railway gate
-
వెనుక రైలు..ముందు గేట్...తగ్గేదేలే
-
కరీంనగర్: రైల్వే గేట్ పడటంతో ఆగిపోయిన అంబులెన్స్.. వ్యక్తి మృతి
-
Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు..
సాక్షి, కరీంనగర్: కూతురు గురుకులం విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్‌డే నిర్వహించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును చూసేందుకు ఆ తండ్రి విద్యాలయానికి వచ్చాడు. ఇంటినుంచి తీసుకెళ్లిన ప్రత్యేకమైన వంటకాలు కూతురుకు తినిపించాడు. అంతలోనే విధి వక్రీకరించిందేమో.. ఆ తండ్రి గుండెపోటుతో అల్లాడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని కరీంనగర్ తరలించారు. అక్కడ మరోసారి విధి అతడిని చిన్నచూపు చూసింది. అప్పుడే కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు పడింది. సుమారు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్, సుధీవన కూతురు స్పందన పదో తరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్ డే నిర్వహించారు. దీంతో విజయ్, సుధీవన దంపతులు ఉదయమే కూతురు కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకుని విద్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం కూతురుతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో వర్షం రావడంతో ప్రిన్సిపాల్ గిరిజ తల్లిదండ్రులందరరినీ హాల్లోకి రావాలని సూచించారు. హాల్లోకి వచ్చి విజయ్ కూర్చుంటున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం, విజయ్ భార్య సుధీవన చికిత్స కోసం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ వద్ద ఉన్న రైల్వేగేట్ అప్పుడే పడటంతో సుమారు 15 నిమిషాలపాటు విజయ్ అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడాడు. తీరా ఆసుపత్రిలో చేర్చాక.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్లో గేట్ పడకుంటే విజయ్ బతికేవాడని మల్లేశం తెలిపారు. మృతదేహం వద్ద కూతురు స్పందన రోదించిన తీరు కలచివేసింది. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది. కాగా కరీంనగర్ వద్ద రైల్వే గేటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బ్రిడ్జ్ నిర్మించాలని గత తొమ్మిదేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతోపాటు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో కరీంనగర్ తీసుకు వచ్చినా గేటుతో ఇబ్బందులు పడ్డ సందర్భారాలున్నాయి. అంబులెన్స్‌లో తీసుకు వచ్చిన రోగులు గంటల కొద్ది గేటు పడడంతో గతంలో పలువురు రోగులు మరణించిన సందర్భాలు ఉన్నాయి, తాజాగా ఆర్వోబీ నిర్మాణం చేపట్టకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఆంబులెన్స్ దృశ్యాల్ని మొబైల్ కొంతమంది చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కదిరి కుట్టాగల రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్ డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
-
గేటు పడింది.. గుండె ఆగింది
షాద్‌నగర్ రూరల్: రైల్వేగేటు పడటంతో సకాలంలో ఆస్పత్రికి తరలించలేక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం (33)కు శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌కు తీసుకొస్తుండగా.. మార్గమధ్యలో చటాన్‌పల్లి వద్ద రైల్వే గేటు పడటంతో వారి వాహనం ఆగిపోయింది. దీంతో వారు షాద్‌నగర్ శివారు బైపాస్ నుంచి అన్నారం వై జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి షాద్‌నగర్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరు కునేలోపే శ్రీశైలం మృతి చెందాడు. రైల్వే గేటు ప్రాణం తీసిందంటూ వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరొకరికి ప్రాణనష్టం జరగకముందే రైల్వేగేట్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మాకొక అండర్ పాస్ కావాలి
-
టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు
చంద్రగిరి: రైలు కింద పడి యువతి ఆత్మాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని నరసింగాపురం రైల్వేగేటు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు... తిరుపతి అక్కారంపల్లె సమీపంలోని ఉపాధ్యా య నగర్‌కు చెందిన రాధమ్మ, వాసు దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి బీకాం(కంప్యూటర్స్) పూర్తి చే సింది. ఇటీవల ఆమెకు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కరోనా నేపథ్యంలో హోమ్ టు వర్క్‌లో భాగంగా ఇంట్లో నుంచే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీలక్ష్మి తన స్కూటర్లో నరసింగాపురం రైల్వే పట్టాల వద్దకు చేరుకుని రైలు కింద పడింది. అయితే రైలు వెళ్లే క్రమంలో ఆమె తలకు గాయమై స్పృహ తప్పి పట్టాల మధ్యన పడింది. అనంతరం మరో రెండు రైళ్లు ఆమెపై నుంచి వెళ్లినప్పటికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు గుర్తించి, తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను స్విమ్స్‌కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే స్తున్నారు. అయితే శ్రీలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి:కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు) -
హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..!
సాక్షి, మంచిర్యాల: నేనొస్తే గేటు తీయరా..? అనుకున్నదేమో ఓ కొడే. మంచిర్యాల పట్టణం నుంచి హమాలీవాడకు వెళ్లే రైల్వే గేటు వద్ద గురువారం బీభత్సం సృష్టించింది. రైల్వే గేటు విరగ్గొట్టి ట్రాక్ దాటి అవతలి వైపు హమాలీవాడ వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఉదయం మార్కెట్లో మేతకు వచ్చిన ఆ కోడె 10 గంటలకు వెళ్తుండగా గేటు వద్దకు వచ్చి ఆగిపోయింది. రైలు వెళ్లిపోయినా గేటు తీయకుండా ఉంచుతారా అనుకుందేమో మూడు నాలుగు సార్లు గేటు విరగ్గొట్టేందుకు విశ్వప్రయత్నం చేసింది. రైల్వే సిబ్బంది కర్రతో కొట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించినా ఆగలేదు. అక్కడున్న వాహనదారులు కొడెను చూసి బెదిరిపోయారు. కోడె దాడి రైల్వేగేటు వంగి పోయింది. ఆ గేటును సరి చేసేందుకు రెండు గంటల సమయం పట్టింది. మరమ్మతులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చదవండి: గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కోడె గేటును సరి చేస్తున్న సిబ్బంది -
రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిపివేత..
-
చుక్కలు చూపించిన గూడ్స్ రైలు...
