మేడ్చల్/ మేడ్చల్ రూరల్: ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా రైల్వే గేట్‌ల (క్రాసింగ్) వద్ద కాపలా పెట్టకపోవడం రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేక పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన సంఘటనతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. మండలంలోని డబిల్‌పూర్ గ్రామ సమీపంలోని కోనాయిపల్లి శివారులో రైల్వే క్రాసింగ్ ఉన్నా అక్కడ కాపలా ఏర్పాటు చేయలేదు. నిత్యం ఈ ప్రాంతం మీదుగా నూతన్‌కల్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రాసింగ్ వద్ద వెంటనే గేట్ ఏర్పాటు చేసి కాపలాదారులను నియమించాలని కోరుతున్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటడానికి ఫుట్‌ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ప్రమాదకరంగా పట్టాల మీద నుంచి దాటుతున్నారు. ప్రయాణికులతో పాటు సమీప కాలనీ ప్రజలు, జాతీయ రహదారిపై నుంచి కాలి నడకన వచ్చే వారు పట్టాలు దాటి గ్రామానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు.
గేట్లు లేక పొంచి ఉన్న ముప్పు
తాండూరు రూరల్: తాండూరు రైల్వే స్టేషన్ నుంచి వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే రైల్వే మార్గంలో క్రాసింగ్‌ల వద్ద గేట్లు లేక ప్రమాదం పొంచి ఉంది. తాండూరు మండలం చెన్‌గేస్‌పూర్, ఎల్మకన్నె గ్రామానికి వెళ్లే దారిలో చెన్‌గేస్‌పూర్ శివారు క్రాసింగ్ వద్ద రైల్వే గేటు లేదు. ఆ రైల్వే మార్గం నుంచి విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి సిమెంట్ కోసం గూడ్స్ రైళ్లు వెళ్తుంటాయి. నెలకు నాలుగు సార్లు విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ ఉత్పత్తుల కోసంగూడ్స్ రైళ్లు వస్తుంటాయి.
గేటు లేకపోవడంతో ఏక్షణాన గూడ్స్ రైలు వస్తుందో తెలియక ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చంద్రవంచ దర్గా-కరన్‌కోట్ వెళ్లే మార్గంలోని కూడా ఇదే పరిస్థితి. ఈ మార్గంలో కరన్‌కోట్, ఓగిపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాపలాదారుడు లేక..
నవాబుపేట: కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని గొల్ల గూడ, మమ్మదాన్‌పల్లి, గేట్‌వనంపల్లి, కడ్చర్ల గ్రామాల వద్ద ైరె ల్వే గేట్లు ఉన్నాయి. వీటిలో గొల్లగూడ రైల్వే గేటు వద్ద కాపలాదారు లేక ఎప్పుడూ గేట్ వేసి ఉంటుంది. వాహనదారులు వెళ్లి గేట్ తీయాలని స్టేషన్ మాస్టర్‌ను అడిగితే వచ్చి గేటు తీసి వాహనాలు వెళ్లగానే మళ్లీ మూసివేస్తారు. ఇక్కడి నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు మూసి ఉన్నప్పటికీ ప్రమాదమని తెలిసినా బైక్‌లపై వెళ్లేవారు గేటు కింది నుంచి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గేటు వద్ద కాపలా దారున్ని నియమించాలని కోరుతున్నారు.
మూగజీవాల మృత్యువాత
మర్పల్లి: కాపలాలేని గేట్లతో వాహనదారులు, దారిన వెళ్లే ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. మండల పరిధిలోని కొత్లాపూర్ నుంచి కోటమర్పల్లి వెళ్లే దారిలో రైల్వే గేటు నుంచి నిత్యం వందలాది మంది రైతులు తమ పశువులను తోలుకుంటూ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. కోటమర్పల్లి గ్రామానికి వెళ్లే వాహనదారులు ఈ గేటు నుంచే వెళ్తారు. గేటు వద్ద కాపలాదారు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
గతంలో రైళ్లు ఢీకొని కొత్లాపూర్ గ్రామానికి చెందిన కావలి నర్సింలువి మూడు ఎడ్లు, బుర్రకాయల నర్సింలుకు చెందిన రెండు ఎద్దులు, గొల్ల లక్ష్మయ్యకు చెందిన మరో ఎద్దు మృత్యువాత పడ్డా యి. మర్పల్లి నుంచి కోహీర్ వైపు వెళ్లే రైల్వే లైన్‌లో సిగ్నల్ వద్ద గేటు నుంచి కూడా వందలాది మంది రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఇక్కడ రైలు ఢీకొని ఓ గేదె మృత్యువాత పడింది. కాపలావారు ఉం డక పోవటంతో ఈ గేటు నుంచి ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.
కాపలా లేని క్రాసింగ్‌లు
Published Fri, Jul 25 2014 12:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement