రైళ్లకు ముప్పు ఇక్కడే!
♦ వరదొస్తే ట్రాక్‌ను దెబ్బతీసే 870 చెరువులను
♦ గుర్తించిన నీటి పారుదల శాఖ
♦ రైల్వేతో సంయుక్తంగా తనిఖీ.. చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక
♦ నేడు సమన్వయ భేటీ.. కార్యాచరణపై చర్చ
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా ఏర్పడే నీటి ప్రవాహాల ధాటికి రైళ్లకు ప్రమాదం వాటిల్లకుండా చిన్న నీటి పారుదల శాఖ చర్యలకు ఉపక్రమించింది. రైల్వే శాఖతో సమన్వయం చేసుకుని భద్రతా కార్యాచరణను మొదలుపెట్టింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక్కసారిగా వచ్చిపడే వరద నీరు.. రైల్వే ట్రాకుల కింది మట్టికట్టలను ధ్వంసం చేయడంతో రైలు ప్రమాదాలకు ఆస్కారమిస్తుంది. గతంలో 115 మంది మరణించిన ‘వలిగొండ ప్రమాదం’ జరిగింది ఇలాంటి కారణంతోనే. అయితే ఇటీవల రైల్వే-నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం దెబ్బతినడంతో అలాంటి ప్రమాదాలకు మళ్లీ అవకాశమేర్పడింది. ఇటీవలి వానలకు నల్లగొండ జిల్లాలో డెల్టా ఎక్స్‌ప్రెస్ త్రుటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనలో రైల్వే-నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం దెబ్బతిన్న తీరుపై ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో చిన్న నీటిపారుదల శాఖ స్పందించింది. రైల్వేతో సమన్వయాన్ని పునరుద్ధరించి రైళ్లకు ప్రమా దం వాటిల్లకుండా చర్యలకు సిద్ధమైంది.
870 చెరువుల గుర్తింపు
భారీ వర్షాలు కురిస్తే 870 చెరువుల వల్ల రైల్వే ట్రాకులకు ముప్పు పొంచి ఉందని చిన్న నీటి పారుదల శాఖ గుర్తించింది. గతంలో రైల్వే ట్రాక్‌కు 14 కిలోమీటర్ల పరిధిలోని చెరువులను ప్రమాదకరమైనవిగా పేర్కొనేవారు. ఆ లెక్కన 360 చెరువులను గుర్తించారు. ఇక చెరువుల పరీవాహకం, వరద కాలువలను గమనంలో ఉంచుకుని రైల్వేట్రాక్‌కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాటినీ పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ప్రమాదకరమైన చెరువుల సంఖ్య 870కి పెరిగింది. అందులో వరంగల్ జిల్లా పరిధిలో అత్యధికంగా 218 చెరువులున్నాయి. ఇక 380 గొలుసుకట్టు చెరువుల్లో ఉన్న గండ్లు, తొందరగా నిండి అలుగు పారే పరిస్థితి ఉన్న వాటిని రైల్వే-నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశారు. మరో 490 చెరువుల వద్ద సర్వే చేయాల్సి ఉంది. మరమ్మతులు, తదుపరి సర్వే, ఇతర ప్రణాళికలను సిద్ధం చేసేందుకు బుధవారం రైల్వే-చిన్న నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం జరగనుంది.
ఇక నిరంతర సమాచారం
భారీ వర్షాలు కురిసిన ప్పుడు రైల్వే ట్రాకులకు చేరువగా ఉన్న చెరువులు, వాగులు, నదుల పరిస్థితిని నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను ఉన్నఫళంగా రైల్వేకు చేరవేయాలి. ఒక్కోసారి అర్ధరాత్రి సమయాల్లో కూడా భారీ వర్షం కురిసి వరద వచ్చి పడుతుంది. ఆ వివరాలను కూడా అధికారులు సమీకరించాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో వరద వస్తే.. ఎక్కడెక్కడ రైల్వే ట్రాక్‌కు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుందో రైల్వే సిబ్బందికి అవగాహన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు హెచ్చరికలు రాగానే ఆయా ప్రాంతాలకు గ్యాంగ్‌మెన్ చేరుకుని నిరంతరం ట్రాక్‌ను తనిఖీ చేస్తారు. ఇప్పుడు దెబ్బతిన్న సమన్వయం ఇదే. దీన్ని మళ్లీ పునరుద్ధరించే దిశగా బుధవారం చర్చించనున్నారు.