సాక్షి, కృష్ణా : కైకలూరు మండలం ఆలపాడు రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ఇంజన్లో నుంచి అనూహ్యంగా పొగలు రావడంతో ఉదయం 9 గంటలకు ఆలపాడు రైల్వే గేట్ నెంబర్ 93 దగ్గర రైలును నిలిపివేశారు. దీంతో పామర్రు నుంచి కత్తిపూడి(165) జాతీయరహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇరువైపులా రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా..సమాచారం తెలుసుకున కైకలూరు రూరల్ పోలీసులు, రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. -
చిన్న ఐడియాతో రైల్వేట్రాక్ దాటిన ఏనుగు
-
తెలివైన ఏనుగు; మెచ్చుకుంటున్న నెటిజన్లు
గజరాజులు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. ఏనుగులు వాటి తెలివితేటలను ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాయి. ఈసారి ఓ ఏనుగు తన గజబలాన్ని చూపించకుండా బుద్ధిబలాన్ని ప్రదర్శించింది. ఓ ఏనుగు నడుచుకుంటూ వెళ్తుండగా రైల్వేట్రాక్ ఎదురైంది. దీంతో అది వెనక్కు వెళ్లిపోలేదు. అలా అని వాటిని ధ్వంసం చేసి ముందుకు వెళ్లనూలేదు. ఓ చిన్న ఐడియాతో చాకచక్యంగా రైల్వేట్రాక్ దాటి అందరి ప్రశంసలు అందుకుంటోంది. నెమ్మదిగా తొండంతో రైల్వేగేటు ఎత్తి దాని కిందనుంచి పట్టాలపైకి చేరుకుంది. అటువైపు ఉన్న మరో గేటును కాస్త కిందకు వంచి తాడాట ఆడినట్టుగా జంప్ చేసి అవతలివైపుకు సురక్షితంగా చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోది. ఈ వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఏనుగులకు అవి నివసించే ప్రదేశాలు బాగా గుర్తుంటాయి. ఈ రైల్వేక్రాసింగ్‌లు వాటిని వెళ్లనీయకుండా ఆపలేవు’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఏనుగు తెలివితేటలకు నెటిజన్లు ముచ్చటపడిపోతున్నారు. కానీ కొంతమంది జంతుప్రేమికులు మాత్రం అది చేసిన పనికి కంగారు పడిపోయారు. ఒకవేళ ఆ సమయంలో రైలు వస్తే దాని పరిస్థితి ఏమయ్యేది అని ఆందోళన చెందారు. తెలివైన పనే కానీ ప్రమాదమైనదని నెటిజన్లు ఏనుగును మెచ్చుకుంటూనే సుతిమెత్తంగా తిడుతున్నారు. -
మానవ రహిత రైల్వే గేటు బాగు
పెడన : నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు. తాజాగా మానవ రహిత రైల్వే గేటును రూపొందించి ఆహో అనిపించారు. కళాశాలలో ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ గేటు నమూనాను రూపొందించి కళాశాలలో ప్రిన్సిపాల్ ఏబీ శ్రీనివాసరావు, హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఎదుట ప్రదర్శించారు. పరికరాలు.. పనితీరు.. మానవ రహిత రైల్వే గేటుకు ఆర్డీనో ఎలక్ట్రానిక్ పరికరం, ట్రాన్స్ఫార్మర్, బ్రిడ్జి రెక్టిఫైర్, కెపాసిటర్, అయస్కాంతాల సెన్సార్, సర్వే మీటరు, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించనున్నారు. ఆర్డీనో పరికరం ద్వారా రైల్వే గేటు నియంత్రణకు ఉపయోగిస్తారు. రైలు వచ్చే సమయంలో గేటు మూసుకోవడం, రైలు వెళ్లగానే తెరుచుకునేలా ఈ పరికరం ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫార్మర్ విద్యుత్‌ను అందిస్తుంది. బ్రిడ్జి రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే విద్యుత్‌ను తీసుకుని సమాంతర డీసీలోని 5 ఓల్టు విద్యుత్‌గా తగ్గించి అందిస్తుంది. ఇందుకు కెపాసిటర్‌ను వినియోగించారు. అయస్కాంత సెన్సార్లు రైలు వచ్చిన సమాచారాన్ని ఆర్డీనోకు సందేశాన్ని పంపిస్తుంది. ఎల్ఈడీ లైట్లను ఈ సెన్సార్లకు అనుసంధానం చేయడంతో అవి వెలిగేలా చర్యలు చేపట్టారు. ఉపయోగాలు మానవ రహిత రైల్వే గేటు వల్ల మానవ లోపాలు జరిగే నష్టాలను అరికట్టవచ్చు. రైలు రాకపోకల్లో జాప్యం జరిగినా ఎటువంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదు. సుదూర ప్రాంతాల్లో గేట్ కీపర్ ఒక్కడే ఉండాలంటే భయపడే పరిస్థితులు. ఇటువంటి చోట్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని అతివేగంగా ఆపరేట్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కనుగొన్నది వీరే.. వాసవిలో ట్రిపుల్ ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎ.మాధవితేజ, ఎం.హారిక, వి.చరణ్‌సాయి, ఎన్.సాయికొండ, ఏహెచ్‌వీ ప్రసాద్. ఐదు నెలలు పాటు శ్రమించి దీనిని రూపొందించారు. చదువుతోపాటు ప్రయోగాలు ముఖ్యమనే ఉద్దేశంతో. విద్యార్థులు చదువుతో పాటు ఏదైనా కొత్త తరహా ప్రయోగం చేస్తేనే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల ఆలోచనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇందుకు హెచ్ఓడీ జ్యోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులు ఈ ప్రయోగంలో విజయం సాధించడం చాలా అభినందనీయం. – కేవీవీఎన్ భాస్కర్,ప్రాజెక్టు గైడ్ -
గేటు వేయకుండానే రాకపోకలు !
