ఆయకట్టుకు రైల్వే ‘క్రాసింగ్’!
♦ 11 సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా రైల్వే పనులు
♦ జాప్యం చేస్తున్న సంబంధిత విభాగం
♦ 8.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంపై ప్రభావం
♦ పనులను వేగిరం చేయాలని రైల్వే జీఎంకు సీఎస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులకు రైల్వే క్రాసింగ్‌లు అడ్డుగా నిలుస్తున్నాయి. రిజర్వాయర్ లు, డ్యామ్‌లు, కాల్వల వంటి ప్రధాన పనులు ముగిసినా ఆయా ప్రాజెక్టుల పరిధిలో రైల్వేశాఖ చేయాల్సిన పనుల్లో జాప్యం జరుగుతుండటంతో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వలేని పరిస్థితి తలెత్తుతోంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైల్వేశాఖతో సమీక్షలు నిర్వహించి విన్నవిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు.
గత ఏడాది జూలై నాటికే రాష్ట్రంలోని 8 ప్రాజెక్టుల పరిధిలో 30 రైల్వే క్రాసింగ్‌లకు సంబంధించిన పనులు జరగాల్సి ఉన్నా మెజారిటీ పనులను రైల్వేశాఖ చేయలేదు. దీంతో ఆ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టులో 2.15 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం 11 ప్రాజెక్టుల పరిధిలో 65 పనులను రైల్వేశాఖ పూర్తి చేయాల్సి ఉంది. ఇవి పూర్తయితేగానీ సాగు నీటి ప్రాజెక్టుల కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టే వీలులేదు.
ఇందులో ఇప్పటివరకు కేవలం 8 పనులను రైల్వేశాఖ చేపట్టగా మరో 57 పనులను ఇంతవరకూ మొదలుపెట్టనేలేదు. రైల్వే చేపట్టాల్సిన పనుల్లో ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోనే 14 పనులు జరగాల్సి ఉండగా, భీమా ప్రాజెక్టు పరిధిలో 18 పనులు, వరద కాల్వ పరిధిలో రెండు, ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలో మరో రెండు పనులను పూర్తి చేయాల్సి ఉంది.వరంగల్‌లోని దేవాదుల, మహబూబ్‌నగర్‌లోని నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పరిధిలోనూ రైల్వే క్రాసింగ్‌లకు సంబంధించిన సమస్యలున్నాయి. రైల్వే పనుల్లో జాప్యం 8,24,479 ఎకరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం రైల్వే జీఎం రవీంద్ర గుప్తాకు లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధాన పనులు పూర్తయినా రైల్వే సంబంధిత పనులు పూర్తి కానందువల్ల నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నామని ఆయన దృష్టికి తెచ్చారు. పనులను పూర్తి చేసేందుకు ఇప్పటికే రూ. 68.51 కోట్లను రైల్వేశాఖకు జమ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని పనులను వేగిరం చేయాలని కోరారు.