాలోనూ అనేకం ఉన్నాయి. నిత్యం వందలాది వాహనాలు, ప్రయాణికులు వీటిని బిక్కుబిక్కుమంటూ దాటుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. భీమవరం :జిల్లాలో కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లు మృత్యుపాశాలుగా మారాయి. ఈ క్రాసింగ్‌ల వద్ద ఇప్పటి వరకు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా రైల్వే అధికారులు, ప్రభుత్వం గేట్లు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపడం లేదు. గురువారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన ఘటనతో కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైల్వే శాఖ అనుమతితో గేట్లు ఏర్పాటు లేకపోయినా పక్కా రోడ్లు రైల్వే ట్రాక్‌ల మీదుగా నిర్మించడంతో నిత్యం వీటి గుండా వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. భీమవరం రైల్వే పోలీస్ సర్కిల్ పరిధిలో గేట్లు లేని రైల్వే క్రాసింగ్‌లు అధికంగా ఉన్నాయి. భీమవరం మండలం నర్సింహపురం సమీపంలో రైల్వేగేటు లేకపోయినా గ్రామం నుంచి పట్టణాన్ని కలుపుతూ రైల్వేట్రాక్‌పై నుంచి పక్కా రోడ్డు ఏర్పాటు చేయడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక మట్టి ట్రాక్టరును రైలు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఇదే రోడ్డులో రైలు వస్తున్నట్లు గుర్తించని ఒక మోటార్ సైక్లిస్ట్ పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. అదేవిధంగా ఉండి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాముల వెనుక గేటు లేని రోడ్డు మార్గం ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉండి మండలం వాండ్రం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న రోడ్డుకు గేటు లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పాలకొల్లు, రూరల్ మండలంలో సగంచెరువు, మైదాడగుంట, జొన్నలగరువు వీరవాసరం మండలం నందమూరుగరువు, పాలకోడేరు మండలం వేండ్ర-కుముదవల్లి గ్రామాల మధ్యలో ఒక రోడ్డులో, అదేవిధంగా గొరగనమూడి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజ్‌కి వేళ్లే దారిలో రైల్వే గేటు లేకపోవడంతో కళాశాల యాజమాన్యమే ఒక ప్రైవేట్ గేట్ మెన్‌ను ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విధంగా నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రైల్వే ట్రాక్‌లు దాటుతున్నారు. ఈ క్రాసింగ్‌ల వద్ద రైల్వే గేటులను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. -
కాపలా లేని క్రాసింగ్‌లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా రైల్వే గేట్ల (క్రాసింగ్) వద్ద కాపలా పెట్టకపోవడం రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేక పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన సంఘటనతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. మండలంలోని డబిల్పూర్ గ్రామ సమీపంలోని కోనాయిపల్లి శివారులో రైల్వే క్రాసింగ్ ఉన్నా అక్కడ కాపలా ఏర్పాటు చేయలేదు. నిత్యం ఈ ప్రాంతం మీదుగా నూతన్‌కల్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రాసింగ్ వద్ద వెంటనే గేట్ ఏర్పాటు చేసి కాపలాదారులను నియమించాలని కోరుతున్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటడానికి ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ప్రమాదకరంగా పట్టాల మీద నుంచి దాటుతున్నారు. ప్రయాణికులతో పాటు సమీప కాలనీ ప్రజలు, జాతీయ రహదారిపై నుంచి కాలి నడకన వచ్చే వారు పట్టాలు దాటి గ్రామానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు. గేట్లు లేక పొంచి ఉన్న ముప్పు తాండూరు రూరల్: తాండూరు రైల్వే స్టేషన్ నుంచి వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే రైల్వే మార్గంలో క్రాసింగ్‌ల వద్ద గేట్లు లేక ప్రమాదం పొంచి ఉంది. తాండూరు మండలం చెన్‌గేస్‌పూర్, ఎల్మకన్నె గ్రామానికి వెళ్లే దారిలో చెన్‌గేస్‌పూర్ శివారు క్రాసింగ్ వద్ద రైల్వే గేటు లేదు. ఆ రైల్వే మార్గం నుంచి విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి సిమెంట్ కోసం గూడ్స్ రైళ్లు వెళ్తుంటాయి. నెలకు నాలుగు సార్లు విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ ఉత్పత్తుల కోసంగూడ్స్ రైళ్లు వస్తుంటాయి. గేటు లేకపోవడంతో ఏక్షణాన గూడ్స్ రైలు వస్తుందో తెలియక ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చంద్రవంచ దర్గా-కరన్‌కోట్ వెళ్లే మార్గంలోని కూడా ఇదే పరిస్థితి. ఈ మార్గంలో కరన్‌కోట్, ఓగిపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాపలాదారుడు లేక.. నవాబుపేట: కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని గొల్ల గూడ, మమ్మదాన్‌పల్లి, గేట్‌వనంపల్లి, కడ్చర్ల గ్రామాల వద్ద ైరె ల్వే గేట్లు ఉన్నాయి. వీటిలో గొల్లగూడ రైల్వే గేటు వద్ద కాపలాదారు లేక ఎప్పుడూ గేట్ వేసి ఉంటుంది. వాహనదారులు వెళ్లి గేట్ తీయాలని స్టేషన్ మాస్టర్‌ను అడిగితే వచ్చి గేటు తీసి వాహనాలు వెళ్లగానే మళ్లీ మూసివేస్తారు. ఇక్కడి నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు మూసి ఉన్నప్పటికీ ప్రమాదమని తెలిసినా బైక్‌లపై వెళ్లేవారు గేటు కింది నుంచి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గేటు వద్ద కాపలా దారున్ని నియమించాలని కోరుతున్నారు. మూగజీవాల మృత్యువాత మర్పల్లి: కాపలాలేని గేట్లతో వాహనదారులు, దారిన వెళ్లే ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. మండల పరిధిలోని కొత్లాపూర్ నుంచి కోటమర్పల్లి వెళ్లే దారిలో రైల్వే గేటు నుంచి నిత్యం వందలాది మంది రైతులు తమ పశువులను తోలుకుంటూ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. కోటమర్పల్లి గ్రామానికి వెళ్లే వాహనదారులు ఈ గేటు నుంచే వెళ్తారు. గేటు వద్ద కాపలాదారు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రైళ్లు ఢీకొని కొత్లాపూర్ గ్రామానికి చెందిన కావలి నర్సింలువి మూడు ఎడ్లు, బుర్రకాయల నర్సింలుకు చెందిన రెండు ఎద్దులు, గొల్ల లక్ష్మయ్యకు చెందిన మరో ఎద్దు మృత్యువాత పడ్డా యి. మర్పల్లి నుంచి కోహీర్ వైపు వెళ్లే రైల్వే లైన్లో సిగ్నల్ వద్ద గేటు నుంచి కూడా వందలాది మంది రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఇక్కడ రైలు ఢీకొని ఓ గేదె మృత్యువాత పడింది. కాపలావారు ఉం డక పోవటంతో ఈ గేటు నుంచి ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. -
లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం: మంత్రి మృతి
కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ను దాటుతూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యూపీలోని జౌన్పూర్ జిల్లాలో జరిగింది. మంత్రి సతాయిరామ్ ప్రయాణిస్తున్న వాహనం లెవెల్ క్రాసింగ్‌ను దాటుతున్నప్పుడు అవతలి నుంచి రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దాంతో మంత్రితో పాటు ఆయన వాహన డ్రైవర్, వాహనంలో ఉన్న మరో సిబ్బంది కూడా అక్కడికక్కడే మరణించారు. కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గడిచిన మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికి 200 మందికి పైగా మరణించారు. దేశం మొత్తమ్మీద దాదాపు 12,500 కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటివద్ద తరచు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.