దేవరకద్ర: దేవరకద్రలోని రైల్వేగేట్‌ను సోమవారం రాత్రి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దీంతో గేటు ఓ పక్కకు వంగి పోయింది. ఈ సందర్భంగా సైరన్ అదేపనిగా మోగడంతో రైల్వే గేట్ పడుతుందేమోనని వాహనదారులు ఉరుకులు, పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వచ్చి సైరన్‌ను నిలిపివేశారు. అలాగే, వంగిపోయిన గేటు మరమ్మతులకు యత్నించగా పనులు పూర్తికాలేదు. దీంతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను కాషన్ సిగ్నల్‌తో నడిపించారు. గేట్ వేయకుండానే సిగ్నల్ ఇస్తూ రైళ్లను ముందుకు కదిలించారు. కాగా, రాత్రి పొద్దుపోయే వరకు కూడా గేటు మరమ్మతు పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ఇస్రో చిప్‌లతో రైలు గేట్ల ప్రమాదాలకు చెక్
న్యూఢిల్లీ: కాపలా లేని రైల్వే గేట్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంది. ఇస్రో తయారుచేసిన ఉపగ్రహ సంబంధిత ఇంటిగ్రేటెడ్ చిప్‌లను రైలు ఇంజన్లలో అధికారులు అమర్చారు. వీటి ద్వారా గేటు సమీపంలోకి రైలు రాగానే ఒక సైరన్ మోగేలా ఏర్పాట్లు చేశారు. ఈ పద్ధతిని తొలుత ముంబై, గువాహటి రాజధాని రైళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. కాపలా లేని రైల్వే గేటుకు 500 మీటర్ల దూరంలోకి రైలు రాగానే ఈ చిప్ ద్వారా సిగ్నల్స్ యాక్టివేట్ అయి సైరన్ మోగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తమవుతారు. -
తిరుపతిలో తీరనున్న రైల్వేగేట్ కష్టాలు
-
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన డీసీఎం
యాదాద్రి భువనగిరి: భువనగిరి మండలం జగదేవ్‌పూర్ రోడ్డులోని రైల్వే గేట్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో రైల్వేగేట్ ధ్వంసమైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి వచ్చి మరమ్మతులు చేపట్టారు. -
వరంగల్‌లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం
వరంగల్ జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వేగేటు సమీపంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివానగర్, మైత్రేయ నగర్, పెరకవాడ, శాఖరాజ్ కుంట త దితర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో అధికారులు ఈ ప్రాంతాల్లో నివసించే వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించారు. -
రైల్వేగేట్‌ను తెరిచేవరకూ ఉద్యమం
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్‌ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్‌ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి దుర్మరణం
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీరాముల దేవాయలం సమీపంలోని కర్నూలు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. స్థానిక సీపర్స్ కాలనీకి చెందిన హమాలీ శ్రీనివాసులు, లక్ష్మీదేవి కుమారుడు విష్ణువర్ధన్ (13) పాతపేటలోని జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై బయటకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులోని కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. డోన్ ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రై వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రైల్వేగేట్ తెరవాలని రాస్తారోకో
ఆలేరు : రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ ఆదివారం ఆలేరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, ఎండీ సలీం, చెక్క వెంకటేశం, కుమార్, సిద్ధులు, నాగరాజు పాల్గొన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు .. రైల్వేగేట్‌ను తెరిపించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. గుజ్జ అశోక్, కూళ్ల సిద్ధులు, అఫ్జల్ తదితరులు దీక్షలో పాల్గొనగా మంగ నర్సింహులు, తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, ఎంఎ ఎక్బాల్, ఎనగందుల సురేష్, చామకూర అమరేందర్‌రెడ్డి, జూకంటి పెద్దఉప్పలయ్య, సలీం పాల్గొన్నారు. -
రైల్వే గేట్లు తొలిగిస్తే ప్రాణాలు పోయినట్లే
దొరవారిసత్రం : అక్కరపాక, మినమలముడి ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ రైల్వే గేట్లు తొలిగించి బాక్స్ టైప్ బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ప్రాణాలు పోయినట్లేనని గ్రామస్తులు రైతులు ప్రజాభిప్రాయం సేకరణలో జేసీ మహ్మద్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ గిరీషా, రైల్వే అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాక్స్‌టైప్ బ్రిడ్జి నిర్మాణంపై ఇప్పటికే మూడుసార్లు రైల్వే అధికారులు ప్రజాభిప్రాయం సేకరించిన చేపట్టిన ప్రయోజనం లేకుండాపోయింది. గురువారం మరోసారి తహసీల్దార్ కార్యాలయంలో అభిప్రాయసేకరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రైతులు వరి కోతలు, చెరుక పంటల సమయంలో లారీలు బ్రిడ్జిల కింద నుంచి రాలేవని, దీంతో ఇబ్బందులుపడుతామని, రైల్వే గేట్లు అలాగే ఉంచాలని కోరారు. జేసీ మాట్లాడుతూ విపత్తుల సమయంలో నీళ్లు నిలబడకుండా పంచాయతీల్లోని వ్యక్తులను ఉద్యోగులుగా రైల్వే అధికారులు నియమించారన్నారు. అంతేకాకుండా బాక్స్‌టైప్ బ్రిడ్జిలు నిర్మించినా ఉన్న గేట్లు తొలిగించకుండా క్లోజ్ చేయాలని, విపత్తుల సమయంలో ఆ గేట్లు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు విజేత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు, రైల్వే అధికారులు డీఈ రామ్‌ప్రసాద్‌రావ్, ఏడీఈ రాబిన్‌రాజన్, వివిధ పార్టీ నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
రైల్వే ట్రాక్‌పై వివాహిత అనుమానాస్పద మృతి
కడప నగరశివారులోని రాయచోటి రైల్వేగేట్ వద్ద వివాహిత యువతి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు గ్రామానికి చెందిన మన్యం శివజ్యోతి(25) ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివజ్యోతి భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ నేపధ్యంలో మరో వ్యక్తితో పరిచయం పెంచుకుందని గ్రామస్తులు చెబుతున్నారు. శివజ్యోతి మృతిపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఎడపల్లి(నిజామాబాద్ జిల్లా): ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదంలో తల భాగం నుజ్జునుజ్జు కావటంతో మృతుడు ఎవరన్నది గుర్తుపట్టడం కష్టంగా మారింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే గేటు వద్ద ప్రమాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామం రైల్వే గేటు వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. మృతుడు మెదక్‌జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామ వాసిగా గుర్తించారు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పెనుకొండ రైల్వేగేటు వద్ద ట్రాఫిక్‌జామ్
అనంతపురం జిల్లా పెనుకొండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం ట్రాఫిక్ జామ్ నెలకొంది. రైల్వే గేటు మరమ్మతుల్లో ఉందని అప్పటికప్పుడు రైల్వే సిబ్బంది బోర్డు తగిలించి.. మరమ్మతు పనులు మొదలుపెట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గేటు మూసివేయడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ఇతరత్రా వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు వద్ద వాహనాలను టర్న్ తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఖైరతబాద్‌లో రైల్వే గేట్ సమస్య
-
రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు
ధర్మవరం(అనంతపురం జిల్లా): ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వేగేటు వద్ద బుధవారం రైలు ఢీకొని నర్సింహులు(45) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నర్సింహులును ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
దూసుకొచ్చిన మృత్యువు
రైల్వే రెండు గేట్లను ఢీకొట్టి ఆటోపైకి వెళ్లిన లారీ ఆరుగురికి గాయాలు ఆటోడ్రైవర్ మృతి కైకలూరు /మండవల్లి : రైల్వే గేటు పడటంతో ఆగిన ఆటో పైకి ఎదురుగా ఉన్న రెండు గేట్లను ఢీకొని మరీ లారీ దూసుకొచ్చిన ఘటన సోమవారం రాత్రి మండవల్లి మండలం భైరవపట్నం గేటు వద్ద జరిగింది. గుడివాడ నుంచి కైకలూరుకు ఆరుగురు ప్రయాణికులతో వస్తున్న ఆటో భైరవపట్నం రైల్వేగేటు పడటంతో ఆగింది. ఇంతలో కైకలూరు వైపు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లారీ డ్రైవర్ రెండు గేట్లను గుద్ది మరీ ఎదురుగా ఉన్న ఆటోని ఢీకొట్టింది. అదే వేగంతో రైల్వే గేటు వద్ద ద్విచక్ర వాహనంతో కైకలూరు రావడానికి నిలిచి ఉన్న చలమలశెట్టి గంగాధర్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని సరస్వతి, లీలారాణి, మందా మోజేష్, చింతయ్య, మోహనరావులతో పాటు ఆటో డ్రైవర్ రవికి గాయాల య్యాయి. వీరిలో ఆటోడ్రైవర్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించినా ఫలితం లేకపోయింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రులకు కైకలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని సమాచారం. ఇదే రైల్వేగేటు వద్ద ఇటువంటి ఘటన ఏడాది క్రితం జరిగింది. అప్పుడు కూడా లారీ రెండు గేట్లను ఢీకొని ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ప్రకాశం(దొనకొండ): దొనకొండ మండలం రాగముక్కపల్లి రైల్వేగేటు వద్ద ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పైడిపోగు లక్ష్మయ్య(53)గా గుర్తించారు. కుటుంబసభ్యులతో గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన కలహాలు
గద్వాలటౌన్: భార్య తనను కాదని, ముగ్గురు పిల్లలను విడిచి వెళ్లింది. వారి బాగోగులు చూసుకోలేక.. భార్య మరొకరితో వెళ్లిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ భర్త తీవ్రంగా కలతచెందాడు. తోడులేని జీవితం ఎందుకని పెంచి పెద్దచేసిన ఆ చేతులతోనే తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చాడు. పరిస్థితి విషమించడంతో తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని రెండో రైల్వేగేట్‌కు సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న గుడిసెలో నివాసం ఉంటున్న కుర్మన్న(35), రాజ్యమ్మ సంచార జీవనం సాగిస్తూ.. బిందెల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుర్మక్క(9), నాని, ఇందు(5) ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భార్య రాజ్యమ్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందంటూ భర్త కుర్మన్న తరుచూ గొడవపడేవాడు. పలుమార్లు కులపెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచింది. అయినప్పటికీ రాజ్యమ్మలో మార్పు కనిపించలేదు. దీంతో కుర్మన్న మనస్తాపానికి గురై మద్యం తాగుడుకు బానిసయ్యాడు. మూడురోజుల క్రితం భార్య చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోవడంతో కుర్మన్న మరింత కుంగిపోయాడు. - శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పురుగు మందును కూల్‌డ్రింక్‌లో కలిపి ఉంచాడు. పిల్లలను నిద్రలేపి వారిచేత బలవంతంగా తాగించి తానూ సేవించాడు. ఇంతలో కుర్మన్నతో పాటు కూతుళ్లు కుర్మక్క, ఇందు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరో కూతురు నాని వాంతులు చేసుకుంది. వెంటనే సమీపంలో గుడారాల్లో నివాసముంటున్న బంధువులకు వెళ్లి చెప్పింది. చికిత్సకోసం వారిని హుటాహుటిన గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ముగ్గురూ ప్రాణాలు విడిచారు. చిన్నారి నాని ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటుంది. విషయం తెలుసుకున్న వెంటనే అర్ధరాత్రి సీఐ సురేష్, టౌన్ ఎస్ఐ సైదాబాబు ఆస్పత్రికి వచ్చి వివరాలు ఆరాతీశారు. మృతుడు కుర్మన్న బావమరిది పరశురాముడు ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు. ఆర్డీఓ పరామర్శ బతికి బయటపడిన నానిని ఆదివారం ఉదయం ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ఇన్చార్జి తహశీల్దార్ చింతామణి పటేల్ గద్వాల ఏరియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆస్పత్రిలో నానికి అందుతున్న వైద్యసేవలు, ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిట్టితల్లికి దిక్కెవరు? గద్వాలటౌన్ : పిల్లలకు విషమిచ్చి తండ్రితో పాటు ఇద్దరు కూతుర్లు మృతిచెందిన సంఘటన బుడగ జంగాల కుటుంబాల్లో విషాదం నింపింది. శనివారం అర్ధరాత్రి భార్యపై కోపంతో భర్త కుర్మన్న వారి కూతుర్లు కుర్మక్క, నాని, ఇందులకు పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తండ్రితో పాటు ఇద్దరు కూతుర్లు మృతి చెందగా నాని అనే ఏడేళ్ల చిన్నారి మృత్యువు నుంచి బయటపడింది. అయితే ఈ చిన్నారి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటుంది. సంచార జీవితం సాగిస్తున్న కుర్మన్న కుటుంబం చిన్నాభిన్నమైంది. కూతుర్ల మంచి చెడులు చూడాల్సిన తల్లి రాజ్యమ్మ పిల్లలను వదలివెళ్లడంతో నానికి దిక్కులేకుండాపోయింది. సమీప బంధువులు ఉన్నప్పటికీ వారు సైతం సంచార జీవితం సాగిస్తూ బతుకుతున్నారు. గుడారాల్లో నివాసముంటున్న వారి బంధువులు చందాలు వేసుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ఒంటరిగా మిగిలిన నానికి తల్లి ప్రేమ కరువైంది. తండ్రి, అక్కా, చెల్లెల్లు మృతి చెందిన విషయాన్ని సైతం అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. -
రైల్వేగేటును ఢీకొన్న ఐషర్ వాహనం
20 నిమిషాలు ఆలస్యంగా నడచిన రైలు ములకలచెరువు: రైల్వే గేటును ఐషర్ వాహనం ఢీకొనడంతో తిరుపతి-గుంతకల్లు రైలు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచింది. సోమవారం వేకువజామున 2.45గంటల తిరుపతి నుండి గుంతకల్లు రైలు వెళ్లే సమయంలో రైల్వే సిబ్బంది గేటు వేస్తుండగా మదనపల్లి నుంచి బత్తలపల్లి వైపునకు ట మాట లోడుతో వెళుతున్న ఐషర్ వాహనం గేటును ఢీకొంది. దీంతో గేటు మధ్యలో విరిగిపోయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం అందించి రైలును నిలిపేశారు. దీంతో 20 నిమిషాల వాహనాలు బారులు తీరాయి. రైల్వేసిబ్బంది గేటు మరమ్మతులు చేసిన అనంతరం రైలు బయలుదేరింది. సోమవారం మధ్యాహ్నం మదనపల్లె రైల్వే సిగ్నల్ అధికారి నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని గేటును పరిశీలించారు. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
జీవితాలు రైలు పట్టాలపై ఛిద్రం
కడప అర్బన్: నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన వారు క్షణికావేశంతో రైలు పట్టాల మధ్య తమ బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను, భార్య పిల్లల ఆశలను ఆవిరిచేస్తున్నారు. జిల్లాలో కడప నుంచి నందలూరు వైపు, కడప నుంచి ఎర్రగుంట్ల వైపు రెండు రైల్వే పోలీసుస్టేషన్లు, ఒక ఓపీ స్టేషన్ పరిధిల్లో 2012 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 236 మంది రైలు పట్టాలపై అసువులు బాసారు. * ఈ సంఘటనల్లో ఈ ఏడాది ప్రధానంగా కొన్ని సంచలనాలు కలిగించాయి. వాటి వివరాలిలా ఉన్నాయి. * 2012 సంవత్సరంలో 112 కేసులు నమోదు అయ్యూరుు. వాటిలో 99 మరణాల కేసులు, 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి. * 2013లో 104 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 96 కేసులు మృత్యువాత కేసులే. 80 మంది వివరాలు తెలిశాయి. మిగిలిన 16 మంది ఎవరనేది ఇప్పటికీ తెలియరాలేదు. వీటిలో ఎనిమిది ఇతర కేసులు. * 2014లో ఆగస్టు వరకు 54 కేసులు నమోదయ్యూరుు. వీటిలో 41 కేసులు మృత్యువాత పడిన కేసులే. ఈ కేసుల్లో 42 మంది మృతి చెందారు. మిగిలిన 13 కేసులు ఇతర నేరాలకు సంబంధించినవి. * 2014లో ప్రధానంగా సంచలనం కలిగించిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. జనవరి 27వ తేదీన చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన లక్ష్మిరెడ్డి భార్య సావిత్రిని హత్య చేసి రాయచోటి రైల్వేగేటు సమీపంలో మూటగట్టి పడేశారు. హత్యను కప్పిపుచ్చేందుకు కొందరు నిందితులు ప్రయత్నించారు. ఈ సంఘటనలో బంధువుల ఫిర్యాదు మేరకు ఆమెను హత్య చేశారని తేలడంతో రైల్వే పోలీసులు కేసును తాలూకా పోలీసులకు బదిలీ చేశారు. ఆ సంఘటనలో నిందితులను కూడా అరెస్టు చేసి కటకటాలపాలు చేశారు. * ఈ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఒకేషనల్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు రాయచోటి రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. * ఈ సంవత్సరం మొదట్లో ఫాతిమా మెడికల్ కళాశాల సమీపంలో మాజీ సైనికోద్యోగి మారుతీ (40) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను కమలాపురం ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. * ఆగస్టు 4వ తేదీన కడప నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీయట్ విద్యార్థులు స్నేహితులుగా ఉండి రైలు పట్టాల మధ్య తమ జీవితాలను బలి తీసుకున్నారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన లోకేష్‌నాయక్, మృత్యుంజయకుంటకు చెందిన శివతేజరెడ్డిలు ఆగస్టు 3వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమో, ఇతరత్రా కారణాలతోనో ఆత్మహత్యకు పాల్పడ్డారు. లోకేష్‌నాయక్ తన మరణానికి కొన్ని రోజుల ముందు ‘ఐ వాంట్ టు డై’ అని నోటు పుస్తకంలో రాసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరి మరణం వెనుక అసలు కారణాలను ఇంకా రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. * అలాగే గత ఏడాది చివరిలో మాధవరానికి చెందిన జె.రవి అనే యువకుడు ఓబులవారిపల్లె ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. డబ్బును పంచేందుకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకు వస్తుండగా చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో దోపిడీ జరిగింది. తర్వాత ఒంటిమిట్ట సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. * బద్వేలు సుమిత్రానగర్‌కు చెందిన కొత్తకోట రమేష్‌బాబు అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన భాకరాపేట సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తాను చనిపోతున్నానని, ఎవరికీ సంబంధం లేదని, తల్లిదండ్రులు బాధపడవద్దని చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. * కడప నబీకోటలో నివసిస్తూ ఒంటిమిట్ట హౌసింగ్ ఏఈగా పనిచేసి అనారోగ్యంతో సంవత్సరకాలంగా ఇంటి వద్దనే ఉన్న సింగారెడ్డి రామిరెడ్డి (51) ఆగస్టు లో రాయచోటి రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. ఇలా క్షణికావేశానికి లోనై రైలు పట్టాల మధ్య తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. -
వేసున్న రైల్వేగేటు దాటితే.. జేబుకు చిల్లే!
-
రక్షణ కరువే
కర్నూలు(రాజ్‌విహార్): రైల్వే గేటు.. క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణకు తొలి మెట్టు. కాని వీటిని ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గేటు లేక, కాపలాదారుడు కనిపించక రైలు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోకుండా పలువురు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పొతున్నారు.అయినా పాలకుల్లో స్పందన కరువైంది. గతంలో కర్నూలుకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మూసాయిపేట వద్ద పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానికంగా ఉన్న రైల్వే గే ట్లు, కాపలాదారులు లేని పట్టాలను తలుచుకొని భయాందోళనకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో రైల్వే -రోడ్డు క్రాసింగ్ వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. అందులో కొన్ని దుర ్ఘటనలు.. కల్లూరు మండలం చెట్ల మల్లాపురం గ్రామ వద్ద 2012 మార్చి 31వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొని ఐదు మంది యువకులు దుర్మరణం పాలయ్యారు. అక్కడ పట్టాల వద్ద గేటు, కాపలాదారుడు లేని కారణంగా వివాహ వేడుకలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన డ్రమ్స్ వాయిద్యకారులు చనిపోయారు. కోసిగి మండలం ఐరన్‌గల్లు గ్రామం వద్ద 2005 మే 18వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కోనడంతో ఐదు మంది వ్యవసాయ కూలీలు చనిపోయారు. అక్కడ గేటు, కాపలాదారుడు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోను రైలు ఢీకొంది. అయితే, ఇప్పటికీ అక్కడ గేటును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 2009లో బేతంచెర్ల పట్టణంలో జరిగిన చెన్నకేశవ స్వామి తిరునాలతో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గేటు దాటుతున్న హనుమాన్ నగర్ బాలికను రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డోన్ మండలం బి. రామదుర్గం వద్ద రెండేళ్ల క్రితం రైల్వే ట్రాక్‌కు గేటు లేని కారణంగా పట్టాలు దాటుతున్న ఆర్టీసీ డోన్ డిపో బస్సును రైలు ఢీకొంది. ఫలితంగా డ్రైవర్ జంగాల రాముతోపాటు బట్టల వ్యాపారి ఈశ్వరయ్య చనిపోయారు. వెల్దూర్తి మండలం గుంటపల్లి వద్ద ఏడేళ్ల కిత్రం పట్టాలు దాటుతూ ఇద్దరు చనిపోగా అలాగే సూదెపల్లె వద్ద ఐదేళ్ల క్రితం ఒకరు చనిపోయారు. ఇక మూ గజీవాల గురించి చెప్పనక్కరలేదు. పట్టాలు దాటాలంటే భయం..భయం! నూనెపల్లె: నంద్యాల రైల్వేస్టేషన్ కేంద్రంగా గుంటూరు, గుంతకల్ డివిజన్లున్నాయి. డోన్ నుంచి ఊడుమాల్పురం వరకు గుంతకల్ డివిజన్, నంద్యాల నుంచి గజ్జలకొండ వరకు గుంటూరు డివిజన్లు కాగా గిద్దలూరు స్టేషన్ వరకు నంద్యాల బ్రాంచిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో చాలా వరకు కాపలాలేని గేట్లు అనేకంగా ఉన్నాయి. డోన్ నుంచి నంద్యాల వరకు మొత్తం 16 గేట్లు ఉండగా అందులో 11 మ్యాన్గేట్లు, 5 అన్మ్యాన్గేట్లున్నాయి. అలాగే నంద్యాల నుంచి గిద్దలూరు వరకు 23 గేట్లు ఉండగా 9 అన్‌మ్యాన్ గేట్లున్నాయి. రైళ్లు వేగంగా వచే ్చటప్పుడు కాపలాలేని గేట్ల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
మృత్యు మార్గాలు
► పట్టాలపై పొంచి ఉన్న ప్రమాదం ►రైల్వే గేట్ల వద్ద కాపలా కరువు ► మొద్దు నిద్రలో రైల్వే శాఖ ►ప్రత్యామ్నాయ రక్షణ చర్యలపై నిర్లక్ష్యం గోదావరిఖని బొగ్గు గనుల నుంచి రామగుండం రైల్వేస్టేషన్ వరకు ఉన్న రైల్వేలైను బద్రిపల్లి గ్రామానికి మధ్యలో నుంచి ఉండడం, రైల్వే యార్డులో లైన్స్ క్లియర్‌గా లేకపోవడంతో గూడ్సురైలు గంటల తరబడి అక్కడే నిలిపివేస్తున్నారు. ఆసమయంలో గ్రామస్తులు, విద్యార్థులు గూడ్సు రైలు కింద నుంచి దూరి వెళ్తున్నా రు. అయినా అక్కడ ఎలాంటి కాపలా లేదు. దు రదృష్టవశాత్తు రైలు కదిలితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారో అధికారులకే తెలియాలి. మల్యాలపల్లిలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఎలాంటి కాపలా లేదు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు రక్షణ చర్యలు తీసుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడ మల్యాలపల్లికి చెందిన ఈర్ల నారాయణ అనే వ్యక్తి టాటాఏస్ వాహనంతో గూడ్సు రైలును గమనించక పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొనడంతో ఆయన కాళ్లు విరిగాయి. వాహనం నుజ్జునుజ్జు అయింది. రైలు వస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వెళ్లి ప్రమాదానికి కారణమయ్యావని అధికారులు బాధితుడిపైనే కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. తెరిచే ఉంటున్న గేట్లు గంగాధర: కరీంనగర్-నిజామాబాద్ రైల్వే రూట్లో రైల్వే క్రాస్ రోడ్ల వద్ద గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. రైలు వచ్చేప్పుడు హారన్ వినిపిస్తేనే వాహనాలు నిలుపుకుంటున్నారు. ఒకవేళ హారన్ వినిపించకపోతే ప్రమాదానికి గురికావల్సిందే. గతంలో గంగాధర చౌరస్తాకు సమీపంలో రైల్వే గేట్ వద్ద రైలును గమనించక ఓలారీడ్రైవర్ పట్టాలు దాటుతూ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనుక వస్తున్న ద్విచక్రవానం లారీకి ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. రామడుగు మండలం దేశరాజుపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రైల్వే గేట్ దాటుతున్న ట్రాక్టర్‌ను రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరుగలేదు. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో ఉన్న రైల్వే గేటు వద్ద కాపలా లేదు. రామడుగు మండలం వెదిర క్రాస్ రోడ్డు నుంచి గోపాల్రావుపేట ప్రధాన రహదారిలో రాజాజీనగర్, దేశరాజుపల్లి, కొడిమ్యాల మండలం నమిలికొండ, పూడూరు, మల్యాల మండలం నూకపల్లిలో ఉన్న రైల్వే గేట్ల వద్ద ఎలాంటి కాపలా లేదు. లింగంపేటలోనూ ఇదే దుస్థితి జగిత్యాల రూరల్ : మండలంలోని లింగంపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం పొంచి ఉంది. గ్రామ శివారులో, అంతర్గాం గ్రామ శివారులో ఉన్న రైల్వే గేట్ల వద్ద ఎలాంటి కాపలా లేదు. ఇక్కడ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. ఉదయం 5 గంటలకు జగిత్యాల-కాగజ్‌నగర్ రైలు, సాయంత్రం 6 గంటలకు కాగజ్‌నగర్-జగిత్యాల రైలు వస్తోంది. కాపలా లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
కాపలా లేని క్రాసింగ్‌లు
మేడ్చల్/ మేడ్చల్ రూరల్: ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా రైల్వే గేట్ల (క్రాసింగ్) వద్ద కాపలా పెట్టకపోవడం రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేక పాఠశాల బస్సు ప్రమాదానికి గురైన సంఘటనతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. మండలంలోని డబిల్పూర్ గ్రామ సమీపంలోని కోనాయిపల్లి శివారులో రైల్వే క్రాసింగ్ ఉన్నా అక్కడ కాపలా ఏర్పాటు చేయలేదు. నిత్యం ఈ ప్రాంతం మీదుగా నూతన్‌కల్, కోనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రాసింగ్ వద్ద వెంటనే గేట్ ఏర్పాటు చేసి కాపలాదారులను నియమించాలని కోరుతున్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటడానికి ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం ప్రమాదకరంగా పట్టాల మీద నుంచి దాటుతున్నారు. ప్రయాణికులతో పాటు సమీప కాలనీ ప్రజలు, జాతీయ రహదారిపై నుంచి కాలి నడకన వచ్చే వారు పట్టాలు దాటి గ్రామానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు. గేట్లు లేక పొంచి ఉన్న ముప్పు తాండూరు రూరల్: తాండూరు రైల్వే స్టేషన్ నుంచి వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే రైల్వే మార్గంలో క్రాసింగ్‌ల వద్ద గేట్లు లేక ప్రమాదం పొంచి ఉంది. తాండూరు మండలం చెన్‌గేస్‌పూర్, ఎల్మకన్నె గ్రామానికి వెళ్లే దారిలో చెన్‌గేస్‌పూర్ శివారు క్రాసింగ్ వద్ద రైల్వే గేటు లేదు. ఆ రైల్వే మార్గం నుంచి విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి సిమెంట్ కోసం గూడ్స్ రైళ్లు వెళ్తుంటాయి. నెలకు నాలుగు సార్లు విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ ఉత్పత్తుల కోసంగూడ్స్ రైళ్లు వస్తుంటాయి. గేటు లేకపోవడంతో ఏక్షణాన గూడ్స్ రైలు వస్తుందో తెలియక ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. చంద్రవంచ దర్గా-కరన్‌కోట్ వెళ్లే మార్గంలోని కూడా ఇదే పరిస్థితి. ఈ మార్గంలో కరన్‌కోట్, ఓగిపూర్ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాపలాదారుడు లేక.. నవాబుపేట: కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని గొల్ల గూడ, మమ్మదాన్‌పల్లి, గేట్‌వనంపల్లి, కడ్చర్ల గ్రామాల వద్ద ైరె ల్వే గేట్లు ఉన్నాయి. వీటిలో గొల్లగూడ రైల్వే గేటు వద్ద కాపలాదారు లేక ఎప్పుడూ గేట్ వేసి ఉంటుంది. వాహనదారులు వెళ్లి గేట్ తీయాలని స్టేషన్ మాస్టర్‌ను అడిగితే వచ్చి గేటు తీసి వాహనాలు వెళ్లగానే మళ్లీ మూసివేస్తారు. ఇక్కడి నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేటు మూసి ఉన్నప్పటికీ ప్రమాదమని తెలిసినా బైక్‌లపై వెళ్లేవారు గేటు కింది నుంచి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గేటు వద్ద కాపలా దారున్ని నియమించాలని కోరుతున్నారు. మూగజీవాల మృత్యువాత మర్పల్లి: కాపలాలేని గేట్లతో వాహనదారులు, దారిన వెళ్లే ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. మండల పరిధిలోని కొత్లాపూర్ నుంచి కోటమర్పల్లి వెళ్లే దారిలో రైల్వే గేటు నుంచి నిత్యం వందలాది మంది రైతులు తమ పశువులను తోలుకుంటూ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. కోటమర్పల్లి గ్రామానికి వెళ్లే వాహనదారులు ఈ గేటు నుంచే వెళ్తారు. గేటు వద్ద కాపలాదారు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రైళ్లు ఢీకొని కొత్లాపూర్ గ్రామానికి చెందిన కావలి నర్సింలువి మూడు ఎడ్లు, బుర్రకాయల నర్సింలుకు చెందిన రెండు ఎద్దులు, గొల్ల లక్ష్మయ్యకు చెందిన మరో ఎద్దు మృత్యువాత పడ్డా యి. మర్పల్లి నుంచి కోహీర్ వైపు వెళ్లే రైల్వే లైన్లో సిగ్నల్ వద్ద గేటు నుంచి కూడా వందలాది మంది రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఇక్కడ రైలు ఢీకొని ఓ గేదె మృత్యువాత పడింది. కాపలావారు ఉం డక పోవటంతో ఈ గేటు నుంచి ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. -
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
మూర్చవ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం ధర్మవరం టౌన్ : పట్టణంలోని గాంధీనగర్ రైల్వే గేట్ వద్ద బుధవారం స్థానిక ఇందిరానగర్‌కు చెందిన నారాయణమ్మ(19) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. భవన నిర్మాణ కార్మికులైన యల్లమ్మ, ఓబిలేషు దంపతుల కుమార్తె నారాయణమ్మకు చిన్ననాటి నుంచే మూర్చవ్యాధితో బాధపడుతుండేది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి చికిత్స చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఈ వ్యాధి కారణంగా పెళ్లి సంబంధాలు కూడా కుదరడం లేదు. దీంతో ఇక తనకు ఈ వ్యాధి నయం కాదని నారాయణమ్మ తరచూ మదనపడుతుండేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి ఆమె రైలు కింద పడి బలవన్మరణం పాలైంది. స్థానికులు గుర్తించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోదించిన తీరు కలచి వేసింది. రైల్వే ట్రాక్ మధ్యలో పడి ఉన్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జామర్‌ను ఢీకొట్టిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్
డైవర్‌కు స్వల్ప గాయాలు హిందూపురం, . అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో కాపలా లేని రైల్వే గేటు దగ్గర బుధవారం ఉదయం జామర్ కారును కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.దాంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హిందూపురం పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం డీఎల్-2సీఎం 6650 నంబరు గల రిమోట్ ఆపరేషన్స్‌ను నిర్వీర్యం చేసే జామర్కారు తీసుకొచ్చారు. దీన్ని ఎస్పీజీకి చెందిన డ్రైవర్ మానస్భగత్ సభా ప్రాంగణం నుంచి రైల్వేట్రాక్ సమీపంలో పరీక్షించేందుకు తీసుకెళ్లారు. సమీపంలోని కాపలాలేని రైల్వే ట్రాక్‌ని దాటాల్సి ఉంది. అదే సమయానికి కాచిగూడ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోంది. ఈలోపు పట్టాలు దాటిపోవచ్చని డ్రైవర్.. జామర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతలోనే వేగంగా వచ్చిన రైలు కారుని ఢీకొంది. దాంతో కారు పల్టీకొట్టి రైల్వే గేటుకి అమర్చిన ఇనుప స్తంభాలకు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. -
రైలు పట్టాలపై శవమై..
కడప అర్బన్/చింతకొమ్మదిన్నె, న్యూస్‌లైన్ : రాయచోటి మార్గంలోని రైల్వేగేటుకు సమీపంలో రైలు పట్టాలపై సోమవారం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఊటుకూరు గ్రామానికి చెందిన పలవలి సావిత్రమ్మగా(42) గుర్తించారు. మృతురాలు ఈనెల 25వ తేదీ ఉదయం తమకు రావాల్సిన బాకీ డబ్బుల కోసం సుజాత ఫోన్ చేయడంతో ఆమె ఇంటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రైల్వే, తాలూకా, చింతకొమ్మదిన్నె పోలీసుల, సావిత్రమ్మ భర్త లక్ష్మిరెడ్డి, బంధువుల కథనం మేరకు... చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన పలవలి సావిత్రమ్మ ఆశ వర్కర్‌గా, ఓ పొదుపు సంస్థ ఏజెంటుగా వ్యవహారిస్తోంది. ఇటీవల స్థలం అమ్మగా వచ్చిన భారీమొత్తాన్ని అవసరానికి ఇస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామంలోని సుజాత ద్వారా చాలామందికి వ్యక్తిగత రుణాలిచ్చింది. ఈనెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు సుజాత ఫోన్‌చేసి రుణాలకు సంబంధించి డబ్బులు ఇస్తారని, రావాలని చెప్పడంతో వెళ్లిన సావిత్రమ్మ అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అన్నిచోట్ల వెతికిన కుటుంబ సభ్యులు ఆదివారం చింతకొమ్మదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రైలుపట్టాలపై మృతదేహమై కనిపించింది. ఈ మృతదేహాన్ని ఓ గోనె సంచిలో తెచ్చి రైలు పట్టాలపై పడేసినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయి. ట్రైనీ డీఎస్పీ కల్పన, కడప రూరల్, అర్బన్ సీఐలు రాజగోపాల్‌రెడ్డి, శివన్న, తాలూకా ఎస్ఐ బాల మద్దిలేటి, చింతకొమ్మదిన్నె ఎస్ఐ బందేసాహెబ్, రైల్వే హెడ్ కానిస్టేబుల్ పీవీ రమణ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో విచారించారు. మృతురాలి భర్త లక్ష్మిరెడ్డి రాడ్ బెండర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి కుమారుడు రమేష్‌రెడ్డి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండవ కుమారుడు సాయిరాంరెడ్డి పదవ తరగతి వరకు చదువుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కేసు నమోదు సావిత్రమ్మ మృతిని రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం బృందం పరిశీలించింది. డాగ్‌స్క్వాడ్ సుజాత ఇంటి, రైల్వేట్రాక్ పరిసర ప్రాంతంలో సంచరించింది. సుజాతను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన సావిత్రమ్మ బంధువులు తమకు న్యాయం జరగలేదని ఊటుకూరు ప్రాంతానికి చెందిన స్థానికులతో కలిసి సోమవారం రాత్రి తాలూకా పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అర్బన్ సీఐ శివన్న, తాలూకా ఎస్ఐ బాల మద్దిలేటి బాధితులతో మాట్లాడుతూ కేసు బదిలీ కాగానే దర్యాప్తు ప్రారంభిస్తామని నచ్చజెప్పారు.